swine flu deaths
-
'స్వైన్' విహారం
సాక్షి, నెట్వర్క్/అమరావతి: రాష్ట్రాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట కేసులు నమోదవుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కలిపి 300 కేసులకు పైగా నమోదైనప్పటికీ సర్కారు మాత్రం ఆ సంఖ్యను తక్కువచేసి చూపిస్తోంది. రాష్ట్రంలోని చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాధారణ జ్వరాలు, జలుబు లక్షణాలున్నా బాధితులు భయంతో ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. చిన్నారులు, పసికందులకు సైతం ఇది సోకుతుండడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు.. వ్యాధి ప్రబలుతుండడంతో వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది తమకు ఎక్కడ సోకుతుందోనని భయాందోళన చెందుతున్నారు. పలుచోట్ల వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో వైద్యుల సూచనల మేరకు బాధితులు హైదరాబాద్, బెంగళూరు, వెల్లూరులోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో వైరస్ ఎక్కువగా ఉండడంవల్ల ఇక్కడ ఆ ప్రభావం తీవ్రంగా ఉంటోందని.. అలాగే, చలితీవ్రత కూడా వ్యాధి ప్రబలడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. భారీగా కేసులు నమోదు స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న కేసుల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. వీటిలో చాలా నిర్ధారితమవుతున్నాయి. ఉదాహరణకు.. చిత్తూరు జిల్లాలో 77మంది, విశాఖలో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 64మంది, కర్నూలులో 49మంది, గుంటూరులో 35మంది, నెల్లూరులో 18మంది, విజయనగరంలో 13మంది, అనంతపురంలో 15మంది, శ్రీకాకుళంలో 11మంది వైఎస్సార్ జిల్లాలో 10మంది, ప్రకాశంలో నలుగురు, తూర్పుగోదావరి, కృష్ణాలో ముగ్గురేసి చొప్పున స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. కానీ, ఇక్కడ వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్నదని, సామాన్యులకు అందుబాటులో ఉండడంలేదని బాధితులు వాపోతున్నారు. చికిత్స కోసం అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లాలో 3నెలలు, 11నెలలున్న ఇద్దరు మగ శిశువులకూ ఈ వ్యాధి సోకింది. పర్యాటక ప్రాంతాలైన విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో జనం తాకిడివల్ల ఎక్కువ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. సౌకర్యాలూ అంతంతమాత్రం స్వైన్‌ఫ్లూ బాధితులు పెద్ద సంఖ్యలో వస్తున్నా చాలాచోట్ల ఏర్పాట్లు మొక్కుబడిగా ఉంటున్నాయి. అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ), క్యాజువాలిటీ (ఎమర్జెన్సీ)లోని వైద్యులకు వ్యాక్సిన్, ఎన్95 మాస్కులు పలుచోట్ల అందుబాటులో లేవు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేస్తున్నప్పటికీ దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వ్యాధి నిర్ధారణకు ఎటువంటి కేంద్రాలు లేకపోవడంతో బాధితులు విశాఖలోని కేజీహెచ్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. విజయనగరంలోని స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించకుండా నేరుగా విశాఖకు వెళ్తుండడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. అలాగే, అనంతపురం జిల్లా కేంద్రంలోనే పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ పరికరాల్లేవు. అనుమానిత కేసులకు త్రోట్ స్వాప్ తీసేందుకు వైరల్ కిట్ అందుబాటులో లేదు. ఇక్కడ ముందస్తు చర్యలూ తీసుకోలేదు. తూతూమంత్రంగా కరపత్రాలు పంచి చేతులు దులుపుకున్నారు. వ్యాక్సిన్లు, మాస్క్‌లు లేక వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్ ఏర్పాటుచేయలేదు. చిత్తూరు జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో బాధితులకు కనీసం మాస్క్‌లు ఇచ్చే పరిస్థితిలేదు. ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో రోగులు బెంగళూరు, చెన్నై, వేలూరులోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మరణాలూ ఎక్కువే.. స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం ఒక కారణమైతే.. సరైన వైద్యం అందక మృత్యువాత పడడం మరో కారణం. అంతేకాదు, మధుమేహం, గుండెజబ్బు, కిడ్నీ, నరాల సంబంధ వ్యాధుల వారు స్వైన్‌ఫ్లూతో రోగనిరోధక శక్తి కోల్పోయి మరణిస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు కర్నూలులో అత్యధికంగా 17మంది, ఆ తర్వాత స్థానంలో గుంటూరు 10మంది, చిత్తూరు జిల్లాలో 8మంది, విజయనగరంలో ఐదుగురు, విశాఖలో నలుగురు, ప్రకాశం, నెల్లూరులలో ముగ్గురేసి, తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో ఇద్దరేసి, కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో ఒకరేసి చొప్పున మృత్యువాతపడ్డారు. కాగా, నెల్లూరు జిల్లాలో మృతిచెందిన ముగ్గురికీ స్వైన్‌ఫ్లూ ఉన్నా వారు వేరే కారణాలతో మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత లక్షణాలు – విపరీతంగా ఆయాసం వస్తుంది – రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడంవల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది – నాలుక, గోళ్లు నీలిరంగులోకి మారతాయి – ముక్కులోంచి నీళ్లు కారడం.. దగ్గు ఎక్కువగా వస్తుంది – కళ్లు బాగా ఎర్రబడతాయి ఎవరెవరికి ఎక్కువ ప్రమాదం.. – మూడేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు, గుండెజబ్బు, మధుమేహం, కిడ్నీ, నరాల సంబంధిత సమస్యలున్న వారికి ఈ వ్యాధి సోకితే ఎక్కువ ఇబ్బంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు – వ్యాధి లక్షణాలు సోకిన 48 గంటల్లోనే చికిత్స మొదలుపెట్టాలి – బాధితుల్ని ప్రత్యేక వార్డులో, ఇంట్లో అయితే ప్రత్యేక గదిలో ఉంచాలి – దగ్గు వచ్చినప్పుడు రెండు చేతులు అడ్డుపెట్టుకుని దగ్గాలి.. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి – ముక్కు ప్రాంతాన్ని ఎక్కువగా చేతితో తాకకూడదు – బాధితులు నలుగురిలోకి వెళ్లడం మంచిది కాదు – వ్యాధి సోకిన వారు కనీసం వారం రోజులపాటు బయటకు వెళ్లకూడదు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం ఇప్పటివరకూ రాష్ట్రం మొత్తం మీద 288 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. పదమూడు మంది బాధితులు మృతిచెందారు. నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నాం. నిర్ధారణకుగానీ, చికిత్సకుగానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లుచేశాం. తగినన్ని వెంటిలేటర్లు ఏర్పాటుచేశాం. స్వైన్‌ఫ్లూ నియంత్రణకు కావాల్సిన అన్ని మందులూ అందుబాటులో ఉంచాం. త్వరలోనే వైరస్ అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తెలంగాణ, తమిళనాడుల్లోనూ ఈ వైరస్ తీవ్రంగా ఉంది. – డా. అరుణకుమారి, ప్రజారోగ్య సంచాలకులు రూ.6 లక్షలకు పైగా ఖర్చు పెట్టాం నా భార్య ఆశాలత కర్నూలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వార్డెన్‌గా పనిస్తోంది. ఆమెకు దగ్గు, ఆయాసం రావడంతో స్థానిక ప్రైవేటు వైద్యుని వద్దకు వెళ్తే వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్‌కు వెళ్తే అక్కడ వెంటిలేటర్లు సరిపడా లేవని పంపించేశారు. దీంతో అక్కడే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. ఆమె వైద్యం కోసం రూ.6 లక్షలకు పైగా ఖర్చు పెట్టాం. – మద్దిలేటి, స్వైన్‌ఫ్లూ మృతురాలు ఆశాలత భర్త, కర్నూలు -
స్వైన్ ఫ్లూ..సైరన్...!
గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా ‘స్వైన్ ఫ్లూ’ వ్యాధి వీర విహారం చేస్తోంది.ఇప్పుడు ఈ పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు.ఎంతలా అంటే బుధవారం ఎర్రగుంట్ల పరిధిలోని చిలంకూరులో చిరు వ్యాపారం చేసుకొనే ప్రదీప్‌కుమార్ (45) ఈ వ్యాధి కారణంగా చనిపోయాడు. గ్రామస్తులు భయపడి మృత దేహన్ని గ్రామంలోకి రానీయలేదు. ఈ నేపథ్యంలో అధికారులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. రెండు నెలల క్రితం ప్రొద్దుటూరులోని విజయనగరం వీధికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి బెంగళూరులో చికిత్స పొందుతూ మరణించాడు.జనవరిలో ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు గ్రామానికి చెందిన చెంగమ్మ అనే వృద్ధురాలు మృతిచెందింది. ఈమె మరణం ఒక్కటే అధికారిక లెక్కల్లో ఉంది. అనధికారికంగా పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజలు కలవరపడుతున్నారు. కడప రూరల్: ప్రస్తుత సీజన్ ఏ ఘడియలో అడుగు పెట్టిందో తెలియదు గానీ జిల్లాపై రోగాలు దండ యాత్ర చేస్తున్నాయి. అందులోనూ ‘స్వైన్ ఫ్లూ’ వ్యాధి అన్ని ప్రాంతాల్లోకి చొచ్చుకు పోతోంది. దీంతో జనాల బాధలు వర్ణణాతీతంగా మారింది. ఎప్పుడూ లేదు సాధారణంగా జిల్లాలో వైరల్ జ్వరాలు నమోదవుతుంటాయి. స్వైన్ ఫ్లూ కేసులు అరుదుగా ఉంటాయి. గతంలో ఏనాడు లేనివిధంగా గడచిన జనవరి నుంచి ఇప్పటి వరకు అధికారికంగా 44 కేసులు, అనధికారికంగా పలు కేసులు నమోదవుతున్నాయి. ఇది వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే జిల్లాను డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ తదితర వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పుడు స్వైన్ ఫ్లూ ప్రధాన సమస్యగా మారింది. వ్యాధిని కనిపెట్టేలోపే... జిల్లా వ్యాప్తంగా కడప రిమ్స్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖలో 75 పీహెచ్‌సీలు, 11 పట్టణ ఆరోగ్య కేందాలు, వైద్య విధాన పరిషత్‌లో 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. అయితే వ్యాధి నిర్ధారణకు సంబంధించిన పరీక్షల కేంద్రం ఒకటి కూడా ఇక్కడ లేకపోవడం దారుణం. కాగా కేసుల తీవ్రతను బట్టి కడప రిమ్స్‌లో ఇటీవల ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది సేవలు అందించడానికి మరికొన్నాళ్లు వేచి చూడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. తిరుపతిలోని స్విమ్స్ హస్పిటల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపడతారు. అధికారికంగా జిల్లాకు సంబంధించి ఏ రోగికైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి గొంతు, ముక్కు నుంచి తీసిన గల్ల లాంటి పదార్థాన్ని తిరుపతికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వ్యాధి ఉండేది, లేనిది నిర్ధారిస్తారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకున్న వారికే ఆ సౌకర్యం ఉంటుంది. ఆ కేసులనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించిన వారు ఆ శాఖ పరిధిలోకి రారు. ఈ కారణంగా అనధికారికంగా ఎక్కువ కేసుల నమోదవుతున్నాయి. రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. అక్కడా కుదరకపోతే ప్రాణాలను కాపాడుకోవడానికి హైదరాబాద్, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. వ్యాధిని కనిపెట్టేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కాగా వైద్య ఆరోగ్య శాఖ వ్యాధులను అరికట్టడంలో వైఫల్యం చెందిందనే ఆరోపణలు వస్తున్నాయి. దోమలపై పోరాటం చేయవచ్చు. వైరల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. అయి తే గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్‌కు తాము ఎలా అడ్డుకట్ట వేయగలం అని అ శాఖ వర్గాలు అంటున్నాయి. వాతావరణం కాలుష్యం కారణంగా ఇదంతా జరుగుతోందని వారంటున్నారు. హెచ్ 1, ఎన్ 1 వైరస్ కారణంగా... ఈ వ్యాధికి దోమలతో ఎలాంటి సంబంధంలేదు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే అంటు వ్యాధి లాంటిది. ఇది హెచ్ 1, ఎన్ 1 వైరస్. గతంలో ఈ వ్యాధికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సీజన్‌గా ఉండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. ఏడాది పొడుగునా ఉంటోం ది. పరిసరాల అపరిశుభ్రత, వాతావరణంలో అనూహ్యంగా చేసుకుంటున్న మార్పులు.. వ్యక్తిగత శుభ్రతపై కొరవడిన అవగాహన. ఇవన్నీ వైరస్‌కు వరంగా మారాయి. ఫలితంగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వైరస్ పందుల ద్వారా సంక్రమించేది. అనగా ‘స్వైన్’ అంటే పంది ‘ఫ్లూ’ అంటే జలుబు. తుమ్ములు, దగ్గుల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తోంది. -
స్వైన్ ఫ్లూపై విజయసాయిరెడ్డి ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం జీరోఅవర్‌లో ఆయన మాట్లాడారు. ఏపీలో 2016 సంవత్సరంలో 12 మంది స్వైన్‌ఫ్లూ వైరస్ సోకగా ఐదుగురు చనిపోయారని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో 26 మంది స్వైన్‌ఫ్లూ బాధితులకు గాను ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టటంలో యంత్రాంగం విఫలమయిందని ఆరోపించారు. వ్యాధి తీవ్రతను గుర్తించలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంత్రిని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. -
డిప్యూటీ సీఎం దంపతులకు స్వైన్ ఫ్లూ
తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న మహమ్మారి హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఒక్క తెలంగాణలోనే 100మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు తెలుస్తోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సైతం స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారు. మహమూద్ అలీ దంపతులిద్దరికీ స్వైన్‌ఫ్లూ సోకినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, తిరుపతిలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు ఈ వ్యాధి వల్ల మృతిచెందిరు. మరో 12 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి ఇంతగా విజృంభిస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం.. సరైన అవగాహన, నివారణ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మరణాలకు సీఎం చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం వల్లే స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందిందని, ఆ శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్ ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు.ప్రభుత్వం ఏర్పడి 8నెలలు కావస్తున్నా పాలనపై దృష్టి పెట్టకుండా కాశీమజిలీ కథలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారని విమర్శించారు. స్వైన్‌ఫ్లూ విస్తరించే అవకాశం ఉందని గతంలో హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే సీహెచ్ వంశీచంద్‌రెడ్డి దుయ్యబట్టారు. -
మంత్రిగారూ జర జాగ్రత్త
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య తన శాఖను నిర్వహిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. బాధ్యత గల, అందులోనూ అతి ముఖ్యమైన వైద్యశాఖను నిర్వహిస్తూ ప్రజలకు మంచి వైద్య సౌకర్యాలను కలగ చేసే విధంగా చర్యలు చేపట్టవలసింది పోయి తప్పు చేసిన అధికారులను వెనకేసుకు రావటం, ఆసుపత్రులలో సిబ్బంది వందా రెండొందలు తీసుకుంటే తప్పేమిటని సమర్థించడం ఆశ్చర్య కరమైన విషయం. పేదరికంలో మగ్గుతున్న నిరుపేద కుటుంబాల వాళ్లు వైద్యం కోసం ఆసుపత్రికి వెళితే వాళ్లకు ఉచిత సేవలు అందిస్తా మని ఒకవైపు ఊదర గొడుతూ మరోవైపు మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. అలాగే విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ మరణాలపై కూడా లెక్క సరిగా తెలియ కుండా నోటికి వచ్చిన సంఖ్య చెప్పడం. ఇంత జరుగుతున్నా కనీస వసతులపై అవగాహన లేకుండా మంత్రి నిర్లక్ష్యంతో వ్యవహరించి స్వైన్ ఫ్లూ వైరస్‌ను కట్టడి చేయలేకపోవడం చూస్తే ఆ శాఖ నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం సత్వరం ప్రభు త్వాసుపత్రులలో సౌకర్యాలపై ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని నియ మించాలి. అలాగే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మాస్కులు పంపిణీ చేయాలి. శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్