మృత్యు ఘోష
- టిప్పర్‌ను ఢీకొన్న కేఎస్ ఆర్టీసీ బస్సు
- 14 మంది మృతి
- బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
- నిబంధనలు అతిక్రమించి ఓవర్‌టెక్‌కు యత్నం
ముళబాగలు : ఏడు కొండల వాడి దర్శనానికి కొందరు, సొంత ఊర్లకు మరి కొందరు...ఇలా ప్రయాణమైన వారిలో 14 మంది అసువులు బాశారు. కోలారు జిల్లా ముళబాగలు తాలూకా శ్రీరంగపుర గేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తుమకూరు డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి మొత్తం 31 మందితో బయలుదేరింది.
ముళబాగలు వద్ద ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఓ వైపు రోడ్డు పనులు జరుగుతుండగా, మరో మార్గంలో అటు, ఇటు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆర్టీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ, ముందుగా పోతున్న ఇసుక టిప్పర్‌ను ఓవర్ టేక్ చేయబోయింది. అయితే కుడి వైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడంతో ఇరుకైన రోడ్డులో బస్సు కుడి భాగం టిప్పర్‌ను వేగంగా రాసుకుంటూ పోయింది. దీంతో ఆ భాగమంతా చీల్చుకుపోయింది.
అటు వైపు కూర్చున్న వారిలో ఐదుగురు మహిళలు, ఓ పదేళ్ల బాలుడితో పాటు ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని కోలారులోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలకు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం ఐదుగురు మరణించారు. బస్సు తుమకూరు డిపోదైనప్పటికీ, ఆ పట్టణానికి చెందిన వారెవరూ అందులో లేరు. బెంగళూరులో తిరుపతికి 15 మంది, చిత్తూరుకు ఆరుగురు, పలమనేరుకు నలుగురు టికెట్లు తీసుకున్నారని కండక్టర్ నరసింహమూర్తి తెలిపారు. స్వల్ప గాయాలతో అతను ముళబాగలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బెంగళూరులోని హెబ్బాళకు చెందిన సోమశేఖర్, భార్య, మనవడితో కలసి ప్రయాణించారు. తన భర్తకు ఏమైందో తెలియడం లేదని, తన మనవడు మాత్రం ఒకసారి ఫోనులో మాట్లాడాడని గృహిణి చెప్పారు. బస్సులో ఇంకా గౌరిబిదనూరుకు చెందిన లక్ష్మీపతి, సుబ్రమణ్యచారి, పలమనేరుకు చెందిన అమల ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
మృతులు
కోలారుకు చెందిన నాగేశ్ (35), బెంగళూరులోని కోడిహళ్లికి చెందిన నాగమణి (50), బెంగళూరుకు చెందిన నారాయణమ్మ, భారతి బ్రహ్మచారి (35), పలమనేరుకు చెందిన రాజశేఖర్ (35), లిఖిత్ కుమార్ (3), తుమకూరుకు చెందిన డ్రైవర్ గంగాధరయ్య (50), ముళబాగలుకు చెందిన విజయమ్మ (55) మృతుల్లో ఉన్నారు. ఇంకా ఐదు మృత దేహాలను గుర్తించాల్సి ఉంది.