త్యాగపతాక - ప్రేమ ప్రతీక
నేడు ‘బక్రీద్’
ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం ముస్లిం సోదరులకు అత్యంత ప్రధానమైన పండుగలు రెండు ఉన్నాయి. మొదటిది ఈదుల్ ఫిత్ర(రమజాన్), రెండవది ఈదుల్ అజ్ హా (బక్రీద్). ప్రపంచంలోని ముస్లిం సోదరులంతా జిల్ హజ్ మాసం పదవ తేదీన పండుగ జరుపుకుంటారు. ఇదేరోజు అరేబియా దేశంలోని మక్కా నగరంలో ’హజ్’ ఆరాధన జరుగుతుంది. లక్షలాదిమంది యాత్రికులతో ఆ పవిత్రనగరం కళకళలాడుతూ ఉంటుంది. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్తవారి సంప్రదాయాలను పాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. ఆ జనవాహినిలో ‘తవాఫ్’ చేసేవారు కొందైరతే, ‘సఫా మర్వా’ కొండలమధ్య సయీ’ చేసేవారు మరికొందరు.
అదొక అపురూపమైన సుందరదృశ్యం. రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. ఆ అపూర్వ హజ్ దృశ్యాన్ని ఊహిస్తేనే హృదయం పులకించి పోతుంది. ఒకప్పుడు ఎలాంటి జనసంచారమే లేని నిర్జీవ ఎడారి ప్రాంతమది. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ యావత్ ప్రపంచ ముస్లిం సమాజానికి ప్రధానపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ఈదుల్ అజ్ హా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు, హజ్, ఖుర్బానీలకు మూలకారణం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం.
ఇబ్రాహీం(అ) గొప్ప దైవప్రవక్త. దేవునికి ప్రియ మిత్రుడు. తన పూర్తిజీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించిన త్యాగధనుడు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞగానే భావించి, ఆచరించేవారు. ఒకరోజు ఇబ్రాహీం ప్రవక్త తన చిన్నారి తనయుడు ఇస్మాయీల్ గొంతుకోస్తున్నట్లు కలగన్నారు. దీన్ని ఆయన దైవాజ్ఞగా భావించి, తనయునితో సంప్రదించారు. తండ్రికి తగ్గ ఆ తనయుడు వెనకా ముందు ఆలోచించకుండా త్యాగానికి సిద్ధమయ్యాడు. వెంటనే ఇబ్రాహీం ప్రవక్త(అ) తనయుని మెడపై కత్తి పెట్టి ‘జిబహ్’ చెయ్యడానికి ఉపక్రమించారు.
దీంతో ఆ త్యాగధనుల పట్ల అల్లాహ్ ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది..‘నాప్రియ ప్రవక్తా ఇబ్రాహీం! నువ్వుస్వప్న ఉదంతాన్ని నిజం చేసి చూపించావు. నా ఆజ్ఞాపాలనలో మీరిద్దరూ మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడనయ్యాను. నా పరీక్షలో మీరు పరిపూర్ణంగా సఫలీకృతులయ్యారు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలి తతంగంతో నాకు నిమిత్తం లేదు. మీరిప్పుడు సంపూర్ణంగా విశ్వాసులయ్యారు. ఈ శుభసమయాన మీత్యాగనిరతికి గుర్తింపుగా స్వర్గంనుండి ఒక దుంబాను పంపుతున్నాను.’ అని పలికింది దైవవాణి. వెంటనే చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో ప్రత్యక్షమైన గొర్రెజాతికి చెందిన పొట్టేలును జబహ్ చేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం.
ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న ఈదుల్ అజ్ హా పండుగ ఆమహనీయుల త్యాగస్మరణే. ఆర్థికస్థామత కలిగినవారు హజ్ యాత్రకు వెళ్ళగలిగితే, స్ధోమత లేనివారు తమ తమ ఇళ్ళవద్దనే పండుగ జరుపుకుంటారు. ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేనివారికి దైవం రెండు రకతుల నమాజు ద్వారానే హజ్, ఖుర్బానీలు చేసినవారితో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అందుకని పండుగసంతోషాన్ని గుండెల్లో నింపుకొని, హద్దుల్ని అతిక్రమించకుండా పండుగ జరుపుకోవాలి. ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.
దైవభీతి, పాపభీతి, బాధ్యతాభావం, సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను మనసులో ప్రతిష్టించుకోవాలి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఏ త్యాగానికైనా సదా సన్నద్ధులై ఉండాలి. ధనప్రాణ త్యాగాలతో పాటు, మనోవాంఛలను త్యాగం చెయ్యాలి. స్వార్థం, అసూయా ద్వేషాలనూ విసర్జించాలి. సాటివారి సంక్షేమం కోసం ఎంతోకొంత త్యాగం చేసే గుణాన్ని అలవరచుకోవాలి. ఈవిధమైన త్యాగభావాన్ని మానవుల్లో జనింపజేయడమే ఈదుల్ అజ్ హా (బక్రీద్ )పర్వదిన పరమార్థం.
- యండి.ఉస్మాన్ ఖాన్