చావలి చెక్‌పోస్టు వద్ద లారీ–టిప్పర్ ఢీ
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై చావలి చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి ఎదురెదురుగా టిప్పర్, లారీ ఢీకొన్నాయి. ఈఘటనలో ఇరులారీల డ్రైవర్లకు గాయాలయ్యాయి.పేపర్ లోడుతో ఖమ్మం నుంచి శివకాశీ వెళుతున్న లారీని చిత్తూరు జిల్లా తొట్టంబేడు నుంచి కంకర లోడుతో నాయుడుపేటకు వెళుతున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి సుమారు గంటసేపు నరకయాతన పడ్డాడు. తీవ్రగాయాల పాలైన ఆయనను పోలీసులు క్రేన్ సాయంతో బయటకు తీశారు. పేపర్ లారీ డ్రైవర్ చిన్నా కూడా గాయపడ్డాడు, ఇద్దరిని మొదట నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.