సామాన్యులకు షాకిచ్చి.. వీఐపీల సేవలో ఎయిరిండియా!
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంస్థ అయిన ఎయిరిండియా వీఐపీల సేవలో మునిగిపోవడం వల్ల సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిన విమానాన్ని వదిలేసి.. మధ్యప్రదేశ్ మంత్రి, ఇద్దరు న్యాయమూర్తులు ఎక్కిన విమానాన్ని నడిపేందుకు ఎయిరిండియా ప్రాధాన్యమివ్వడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి రాత్రి 7.30 గంటలకు భువనేశ్వర్‌కు ఎయిరిండియా విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే, ఈ విమానాన్ని పక్కనబెట్టి, భోపాల్‌కు వెళ్లే విమానాన్ని ముందు నడుపాల్సిందిగా ఎయిరిండియా తన పైలట్లకు చెప్పినట్టు తెలిసింది. భోపాల్ విమానంలో బీజేపీ మంత్రి సర్తాజ్ సింగ్‌తోపాటు ఇద్దరు న్యాయమూర్తులు ప్రయాణించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో భువనేశ్వర్‌కు వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరింది. తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికుల్లో ఒడిశా ఎంపీ తథాగత్ సత్పథీ, సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఉన్నారు. ప్రయాణికుల ఆందోళన కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న హైడ్రామాను వారు ట్విట్టర్లో ఎప్పకటిప్పుడు పంచుకున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి, ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారన్నకారణంతోనే భోపాల్ విమానాన్ని ముందు నడిపంచాలని నిర్ణయించారని తెలుస్తోందని సర్దేశాయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎయిరిండియా తీరును తప్పుబడుతూ బీజేపీ ఎంపీ తథాగత్ ప్రయాణికులతో కలిసి ఆందోళన చేపట్టారు.