తాతినేని కెరీర్లో ఎన్నో విజయాలు, హిందీలోనూ పేరుప్రఖ్యాతలు
ఆడా ఉంటా, ఈడా ఉంటా అంటూ తెలుగు, హిందీ.. రెండు భాషల్లోనూ సినిమాలు తీస్తూ అందరికీ దగ్గరయ్యారు తాతినేని రామారావు. ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగులో హిట్ అయిన వాటిని హిందీలో, అక్కడ విజయం సాధించిన చిత్రాలను తెలుగులోనూ రీమేక్ చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరుగాంచారు. సుమారు 70కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కపిలేశ్వరపురంలో 1938 నవంబర్ 10న తాతినేని రామారావు జన్మించారు. రామారావుకు ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు సోదరుడు. దాంతో రామారావు కూడా సినిమా రంగంపై మక్కువ పెంచుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేశాక చెన్నైకి (అప్పట్లో మద్రాసు) చేరుకుని ప్రకాశరావు వద్ద సహాయ దర్శకుడిగా చేరారు రామారావు. అలాగే దర్శకుడు కె. ప్రత్యగాత్మ దగ్గర కూడా అసోసియేట్‌గా చేశారు. ‘కులగోత్రాలు’ చిత్రానికి పని చేస్తున్న సమయంలో ఆ చిత్రనిర్మాత ఏ.వి. సుబ్బారావుతో రామారావుకి పరిచయం ఏర్పడింది.
తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా రూపొందిన ‘నవరాత్రి’ సినిమాని తాతినేని రామారావు దర్శకత్వంలో ‘నవరాత్రి’ టైటిల్‌తోనే తెలుగులో రీమేక్ చేశారు ఏ.వి. సుబ్బారావు. శివాజీ పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటించగా, సావిత్రి తన పాత్రలో తానే నటించారు. ‘నవరాత్రి’ రీమేక్‌తో తాతినేని రామారావు దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఏయన్నార్‌తో ‘బ్రహ్మచారి’, కృష్ణ, శోభన్‌బాబులతో ‘మంచి మిత్రులు’ తీశారు రామారావు. ‘సుపుత్రుడు’ ‘రైతు కుటుంబం’, ‘జీవన తరంగాలు’, ‘దొరబాబు, ఆలుమగలు’, ‘రాజువెడలె’, ‘అమరప్రేమ’ వంటి చిత్రాలు తెరకెక్కించారాయన. అయితే యన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘యమగోల’ చిత్రంతో కెరీర్లోనే బిగ్ హిట్ అందుకున్నారు రామారావు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. వెంకటరత్నం ‘యమగోల’ను నిర్మించారు. ఈ చిత్రాన్ని తాతినేని రామారావు దర్శకత్వంలోనే హిందీలో ‘లోక్–పరలోక్’గా నిర్మించారు వెంకటరత్నం. జితేంద్ర, జయప్రద జంటగా నటించిన ఈ సినిమా హిందీలోనూ హిట్ అయింది.
రీమేక్ స్పెషలిస్ట్
తెలుగులో తాను తెరకెక్కించిన ‘ఆలు మగలు’ చిత్రాన్ని హిందీలో ‘జుదాయి’గా రీమేక్ చేశారు రామారావు. ఇతర దర్శకులు తెరకెక్కించిన చిత్రాలనూ హిందీలో రీమేక్ చేశారాయన. వాటిలో లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించిన ‘కార్తీక దీపం’ని హిందీలో ‘మాంగ్ భరో సజనా’గా, తమిళంలో కె. భాగ్యరాజా దర్శకత్వం వహించిన ‘మౌన గీతంగళ్’ని హిందీలో ‘ఏక్ హీ భూల్’గా, కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అవళ్ ఒరు తొడర్ కథై’ని ‘జీవన ధారా’గా రీమేక్ చేశారు. ఇలా దక్షిణాదిలో హిట్ అయిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేసి, విజయ బావుటా ఎగురవేశారు. అదే విధంగా హిందీ హిట్లను తెలుగులో రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు. తెలుగు, హిందీ భాషల్లో 70కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు రామారావు. వీటిలో 30కి పైగా హిందీ చిత్రాలు ఉండడం విశేషం. తెలుగులో రామారావు దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘గోల్మాల్ గోవిందం’ (1992). గోవింద హీరోగా నటించిన ‘బేటీ నంబర్ వన్’ (2000) హిందీలో రామారావు చివరి చిత్రం.
20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా...
2000 సంవత్సరం తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు రామారావు. తనను దర్శకునిగా నిలిపిన చెన్నైలో స్థిరపడ్డారు. తాతినేని రామారావుకు సతీమణి జయశ్రీ, కుమార్తెలు చాముండేశ్వరి, నాగ సుశీల, కొడుకు అజయ్ కుమార్ ఉన్నారు. రామారావు మృతి పట్ల తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం చెన్నై టీ నగర్ కన్నమ్మాపేటలోని శ్మశాన వాటికలో తాతినేని రామారావు అంత్యక్రియలు జరిగాయి.
చదవండి: దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత
కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ..‘ఆర్ఆర్ఆర్’ రికార్డుపై కన్ను