Tata Telecom Service
-
టెలికం మంత్రితో టాటా సన్స్ చంద్రశేఖరన్ భేటీ
న్యూఢిల్లీ: టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టెలికం శాఖ మదింపు ప్రకారం గతంలో టాటా గ్రూపు అందించిన టెలికం సేవలపై బకాయిలు రూ.14,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, టాటా గ్రూపు రూ.2,197 కోట్ల వరకు చెల్లింపులు చేసింది. వాస్తవ బకాయిలు ఈ మేరకేనని స్పష్టం చేసింది. దీంతో టాటా మదింపును ప్రశ్నిస్తూ.. పూర్తి బకాయిల చెల్లింపును కోరుతూ టెలికం శాఖ మరో నోటీసును జారీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో టెలికం మంత్రితో చంద్రశేఖరన్ భేటీ కావడం ప్రాధాన్యం నెలకొంది. 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రశేఖరన్ స్పందించకుండానే వెళ్లిపోయారు. చదవండి : టెలికంలో అసాధారణ సంక్షోభం వోడాఫోన్ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్ ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం -
టాటా టెలీ ఎయిర్టెల్ చేతికి
న్యూఢిల్లీ: టెలికం రంగంలో మరింతగా కన్సాలిడేషన్ని సూచిస్తూ భారతీ ఎయిర్టెల్ మరో భారీ డీల్‌కు తెరతీసింది. రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు వెల్లడించింది. తద్వారా.. నవంబర్ 1 నుంచి టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్), టాటా టెలీ మహారాష్ట్ర (టీటీఎంఎల్) సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు టాటా టెలీ నుంచి ఎయిర్‌టెల్‌కి బదిలీ అవుతారు. అయితే ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్టెల్ ఎలాంటి నగదూ చెల్లించటం లేదు. పైపెచ్చు తన కంపెనీలో వాటాలనూ ఇవ్వటం లేదు. టాటా టెలీ సంస్థలకు ఉన్న భారీ రుణాలను కూడా ఎయిర్టెల్ తీర్చదు. వాటిని టాటా గ్రూపే తీరుస్తుంది. కాకపోతే స్పెక్ట్రమ్ కోసం టెలికం విభాగానికి టాటా సంస్థలు చెల్లించాల్సిన మొత్తాలను విడతల వారీగా ఎయిర్టెల్ చెల్లిస్తుంది. ఎందుకంటే ఇకపై సదరు స్పెక్ట్రమ్‌ను ఎయిర్టెల్ వాడుతుంది కాబట్టి!!. ‘‘ఇది పూర్తిగా రుణ రహిత, నగదురహిత డీల్‌గా ఉంటుంది’’ అని ఇరు సంస్థలు వేర్వేరుగా ఇచ్చిన ప్రకటనల్లో వెల్లడించాయి. ఇక 19 సర్కిళ్లలో కన్జూమర్ మొబైల్ వ్యాపార విభాగంలో పనిచేస్తున్న టీటీఎస్ఎల్, టీటీఎంఎల్ ఉద్యోగులందరినీ ఎయిర్‌టెల్‌కి బదలాయిస్తారు. వీరితో పాటు 800, 1800, 2100 మెగాహెట్జ్ (3జీ, 4జీ) బ్యాండ్స్‌లో టాటాలకున్న 178.5 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కూడా దక్కించుకుంటుంది. డీల్ స్వరూపం ప్రకారం టాటా టెలీ రుణాలేవీ ఎయిర్టెల్ స్వీకరించదు. అయితే, ఆ సంస్థ స్పెక్ట్రమ్‌కోసం టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో దాదాపు 20% (సుమారు రూ.1,500–2,000 కోట్లు) బాధ్యత మాత్రమే ఎయిర్టెల్ తీసుకుంటుంది. సుమారు రూ. 31,000 కోట్ల పైచిలుకు పేరుకుపోయిన టాటా టెలీ రుణాలను టాటా సన్స్ తీరుస్తుంది. ‘దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ దిశగా ఇది మరో కీలక పరిణామం. అత్యుత్తమ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి సర్వీసులను చౌకగా అందించడం ద్వారా దేశీయంగా డిజిటల్ విప్లవానికి సారథ్యం వహించడంలో మా నిబద్ధతను ఇది సూచిస్తుంది‘ అని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ‘టాటా గ్రూప్, దాని వాటాదారులకు ఈ ఒప్పందం అత్యుత్తమమైనదని భావిస్తున్నాము. అనేక ప్రత్యామ్నాయ అవకాశాలన్నీ పరిశీలించిన మీదట భారతి ఎయిర్‌టెల్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం‘ అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. 32 కోట్లకు ఎయిర్టెల్ యూజర్లు .. లావాదేవీ పూర్తయ్యేదాకా టీటీఎస్ఎల్, టీటీఎంఎల్ కన్జూమర్ మొబైల్ వ్యాపార కార్యకలాపాలు, సేవలు యథాప్రకారం కొనసాగుతాయి. ప్రస్తుత ఒప్పందంతో టాటా ఫైబర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునేందుకు ఎయిర్‌టెల్‌కు వెసులుబాటు లభిస్తుంది. ఈ డీల్‌తో ఎయిర్టెల్ గడిచిన అయిదేళ్లలో ఏడు సంస్థలను దక్కించుకున్నట్లవుతుంది. ఇటీవలే ఫిబ్రవరిలో మరో టెల్కో టెలినార్‌కి ఆంధ్రప్రదేశ్ సహా ఏడు సర్కిళ్లలో ఉన్న వ్యాపార కార్యకలాపాలను కూడా టాటా టెలీ తరహాలోనే నగదురహిత డీల్‌లో ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. తాజా ఒప్పందంతో ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకు చేరనుంది. అయితే, ప్రతిపాదిత వొడాఫోన్–ఐడియా విలీనానంతరం ఏర్పడే కంపెనీకి ఉండే 40 కోట్ల మంది యూజర్ల కన్నా ఇది తక్కువే కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో అడుగుపెట్టినప్పట్నుంచీ భారత టెలికం రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. టారిఫ్‌లు మరింతగా తగ్గడం నుంచి టెల్కోల విలీనాలతో ఈ రంగంలో కన్సాలిడేషన్ ఊపందుకుంది. గురువారం బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేరు 1 శాతం క్షీణించి రూ. 398.70 వద్ద, టాటా టెలీ (మహారాష్ట్ర) సుమారు 10 శాతం వృద్ధితో రూ. 4.42 వద్ద క్లోజయ్యాయి. మూసివేత కన్నా ఇదే మంచిది.. టాటా టెలీని మూసివేయడం కన్నా మరో కంపెనీకి అప్పగించడమే మంచిదని భావించినట్లు టాటా గ్రూప్ సీఎఫ్ఓ సౌరభ్ అగ్రవాల్ తెలిపారు. ఏదైనా సంస్థను మూసివేయడమనేది టాటా గ్రూప్ విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మూసివేసి ఉంటే అనేక మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి ఉండేవారన్నారు. ‘కన్జూమర్ మొబైల్ వ్యాపారాన్ని మూసివేయడమనేది చాలా భారీ ఖర్చులతో కూడుకున్నది.. పైగా అనేక మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చేది. దానికన్నా ఈ మార్గం శ్రేయస్కరమని ఎంచుకోవడం జరిగింది‘ అని ఆయన చెప్పారు. టవర్ల కంపెనీ వ్యోమ్ .. టాటా చేతిలోనే ఉంటుందన్నారు. టాటా కమ్యూనికేషన్స్‌కి ఎంటర్ప్రైజ్ విభాగం.. ఎంటర్ప్రైజ్ వ్యాపార విభాగాన్ని టాటా కమ్యూనికేషన్స్‌కి, రిటైల్ ఫిక్సిడ్ లైన్.. బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారాన్ని శాటిలైట్ టీవీ సంస్థ టాటా స్కైకి బదలాయించే అవకాశాలు ఉన్నాయని అగ్రవాల్ పేర్కొన్నారు. ఇరు కంపెనీల బోర్డులు ఈ అవకాశాలని పరిశీలించి, 4–6 వారాల్లో తగు నిర్ణయం తీసుకుంటాయని అగ్రవాల్ చెప్పారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టాటా టెలీ మొబైల్ వ్యాపారాన్ని సరిదిద్దేందుకు పునర్వ్యవస్థీకరణ చర్యలు చాన్నాళ్ల క్రితమే తీసుకుని ఉండాల్సిందని తెలిపారు. గ్రూప్ చైర్మన్‌గా ఫిబ్రవరిలో పగ్గాలు చేపట్టిన ఎన్ చంద్రశేఖరన్.. తోడ్పాటు అందించే వారితో మాట్లాడి డీల్‌ను సాకారం చేశారన్నారు. ఎంత మంది ఉద్యోగులను బదలాయించేది వెల్లడించని అగ్రవాల్.. విలీనం పూర్తయ్యాక ఎయిర్టెల్ సిబ్బందిని క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని మాత్రం చెప్పారు. -
4జీ మాయ... స్మార్ట్ హవా!
సెకనుకో సినిమా డౌన్లోడ్... రెండు సెకన్లకు మరోటి అప్లోడ్... కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్, రెప్ప ఆర్పనివ్వని స్పష్టత... ఇవేవో హైటెక్ హంగుల్లే మనకు అప్పుడప్పుడే అందవులే అనుకోకండి... అన్నీ సవ్యంగా సాగితే కొన్నినెలల్లోనే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయంటున్నారు... టాటా టెలికామ్ సర్వీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆశీష్ పచౌరీ. టెలికామ్ రంగంలో సరికొత్త విప్లవానికి 2014 నాందీ పలకనుంది. ప్రస్తుతం మనలో చాలామంది ఉపయోగిస్తున్న త్రీజీ స్థానంలో మరింత ఆధునికమైన 4జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఫలితంగా అత్యధిక వేగంతో టెలికామ్ సేవలను అందుకోవడమే కాకుండా.. ఇంకా అనేకానేక వినూత్న సాంకేతిక మార్పులు సాధ్యమవుతాయి. అవి ఏమిటో స్థూలంగా... భలే వేగం... సెకనుకు ఒక గిగాబిట్ సమాచారం డౌన్లోడ్ చేసుకునే సౌకర్యమిస్తుంది... 4జీ టెక్నాలజీ ఉన్న బ్యాండ్‌విడ్త్‌ను మరింత సమర్థంగా వాడుకోవడంతోపాటు, సమాచారాన్ని పంపే విషయంలో ఏకకాలంలో వేర్వేరు ఫ్రీక్వెన్సీల్లో డేటా ప్రసారాలు చేసే అవకాశం ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఈ ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లోకి 4జీ సేవలను విస్తరించేందుకు టాటా టెలిసర్వీసెస్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల స్థాయిలోనూ బ్యాండ్‌విడ్త్ సమస్య అన్నది లేకుండా పోవడం వల్ల ఇంటర్నెట్ను మరింత వేగంగా అందుకోవడం సాధ్యం కానుంది. యంత్రాలు మాట్లాడుకుంటాయి... మొబైల్‌ఫోన్ చేతిలో ఉంటే ఇంట్లో ఉంటూనే పొలంలోని పంప్‌సెట్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ మిగిలిన యంత్రాల మాటేమిటి? ఎక్కడి నుంచైనా ఇంట్లో, ఆఫీసులో ఉండే యంత్రాలతో మాట్లాడగలిగితే? యంత్రాలు తమంతట తామే ఇతర యంత్రాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోగలిగితే? ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఎం2ఎం కమ్యూనికేషన్స్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. టెలికామ్ శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. మొబైల్-హెల్త్, ఎడ్యుకేషన్, కామర్స్.... స్మార్ట్ఫోన్లు సైతం గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో భారత్‌లో టెలికం ఆపరేటర్లు వాణిజ్యపరంగా కొత్త అవకాశాలపై దష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే మొబైల్-హెల్త్, మొబైల్-ఎడ్యుకేషన్, మొబైల్-కామర్స్ వంటి అంశాల్లో కొత్త కొత్త అప్లికేషన్లు ప్రవేశపెడుతున్నారు. మనకేంటి..? స్మార్ట్హోమ్ల సాకారానికి తొలిమెట్టు ఈ ఎం2ఎం. ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, సేవలు, నిర్మాణరంగం, ఇంకా అనేక రంగాల్లో యంత్రాలను అనుసంధానించవచ్చు. స్మార్ట్ మీటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, టెలీ హెల్త్, సెక్యూరిటీ రంగంలో మేలైన పరిష్కారాలు దొరుకుతాయి. ఇంధన వినియోగం, ఉత్పాదక వ్యయం, సమయం తగ్గుతాయి. ఆరోగ్య పరికరాలను పర్యవేక్షించడం, వ్యాధి నిర్ధారణ, స్మార్ట్ మీటరింగ్, రవాణా నిర్వహణ సాధ్యమవుతుంది. ఉపయోగం ఏంటి..? ఎం-హెల్త్: ఆరోగ్యం గురించి నిపుణులతో సమాచారం, సూచనలు అందుకోవచ్చు. పలు వ్యాధుల నివారణకు మొబైల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చాలా చౌకగానే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు పొందొచ్చు, అందించొచ్చు. ఎం-ఎడ్యుకేషన్: మారుమూల గ్రామాల్లో విద్యను అందించేందుకు ఈ అప్లికేషన్లు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా అనుసరించదగ్గ మోడల్‌ను ఇంకా రూపొందించాల్సి ఉంది. ఎం-కామర్స్: ఇప్పటికీ గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యం లేకపోవడంతో మొబైల్ ద్వారా ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలకు ఈ అప్లికేషన్లు ఉపయుక్తం.. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు డబ్బును సులభంగా, త్వరగా పంపేందుకూ బాగా ఉపయోగపడతాయి.