symbol of love
-
తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే
గువాహటి: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నిజయోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదని వ్యాఖ్యానించారు. ‘తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు. షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఒకవేళ ముంతాజ్ అంటే షాజహాన్‌కు అమితమైన ప్రేమ ఉంటే ఆమె చనిపోయిన తర్వాత మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు’ అని ప్రశ్నించారు. అంతేగాక నాలుగో భార్య అయిన ముంతాజ్ మహల్ ప్రేమకు తాజ్ మహల్ నిదర్శనంగా భావిస్తే.. మిగతా ముగ్గురు భార్యలకు ఏమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ఒక మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్‌మహల్ నిర్మించిన మరో చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాబోయే తరాలకు అలాంటి సమాచారాన్ని అందించాలని కోరుకోవడం లేదు. NCERT తాజాగా మొఘలులపై పాఠ్యాంశాలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయంపై మేము మద్దతు ఇస్తున్నాము. కాగా మొఘల్ కాలం నాటి కట్టడాలైన తాజ్ మహల్, కుతుబ్ మినార్లను కూల్చివేసి.. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయాలను నిర్మించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు. ఆలయాల నిర్మాణాలకు తన ఏడాది జీతాన్ని కూడా విరాళంగా ఇస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారు. నేటికి దీనిని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. Guwahati, Assam | Taj Mahal is not the symbol of Love. Shah Jahan built Tajmahal in memory of his 4th wife Mumtaz. If he loved Mumtaz, then why he married three times more after the death of Mumtaz: BJP leader Rupjyoti Kurmi (05.04) — ANI (@ANI) April 6, 2023 -
త్యాగపతాక - ప్రేమ ప్రతీక
నేడు ‘బక్రీద్’ ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం ముస్లిం సోదరులకు అత్యంత ప్రధానమైన పండుగలు రెండు ఉన్నాయి. మొదటిది ఈదుల్ ఫిత్ర(రమజాన్), రెండవది ఈదుల్ అజ్ హా (బక్రీద్). ప్రపంచంలోని ముస్లిం సోదరులంతా జిల్ హజ్ మాసం పదవ తేదీన పండుగ జరుపుకుంటారు. ఇదేరోజు అరేబియా దేశంలోని మక్కా నగరంలో ’హజ్’ ఆరాధన జరుగుతుంది. లక్షలాదిమంది యాత్రికులతో ఆ పవిత్రనగరం కళకళలాడుతూ ఉంటుంది. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్తవారి సంప్రదాయాలను పాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. ఆ జనవాహినిలో ‘తవాఫ్’ చేసేవారు కొందైరతే, ‘సఫా మర్వా’ కొండలమధ్య సయీ’ చేసేవారు మరికొందరు. అదొక అపురూపమైన సుందరదృశ్యం. రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. ఆ అపూర్వ హజ్ దృశ్యాన్ని ఊహిస్తేనే హృదయం పులకించి పోతుంది. ఒకప్పుడు ఎలాంటి జనసంచారమే లేని నిర్జీవ ఎడారి ప్రాంతమది. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ యావత్ ప్రపంచ ముస్లిం సమాజానికి ప్రధానపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ఈదుల్ అజ్ హా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు, హజ్, ఖుర్బానీలకు మూలకారణం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇబ్రాహీం(అ) గొప్ప దైవప్రవక్త. దేవునికి ప్రియ మిత్రుడు. తన పూర్తిజీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించిన త్యాగధనుడు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞగానే భావించి, ఆచరించేవారు. ఒకరోజు ఇబ్రాహీం ప్రవక్త తన చిన్నారి తనయుడు ఇస్మాయీల్ గొంతుకోస్తున్నట్లు కలగన్నారు. దీన్ని ఆయన దైవాజ్ఞగా భావించి, తనయునితో సంప్రదించారు. తండ్రికి తగ్గ ఆ తనయుడు వెనకా ముందు ఆలోచించకుండా త్యాగానికి సిద్ధమయ్యాడు. వెంటనే ఇబ్రాహీం ప్రవక్త(అ) తనయుని మెడపై కత్తి పెట్టి ‘జిబహ్’ చెయ్యడానికి ఉపక్రమించారు. దీంతో ఆ త్యాగధనుల పట్ల అల్లాహ్ ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది..‘నాప్రియ ప్రవక్తా ఇబ్రాహీం! నువ్వుస్వప్న ఉదంతాన్ని నిజం చేసి చూపించావు. నా ఆజ్ఞాపాలనలో మీరిద్దరూ మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడనయ్యాను. నా పరీక్షలో మీరు పరిపూర్ణంగా సఫలీకృతులయ్యారు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలి తతంగంతో నాకు నిమిత్తం లేదు. మీరిప్పుడు సంపూర్ణంగా విశ్వాసులయ్యారు. ఈ శుభసమయాన మీత్యాగనిరతికి గుర్తింపుగా స్వర్గంనుండి ఒక దుంబాను పంపుతున్నాను.’ అని పలికింది దైవవాణి. వెంటనే చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో ప్రత్యక్షమైన గొర్రెజాతికి చెందిన పొట్టేలును జబహ్ చేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న ఈదుల్ అజ్ హా పండుగ ఆమహనీయుల త్యాగస్మరణే. ఆర్థికస్థామత కలిగినవారు హజ్ యాత్రకు వెళ్ళగలిగితే, స్ధోమత లేనివారు తమ తమ ఇళ్ళవద్దనే పండుగ జరుపుకుంటారు. ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేనివారికి దైవం రెండు రకతుల నమాజు ద్వారానే హజ్, ఖుర్బానీలు చేసినవారితో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అందుకని పండుగసంతోషాన్ని గుండెల్లో నింపుకొని, హద్దుల్ని అతిక్రమించకుండా పండుగ జరుపుకోవాలి. ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. దైవభీతి, పాపభీతి, బాధ్యతాభావం, సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను మనసులో ప్రతిష్టించుకోవాలి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఏ త్యాగానికైనా సదా సన్నద్ధులై ఉండాలి. ధనప్రాణ త్యాగాలతో పాటు, మనోవాంఛలను త్యాగం చెయ్యాలి. స్వార్థం, అసూయా ద్వేషాలనూ విసర్జించాలి. సాటివారి సంక్షేమం కోసం ఎంతోకొంత త్యాగం చేసే గుణాన్ని అలవరచుకోవాలి. ఈవిధమైన త్యాగభావాన్ని మానవుల్లో జనింపజేయడమే ఈదుల్ అజ్ హా (బక్రీద్ )పర్వదిన పరమార్థం. - యండి.ఉస్మాన్ ఖాన్ -
తాజ్‌మహల్ ఎదురుగా షాజహాన్ వేసవి బంగ్లా!
ఆగ్రా: మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ ఎదురుగా మెహ్తాబ్ బాగ్ ఉద్యానవనంలో ఆయనకు ఇష్టమైన వేసవి బంగ్లా కూడా ఉండేదట. భారత పురావస్తు సంస్థ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో శతాబ్దాల నాటి బారాదరి లాంటి మండపం గోడలు, శిథిలాలు ఇటీవల వెలుగుచూశాయి. మెహ్తాబ్(అంటే ఉర్దూలో వెన్నెల) బాగ్‌లోని ఆ మండపంలో రాత్రిపూట సేదతీరుతూ షాజహాన్ తాజ్‌మహల్‌ను చూస్తూ గడుపుతుండేవారని పరిశోధకులు చెబుతున్నారు. భారీ వరదలు లేదా నిర్మాణంలో లోపం కారణంగానే ఈ వేసవి బంగ్లా భూగర్భంలోకి కూరుకుపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. మెహ్తాబ్ బాగ్‌లో తూర్పువైపున 1997-99 మధ్యలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో కూడా 25 ఫౌంటెయిన్లతో కూడిన ఓ ట్యాంకు, ఓ బారాదరి (అన్ని వైపుల నుంచీ గాలి వీచేలా కట్టిన మండపం) శిథిలాలు వెలుగుచూశాయి. తాజాగా తాజ్‌మహల్‌కు సూటిగా మెహ్తాబ్ బాగ్‌లో దక్షిణం వైపు జరుపుతున్న తవ్వకాల్లో వేసవి బంగ్లా అవశేషాలు బయటపడ్డాయి. కాగా, ఇప్పుడున్న పాలరాతి తాజ్‌మహల్ ఎదురుగా ఓ నల్లరాతి తాజ్‌మహల్‌ను కూడా నిర్మించాలని, ఆ రెండింటినీ ఓ వారధితో అనుసంధానం చేయాలనీ అప్పట్లో షాజహాన్ భావించారన్న ప్రచారమూ ఉంది. షాజహాన్ నల్లరాతి తాజ్‌మహల్‌ను నిర్మించాలనుకున్నది మెహ్తాబ్ బాగ్లోనేని పలువురు గైడ్లు చెబుతుంటారు కూడా. కానీ బ్లాక్ తాజ్‌మహల్ నిర్మాణ ం గురించి షాజహాన్ ఆలోచించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి చారిత్రక ఆధారాలు లభించలేదు. -
మది నిండుగ.. కనులపండుగ..
వెన్నెల వెలుగుల్లో ఓ సుందర కట్టడం తోడున్నవారి కనుల నిండుగా చూడటం ఓ అద్భుతమైతే... ఆ ఆనందాన్ని తాజ్‌మహల్ పంచుతుంది! నీలిమబ్బుల దోబూచులాటలో ఓ సాయంత్రం ఆకాశమంత ప్రేమను కొలిచే సాధనాల కోసం వెతికితే... ఆ శ్రమను ఈఫిల్ టవర్ మరిపిస్తుంది! నీటి తుంపరలో ఓ హాస్యపు జల్లును ఎదనిండా నింపుకోవడమే భాగ్యమైతే... ఆ భావం ట్రెవి ఫౌంటెన్ తీరుస్తుంది! ఈ ప్రసిద్ధ ప్రేమ కట్టడాలన్నీ ఏ దారిలో వెళ్లినా హృదయాలను చేరువచేస్తాయి. బాంధవ్యపు లోగిలికి సంబరాలను మోసుకొస్తాయి. ఒళ్ళంతా తుళ్లింత ప్రపంచ ఫౌంటెన్ కట్టడాల్లో అద్భుతమైనదిగా పేరుగాంచినది ట్రెవి ఫౌంటెన్. ఇటలీలోని ట్రెవి జిల్లాలో ఉంటుంది ఈ కట్టడం. 1629లో ఇటాలీ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వీ ఈ కట్టడాన్ని డిజైన్‌చేస్తే, పీయెట్రో బ్రాకీ నిర్మించారు. ఈ నిర్మాణం ఎత్తు 86 అడుగులు, వెడల్పు 49.15 మీటర్లు. ఇక్కడి ఫౌంటెన్లలో బరోక్యూ ఫౌంటెన్ నగరంలోనే అతిపెద్దది. ఇక్కడి ఫౌంటెన్ కొలనులో నాణెం వేస్తే రోమ్‌లో తేలుతుందని ప్రసిద్ధి. ఇక్కడి ఫౌంటెన్ల అందాలు ఎన్నో ఆంగ్ల సినిమాల్లో ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇది పర్యాటక సందర్శన కట్టడంగానూ పేరుగాంచింది. సందర్శన సమయం: చీకటిగా ఉండే ఉదయపు వేళలో ఫౌంటెన్ల అందం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. చూడటానికి పట్టే వ్యవధి: 1-2 గంటలు అత్యత్భుతమైన ఫొటోలను తీసుకునేవీలుంటుంది. ఫౌంటెన్ దగ్గర నడుస్తూ చుట్టూ వాటి అందాలను వీక్షించవచ్చు. ఎలా వెళ్లాలి?: అంతర్జాతీయ విమానాల ద్వారా ఇటలీ చేరుకోవాలి. అక్కడ నుంచి టూరిస్టు బస్సుల ద్వారా ట్రెవి చేరుకోవచ్చు. విదేశీ ప్రేమ: అమెరికన్ డెరైక్టర్ జీన్ నెగులెస్కో ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ సినిమా తీశారు. ప్రేమకు చిహ్నం తాజ్‌మహల్ అనేమాట వింటేనేచాలు. మన మనస్సులలో ఏదో తెలియని ఆనందం. ఒక ప్రేమ కథ. ఒక మధుర చిహ్నం... అనేటటువంటి సంకేతాలు అందుతాయి. ఎన్నో శతాబ్దాలుగా మన మనస్సులలో నాటుకుపోయిన తీపి భావన తాజ్‌మహల్ భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఈ మహల్‌ను షాజహాన్ చక్రవర్తి తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటైన మన తాజ్ ప్రతి యేటా 7-8 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఎక్కువ మంది పర్యాటకులు అక్టోబర్, నవంబర్, ప్రిబవరి చల్లని నెలలో సందర్శిస్తారు. సందర్శన సమయం: వారంలో శుక్రవారం మినహా అన్నిరోజులూ ఉదయం 6 గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు సందర్శించవచ్చు. పౌర్ణమికి రెండు రోజుల ముందు, తర్వాత రెండు రోజులు కట్టడాన్ని రాత్రి వీక్షణం కోసం అనుమతిస్తారు. ఎలా చేరాలి? ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఆగ్రా చేరుకోవచ్చు. ఆగ్రాకు విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. ఆగ్రా రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ 3.6 కి.మీ, తాజ్‌మహల్ 5.7 కి.మీ. విదేశీ ప్రేమ: 18వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు ఇండియాకు వచ్చిన ఆంగ్లేయులెవ్వరూ తాజ్‌మహల్ సౌందర్యాన్ని ఆస్వాదించకుండా తిరిగి వెళ్లలేదు. ఆకాశమే హద్దు నిటారుగా నిల్చున్న సైనికునిలా, ఆకాశాన్ని తాకుతోందా అనిపించే అబ్బురపరిచే కట్టడం ఈఫిల్ టవర్. ప్యారిస్‌లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ ప్రదేశంలో నిర్మించిన ఎత్తై ఇనుప గోపురం. దీని ఎత్తు 1050 అడుగులు. 1889 లో గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ దీన్ని డిజైన్ చేసి, మరో 72 మంది ఇంజనీర్ల సాయంతో ఈఫిల్ టవర్‌ను నిర్మించాడు. ఫ్రాన్స్‌కు మాత్రమే గర్వకారణమైన కట్టడం కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం ఇది. దేశ, విదేశాల్లో ఈఫిల్ టవర్‌ను పోలిన నమూనాలు 20కి పైగానే ఉన్నాయి. ఎలా వెళ్లాలి? అన్ని అంతర్జాతీయ విమానాశ్రాయాల ద్వారా ప్యారిస్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లి, అక్కడ నుంచి విమానంలో ప్యారిస్ చేరుకోవచ్చు. ప్రయాణ సమయం దాదాపు 12 గం.ల 45ని.లు. రెన్నో అద్భుతాలు... ప్యారిట్ టూర్ ఓపెన్ బస్‌లో నుంచి నగరాన్ని చుట్టేయవచ్చు. ఈఫిల్ టవర్ దగ్గర లువ్రే మ్యూజియం, అద్భుతమైన పార్కులు, గార్డెన్లు, ఆర్క్ డె ట్రయంఫీ, ఒపెరా హౌజ్‌లను సందర్శించవచ్చు. విదేశీప్రేమ: ఈ అపురూప కట్టడాన్ని నిర్మించినప్పటి నుంచి 20 కోట్ల మందికి పైగా ప్రజలు సందర్శించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది సందర్శించిన స్థలంగా ఈఫిల్ టవర్ ప్రఖ్యాతిగాంచింది. ప్రేమికులు ఇష్టపడే ప్రదేశాలలో అగ్రస్థానం లో ఉంది ఈఫిల్‌టవర్!