4జీ మాయ... స్మార్ట్ హవా!
సెకనుకో సినిమా డౌన్‌లోడ్...
రెండు సెకన్లకు మరోటి అప్‌లోడ్...
కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్, రెప్ప ఆర్పనివ్వని స్పష్టత...
ఇవేవో హైటెక్ హంగుల్లే మనకు అప్పుడప్పుడే అందవులే అనుకోకండి... అన్నీ సవ్యంగా సాగితే కొన్నినెలల్లోనే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయంటున్నారు... టాటా టెలికామ్ సర్వీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆశీష్ పచౌరీ.
టెలికామ్ రంగంలో సరికొత్త విప్లవానికి 2014 నాందీ పలకనుంది. ప్రస్తుతం మనలో చాలామంది ఉపయోగిస్తున్న త్రీజీ స్థానంలో మరింత ఆధునికమైన 4జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఫలితంగా అత్యధిక వేగంతో టెలికామ్ సేవలను అందుకోవడమే కాకుండా.. ఇంకా అనేకానేక వినూత్న సాంకేతిక మార్పులు సాధ్యమవుతాయి. అవి ఏమిటో స్థూలంగా...
భలే వేగం...
సెకనుకు ఒక గిగాబిట్ సమాచారం డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యమిస్తుంది... 4జీ టెక్నాలజీ ఉన్న బ్యాండ్‌విడ్త్‌ను మరింత సమర్థంగా వాడుకోవడంతోపాటు, సమాచారాన్ని పంపే విషయంలో ఏకకాలంలో వేర్వేరు ఫ్రీక్వెన్సీల్లో డేటా ప్రసారాలు చేసే అవకాశం ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఈ ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లోకి 4జీ సేవలను విస్తరించేందుకు టాటా టెలిసర్వీసెస్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల స్థాయిలోనూ బ్యాండ్‌విడ్త్ సమస్య అన్నది లేకుండా పోవడం వల్ల ఇంటర్నెట్‌ను మరింత వేగంగా అందుకోవడం సాధ్యం కానుంది.
యంత్రాలు మాట్లాడుకుంటాయి...
మొబైల్‌ఫోన్ చేతిలో ఉంటే ఇంట్లో ఉంటూనే పొలంలోని పంప్‌సెట్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ మిగిలిన యంత్రాల మాటేమిటి? ఎక్కడి నుంచైనా ఇంట్లో, ఆఫీసులో ఉండే యంత్రాలతో మాట్లాడగలిగితే? యంత్రాలు తమంతట తామే ఇతర యంత్రాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోగలిగితే? ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఎం2ఎం కమ్యూనికేషన్స్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. టెలికామ్ శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది.
మొబైల్-హెల్త్, ఎడ్యుకేషన్, కామర్స్....
స్మార్ట్‌ఫోన్లు సైతం గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో భారత్‌లో టెలికం ఆపరేటర్లు వాణిజ్యపరంగా కొత్త అవకాశాలపై దష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే మొబైల్-హెల్త్, మొబైల్-ఎడ్యుకేషన్, మొబైల్-కామర్స్ వంటి అంశాల్లో కొత్త కొత్త అప్లికేషన్లు ప్రవేశపెడుతున్నారు.
మనకేంటి..?
స్మార్ట్‌హోమ్‌ల సాకారానికి తొలిమెట్టు ఈ ఎం2ఎం. ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, సేవలు, నిర్మాణరంగం, ఇంకా అనేక రంగాల్లో యంత్రాలను అనుసంధానించవచ్చు. స్మార్ట్ మీటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, టెలీ హెల్త్, సెక్యూరిటీ రంగంలో మేలైన పరిష్కారాలు దొరుకుతాయి. ఇంధన వినియోగం, ఉత్పాదక వ్యయం, సమయం తగ్గుతాయి. ఆరోగ్య పరికరాలను పర్యవేక్షించడం, వ్యాధి నిర్ధారణ, స్మార్ట్ మీటరింగ్, రవాణా నిర్వహణ సాధ్యమవుతుంది.
ఉపయోగం ఏంటి..?
ఎం-హెల్త్: ఆరోగ్యం గురించి నిపుణులతో సమాచారం, సూచనలు అందుకోవచ్చు. పలు వ్యాధుల నివారణకు మొబైల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చాలా చౌకగానే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు పొందొచ్చు, అందించొచ్చు.
ఎం-ఎడ్యుకేషన్: మారుమూల గ్రామాల్లో విద్యను అందించేందుకు ఈ అప్లికేషన్లు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా అనుసరించదగ్గ మోడల్‌ను ఇంకా రూపొందించాల్సి ఉంది.
ఎం-కామర్స్: ఇప్పటికీ గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యం లేకపోవడంతో మొబైల్ ద్వారా ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలకు ఈ అప్లికేషన్లు ఉపయుక్తం.. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు డబ్బును సులభంగా, త్వరగా పంపేందుకూ బాగా ఉపయోగపడతాయి.