మాజీ మంత్రికి బెయిల్
సాక్షి, చెన్నై: మాజీ మంత్రి అగ్రికృష్ణమూర్తికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. బుధవారం ఆయనకు బెయిల్ మం జూరు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తిరునెల్వేలి జిల్లా వ్యవసాయ శాఖ ఇంజినీరింగ్ అధికారి ముత్తు కుమారస్వామి ఆత్మహత్య వ్యవహారం అప్ప టి వ్యవసాయ శాఖ మంత్రి అగ్రికృష్ణమూర్తిని వెంటాడింది. మంత్రి, ఆ శాఖ ప్రధాన ఇంజినీరింగ్ అధికారి సెంథిల్‌కుమార్ ఒత్తిళ్లు తాళ లేక ముత్తుకుమార స్వామి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం బయలు దేరింది. ప్రతి పక్షాల విమర్శలు, ఆరోపణలతో అగ్రి కృష్ణమూర్తి పదవి కాస్త ఊడింది. మంత్రి పదవిని, పార్టీ పదవిని కోల్పోయిన అగ్రికృష్ణమూర్తిని ఏప్రిల్ ఐదో తేదీన సీబీసీఐడీ పోలీసులు అరెస్టుచేశారు. ఆయనతో పాటుగా సెంథిల్‌కుమార్‌ను కూడా అరెస్టు చేసి పాళ యం కోటై జైల్లో ఉంచారు. ఈ సమయంలో కస్టడీ విచారణలు సాగాయి. రిమాండ్లతో జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పలుమార్లు కింది కోర్టుల్ని, అనంతరం మదురై ధర్మాసనంను ఆశ్రయించినా ఫలితం శూన్యం.
బెయిల్:
పలుమార్లు బెయిల్ ప్రయత్నాలు చేసినా విఫలం అవుతూ వచ్చిన అగ్రి కృష్ణమూర్తికి ఈ సారి ఎట్టకేలకు జైలు నుంచి బయట పడే మార్గం లభించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ మళ్లీ మదురై ధర్మాసనంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం వాడీ వేడిగా విచారణ సాగింది. బెయిల్ ఇవ్వకూడదంటూ సీబీసీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలతో బెయిల్ నిర్ణయం వాయిదా పడింది. మళ్లీ బుధవారం బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి కల్యాణ సుందరం విచారించారు. వాదనల అనంతరం అగ్రికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రెండు నెలల జైలు జీవితానంతరం తనకు బెయిల్ లభించడంతో అగ్రి, ఆయన అనుచరుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే, అగ్రికృష్ణమూర్తికి కొన్ని నిబంధనల మేరకు బెయిల్ మంజూరు చేసినట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఆ మేరకు తదుపరి కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు ప్రతిరోజూ చెన్నైలోని సీబీసీఐడీ కార్యాలయంలో అగ్రి సంతకం చేయాల్సి ఉంటుంది.