target olympic podium scheme
-
‘మిషన్ ఒలింపిక్ సెల్’లో గగన్ నారంగ్
న్యూఢిల్లీ: భారత షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కీలక బాధ్యతలు అప్పగించింది. ‘సాయ్’ ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ)లో సభ్యుడిగా నారంగ్‌ను ఎంపిక చేసింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని ఒలింపిక్స్‌కు సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా 2014 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) పని చేస్తోంది. ‘టాప్స్’ కోసం ఆటగాళ్లను గుర్తించడం, వారి సన్నాహకాలకు ఆర్ధికపరంగా సహకారం అందించే విషయంలో తగిన సూచనలు, సలహాలు అందించడం, ఫలితాలను పర్యవేక్షించడమే ‘మిషన్ ఒలింపిక్ సెల్’ బాధ్యత. 2024 పారిస్, 2028 లాస్ ఎంజెలిస్ ఒలింపిక్స్ కోసం అథ్లెట్లను ఎంపిక చేయడంలో తాను భాగస్వామిని కాబోతున్నట్లు హైదరాబాద్ షూటర్ గగన్ వెల్లడించాడు. ‘స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని డెవలప్మెంట్ గ్రూప్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఎంఓసీ కీలక పాత్ర పోషిస్తోంది. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఆయా ఆటగాళ్ల అవసరాలను గుర్తించి ప్రత్యేక శిక్షణ కోసం నిధులు అందేలా చూడటంతో పాటు అత్యుత్తమ స్థాయి కోచింగ్ సౌకర్యం, ఫిట్నెస్ తదితర అంశాలపై కూడా ఎంఓసీ దృష్టి పెడుతుంది. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా’ అని గగన్ వెల్లడించాడు. -
‘టాప్స్’ కొనసాగిస్తాం: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో పతక విజేతలను తయారు చేసేందుకు ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్)ను కొనసాగిస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 2024–పారిస్, 2028–లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు ‘టాప్స్’ను పొడిగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో టోక్యో పతక విజేతలకు అనురాగ్ ఠాకూర్ ప్రోత్సాహకాలు అందజేశారు. ఐఓఏ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు రూ. 75 లక్షలు, ‘రజత’ విజేతలు మీరాబాయి, రవి లకు రూ. 50 లక్షలు చొప్పున, కాంస్యాలు గెలిచిన సింధు, లవ్లీనా, బజరంగ్‌లకు రూ. 25 లక్షలు చొప్పున, హాకీ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున బహూకరించారు. -
‘టాప్స్’లో భారత మహిళల హాకీ జట్టు!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత మహిళల హాకీ జట్టును త్వరలో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చేర్చనున్నారు. తదుపరి ‘టాప్స్’ సమావేశంలో జట్టులోని మొత్తం 18 మంది సభ్యులను ఈ పథకం కిందికి తేనున్నారు. ఇప్పటికే భారత పురుషుల జట్టు ‘టాప్స్’లో ఉంది. 48 మంది ప్రాబబుల్స్... ‘సాయ్’ ఆధ్వర్యంలో నేటి నుంచి బెంగళూరులో జరుగనున్న జాతీయ మహిళల శిబిరానికి హాకీ ఇండియా 48 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఇతిమరపు రజని, తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ యెండల సౌందర్య చోటు దక్కించుకున్నారు. -
జ్వాల, అశ్వినిలను తిరస్కరించలేదు
టాప్ స్కీమ్‌లో చేర్చడంపై క్రీడాశాఖ వ్యాఖ్య న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్వినిలను టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) స్కీమ్‌లో చేర్చడాన్ని ఎప్పుడూ మర్చిపోలేదని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 21న జరిగిన ఐడెంటిఫికేషన్ కమిటీ సమావేశంలోనే వాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించింది. ‘ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత వీళ్ల ప్రదర్శన గురించి చర్చించింది. చర్చ తర్వాత ఈ ఇద్దర్ని స్కీమ్‌లోకి తీసుకురావాలని నిర్ణయించింది. డబుల్స్‌లో వీళ్లిదరికి కలిపి శిక్షణ ఇప్పించాలని కమిటీ భావించింది’ అని క్రీడా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, హెచ్.ఎస్.ప్రణయ్‌లను టాప్‌కి ఎంపిక చేయగానే... జ్వాల, అశ్విని క్రీడాశాఖపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.