మే 9న ఐఐపీ కొత్త బేస్ ఇయర్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)కి బేస్ ఇయర్ మారనుంది. 2011–12 బేస్ ఇయర్‌తో మే 9వ తేదీన కొత్త ఐఐపీ సిరీస్ ప్రారంభం కానుందని ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. ప్రస్తుతం ఐఐపీకి 2004–05 బేస్ ఇయర్‌గా ఉంది. తాజా సిరీస్‌ను చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ప్రారంభిస్తారని సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలకు మరింత పారదర్శకత చేకూరుతుందని కూడా ఆయన తెలిపారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) బేస్ ఇయర్ కూడా 2011–12గా మార్చేందుకు మదింపు జరుగుతోందని ఉన్నతాధికారి వెల్లడించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) బేస్ ఇయర్ ఇప్పటికే మారిన సంగతి తెలిసిందే. దీనితోపాటు వినియోగ సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకూ బేస్ ఇయర్‌గా 2011–12ను అమలు చేస్తున్నారు.