ట్రాక్టర్ డ్రైవర్ వెకిలి చేష్టతో ముగ్గురి బలి
మృతుల్లో తల్లీకూతురు, మూడేళ్ల బాలుడు
మరో ట్రాక్టర్ ఢీకొనడంతో బోల్తాపడిన కంకరలోడు ట్రాక్టర్
నెల్లికుదురు, న్యూస్‌లైన్ : బస్సు కోసం చూస్తుండగా తెలిసిన వ్యక్తికి చెందిన కంకర ట్రాక్టర్ రావడంతో బంధువులంతా కలిసి అందులో ఎక్కారు. పావు గంటయితే వారంతా క్షేమంగా ఇంటికి చేరేవారు. ఈ లోపే మృత్యువు రూపంలో మరో ట్రాక్టర్ వెనకాలే వచ్చింది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ కల్లు తాగిన మత్తులో ఓవర్టేక్ చేస్తూ పక్క నుంచి తాకించడంతో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది.
కంకర మీదపడడంతో తల్లీ,కూతురితోపాటు మరో బాలుడు మృతిచెందగా, నలుగురు తీవ్రం గా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని నర్సింహులగూడెం గ్రామ శివారు సంధ్య తండా సమీపంలో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం సింగారం గ్రామానికి చెందిన మందుల శ్రీను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఇదే మండలంలోని వావిలాల గ్రామంలోని తన అత్తగారింట్లో శుక్రవారం జరిగిన ఉప్పలమ్మ పండుగకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హాజరయ్యూడు. శనివారం ఉదయం తిరుగు ప్రయాణమై నెల్లికుదురు - మహబూబాబాద్ ప్రధాన రహదారిలోని వావిలాల స్టేజీ వద్దకు చేరుకున్నారు. వారు బస్సు కోసం ఎదురు చూస్తుండగా శ్రీనుకు సింగారానికి చెందిన ట్రాక్టర్ యజమాని ఫోన్ చేశాడు. తాను మహబూబాబాద్‌లో కంకర లోడ్ చేసుకుని సింగారానికి బయల్దేరానని చెప్పాడు.
దీంతో వారు బస్సు ఎక్కకుండా ఆగి కంకర ట్రాక్టర్ ఎక్కారు. అదే సమయంలో మండలంలోని ఓ గ్రామంలో జరిగిన పెళ్లికి హాజరై తాళ్లలో కల్లు తాగిన పది మంది మరో ట్రాక్టర్లో తిరుగుపయనమయ్యారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనుకు తెలిసిన వ్యక్తి కావడంతో ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నారు. కల్లు తాగిన మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న వ్యక్తులు జోకులు వేసుకుంటూ, గట్టిగా కేకలు వేస్తూ కంకర ట్రాక్టర్ వెనకాలే వెళ్లారు. అతడు నర్సింహులగూడెం శివారు సంధ్యతండా సమీపంలోకి రాగానే కంకర ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయబోతూ తన ట్రాక్టర్‌తో తాకించాడు. దీంతో కంకర ట్రాక్టర్ బోల్తా పడింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న మందుల శ్రీను, అతడి భార్య లలిత(35), కూతురు అనూష(15), కుమారుడు ఉదయ్, మునిగలవీడు గ్రామానికి చెందిన బంధువులు ఎల్తూరి అశ్విని, ఎల్తూరి నరేష్, అతడి భార్య నిర్మల, కుమారుడు ప్రవీన్(3) మరికొందరు కిందపడగా వారిపై కంకర పడింది. చుట్టుపక్కలవారు గమనించి కంకరను తోడి అందరినీ బయటకు తీశారు. అరుుతే అప్పటికే కంకర మీదపడి ఊపిరాడక లలిత, ఆమె కూతురు అనూష, ఎల్తూరి నరే ష్ మృతిచెందగా శ్రీను, ఉదయ్, అశ్విని, నిర్మల తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక ఎస్సై బి.చేరాలు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో మానుకోట ఏరియూ ఆస్పత్రికి తరలించారు. సంఘటనస్థలాన్ని మహబూబాబాద్ డీఎస్పీ శోభన్ కుమార్, తొర్రూరు సీఐ సార్ల రాజు సందర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను వదిలేసి డ్రైవర్, అందులో ప్రయూణిస్తున్నవారు పరారయ్యూరు.
నలుగురు సంతానాన్ని కోల్పోయిన దంపతులు..
వావిలాలకు గుండెపాక లింగయ్య, అమ్మక్క దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కూతురు జన్మించారు. గతంలో జరిగిన ప్రమాదంలో ఒక కుమారుడు, పురుగుల మందు తాగి మరో ఇద్దరు కుమారులు ఆత్మహత్యకు పాల్పడగా, వారు చేసుకున్న ఉప్పలమ్మ పండుగకు వచ్చి వెళుతూ మిగిలిన కూతురు లలిత కూడా మృతి చెందడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యూరు.