TCS company
-
టీసీఎస్ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు!
బెంగళూరు టీసీఎస్ ఆఫీసుకు ఈ రోజు (మంగళవారం) ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే అక్కడున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ఉద్యోగి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ చేసింది. క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఆఫీసుకు చేరుకున్నారు. ఆఫీసు మొత్తం వెతికినప్పటికీ అక్కడ బాంబు వంటివి లేదని నిర్థారించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి హుబ్లీకి చెందిన కంపెనీ మాజీ మహిళా ఉద్యోగి అని తెలిసింది. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నట్లు సమాచారం. కంపెనీ గతంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల ఈ పని చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్ ఈ ఏడాది మేలో ఒకసారి గుర్తుతెలియని వ్యక్తి హైదరాబాద్‌లోని టిసిఎస్ కొండాపూర్ క్యాంపస్‌కి ఫోన్ చేసి బాంబ్ పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అక్కడ పనిచేసే సుమారు 1500 మంది ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. కానీ ఇది ఫేక్ కాల్ అని తెలుసుకున్న తరువాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సంఘటన తరువాత మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. -
టీసీఎస్ రిజల్ట్స్..స్వల్పంగా పెరుగనున్న ఆదాయం
ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ అయిన టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాలు బుధవారం రానున్నాయి. మరికాసేపట్లో మార్కెట్ టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ క్యూ2 ఫలితాలు విడుదలవుతాయి. అయితే ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ విలువ దాదాపు రూ.13.29 లక్షల కోట్లుగా ఉంది. వివిధ బ్రోకరేజ్ సంస్థలు టీసీఎస్ ఫలితాలను అంచనా వేశాయి. దాని ప్రకారం..టీసీఎస్ ఆదాయం త్రైమాసికంలో 1.4శాతం వృద్ధితో రూ.60,218 కోట్లకు చేరుతుంది. వార్షిక వారీగా ఆదాయం దాదాపు 9% పెరుగుతుంది. నికర లాభం త్రైమాసికంలో 3%, వార్షిక వారీగా 9% పైగా పెరిగి రూ.11,404 కోట్లుగా ఉంటుందని అంచనా. టీసీఎస్ ఆపరేటింగ్ మార్జిన్ QoQలో 30-90 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ సేవలపై క్లయింట్స్ వ్యయాలు మందగించినప్పటికీ, టీసీఎస్ డీల్ విన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డ్ మీటింగ్ కూడా కాసేపట్లో జరుగనుంది. క్యూ2 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్స్ బైబ్యాక్ గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన మరింత సమాచారం వెలువడనుంది. -
Hyderabad: టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశారు దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. టీసీఎస్ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఉద్యోగులను బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్‌తో కంపెనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఫేక్ కాల్ అని, బాంబు లేదని నిర్ధారించారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. టీసీఎస్ కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి నిర్వాకంగా పోలీసులు తేల్చారు. తనకు తానే పోలీసులకు ఫోన్ చేసి ఫేక్ సమాచారం ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా కంపెనీలో బాంబు లేదని తేల్చడంతో ఇటు ఉద్యోగులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: పెళ్లైన వెంటనే రంగంలోకి.. అటు వివాహం.. ఇటు నినాదం -
TCS CEO: రాజేష్ గోపీనాథన్ సంపాదన ఎంతో తెలుసా?
వ్యాపార ప్రపంచంలో ఎదగటానికి కృషి, సంకల్పం, అకుంఠిత దీక్ష వంటివి తప్పనిసరిగా అవసరం. ఇలాంటి కఠినమైన నియమాలతో గొప్పస్థాయికి చేరుకున్న ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లలో రాజేష్ గోపీనాథన్ ఒకరు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్న రాజేష్ గోపీనాథన్, సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన ఎన్ఐటి నుంచి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందడానికి అహ్మదాబాద్‌లోని IIM లో చేరాడు. TCS మేనేజింగ్ పార్టనర్ అండ్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన తర్వాత కంపెనీ వార్షిక ఆదాయాన్ని భారీగా పెంచాడు. 2021 - 2022 ఆర్థిక సంవత్సరంలో 26.6 శాతం వృద్ధిని చూపించాడు. రాజేష్ గోపీనాథన్ జీతం 1.5 కోట్లు అని, 2.25 కోట్ల రూపాయలు ప్రయోజనాలు, ఇతర అలవెన్సులు మొత్తం భారీ సంపాదన ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!) రాజేష్ గోపీనాథన్ 2022లో బోర్డ్ ఆఫ్ కామర్స్‌కు, UK ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, CII నేషనల్ కౌన్సిల్ వంటి వాటికి మాత్రమే కాకుండా ఇండియా US CEO ఫోరమ్ అండ్ 2001 ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్‌లో భాగంగా ఉన్నారు. కంపెనీ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించిన్నప్పుడు అతనికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవ్వబడింది. ఫిబ్రవరి 2013లో అతను CFOగా నియమితుడయ్యాడు. -
టీసీఎస్ క్యూ3 భేష్!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 10,846 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,769 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 58,229 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 48,885 కోట్ల టర్నోవర్ నమోదైంది. కార్యకలాపాల్లో వృద్ధి, ఫారెక్స్ లాభాలు తాజా త్రైమాసికంలో కంపెనీ లాభదాయకతకు సహకరించాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 75 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. దీనిలో రూ. 67 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. వెరసి డివిడెండ్ రూపేణా రూ. 33,000 కోట్లను పంచనుంది. డాలర్ల రూపేణా ఆదాయం 8 శాతం మెరుగుపడినట్లు టీసీఎస్ పేర్కొంది. భారీగా ఉద్యోగాలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో అత్యంత భారీగా ఉద్యోగ సృష్టికి తెరతీయనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. డీల్ పరిస్థితులు, పైప్‌లైన్ ఆశావహంగా ఉన్నట్లు సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం పేర్కొన్నారు. 7 నుంచి 9 బిలియన్ డాలర్ల మధ్య డీల్స్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. వీటికి మధ్యస్థంగా కాంట్రాక్టులు పొందినట్లు వెల్లడించారు. థర్డ్‌పార్టీ, ఇతర వ్యయాలు పెరగడంతో లాభాల మార్జిన్లు ప్రభావితమైనట్లు సీఎఫ్‌వో సమీర్ సేక్సరియా పేర్కొన్నారు. గతేడాది స్థాయిలోనే 25 శాతం ఇబిటా మార్జిన్లు సాధించగలమని తెలియజేశారు. తగ్గిన సిబ్బంది... చాలా ఏళ్ల తదుపరి క్యూ3లో టీసీఎస్ మొత్తం సిబ్బంది సంఖ్య 2,197 తగ్గి 6,13,974కు పరిమితమైంది. ఉపాధి కల్పనకు మించి ఉద్యోగ వలస దీనికి కారణమైనట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలియజేశారు. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో 42,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోగా.. క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరికొంతమందికి ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది(2023–24)లోనూ 40,000 మంది కొత్తవారిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. పూర్తి ఏడాదిలో 1.25–1.5 లక్షల మందిని ఎంపిక చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ ► నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 24.5 శాతాన్ని తాకాయి. ► క్యూ3లో 7.9 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► ఉద్యోగుల వలస(అట్రిషన్) స్వల్పంగా తగ్గి 21.3 శాతానికి చేరింది. ► కొత్త ఏడాదిలో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటన. మార్కెట్లు ముగిశాక టీసీఎస్ సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. క్యూ3 పనితీరుపై అంచనాలతో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 3.35 శాతం ఎగసి రూ. 3,320 వద్ద ముగిసింది. చదవండి: ‘70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా.. ఒక్క జాబ్ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’ -
ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, ముంబై: ప్రపంచ మాంద్యం భయాలు, మూన్‌లైటింగ్ వివాదాల మధ్య ఐటీ నిపుణులకు కంపెనీలు తీపి కబురు అందిస్తున్నాయి. ప్రధానంగా దేశీయ రెండో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు వేతనాలను పెంచినట్టు ధృవీకరించింది. తన సిబ్బందికి 10 నుంచి 13 శాతం జీతాల పెంపును అందించినట్టు ప్రకటించింది. దీంతోపాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులు 20-25శాతం ఇంక్రిమెంట్లు పొందినట్టు తెలిపింది. ఇన్ఫీ, టీసీఎస్, విప్రో,తోపాటు కాగ్నిజెంట్ సంస్థలు తమ ఉద్యోగులకు దాదాపు 10శాతం వేతనాలు పెంపును దిశలో ఉండటం విశేషం. ఇంక్రిమెంట్లు ఉద్యోగి గ్రేడ్‌పై ఆధారపడి ఉంటాయయనీ, సీనియర్ మేనేజ్మెంట్ జీతాలు ఎక్కువగా ఉన్నందున తక్కువ మొత్తంలో పెంపు ఉంటుందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గ్రూప్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. తగ్గుతున్న అట్రిషన్ రేట్లతో, ఇన్ఫోసిస్ వినియోగ స్థాయిలను పెంచడం, పార్శ్వ నియామకాలు, ఆన్-సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వేతన వ్యయాలను నియంత్రించ డానికి ప్రయత్నిస్తోంది. ఇన్ఫోసిస్‌తోపాటు, టీసీఎస్, విప్రో, ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా తన ఉద్యోగులకు 10 శాతం వరకు వేతనాలు పెంచనుందట. అక్టోబర్ మాసంనుంచి ఈ పెంపు వర్తించనుందని తెలుస్తోంది. కాగా కరోనా సంక్షోభకాలంలో ముఖ్యంగా 2021లో ఐటీ కంపెనీల బంపర్ జీతాల పెంపు, కౌంటర్ ఆఫర్లతో ఉద్యోగులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది జనవరి, జూలైలో రెండు పెంపులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 345,218 మంది నిపుణులకు ఉపాధి కల్పించిన ఇన్ఫీ, అధిక వ్యయాలను నియంత్రించుకోవాలని చూస్తోంది. -
మార్కెట్ విలువలో బీఎస్ఈ సరికొత్త రికార్డ్
ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా మరో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. సోమవారానికల్లా మార్కెట్లు వరుసగా 9 రోజులపాటు లాభపడుతూ వచ్చాయి. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,623 పాయింట్లు జంప్‌చేసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12,89,863 కోట్లకుపైగా జత కలిసింది. వెరసి బీఎస్ఈ మార్కెట్ విలువ అంటే లిస్టెడ్ కంపెనీల విలువ తొలిసారి రూ. 191 లక్షల కోట్లను తాకింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఈ విలువ డాలర్ల రూపేణా 2.6 ట్రిలియన్లకు సమానంకావడం విశేషం! (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) పలు అంశాల సపోర్ట్ కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం ప్రధానంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత రెండు నెలల్లోనే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో ఏకంగా 14 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు ప్రస్తావించారు. దీనికితోడు ఇటీవల దేశీయంగా రెండు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సెంటిమెంటు బలపడిందని తెలియజేశారు. డిసెంబర్లో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదుకావడం, ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రికవర్ అవుతున్నట్లు ఆర్బీఐ నివేదిక తాజాగా అభిప్రాయపడటం వంటి పలు సానుకూల అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు వివరించారు. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) 2020లోనూ బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 191 ట్రిలియన్ మార్క్‌ను సాధించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ తాజాగా రూ. 12,49,218 కోట్లను అధిగమించింది. ఈ వెనుకే సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రూ. 11,50,106 కోట్ల విలువతో రెండో ర్యాంకును సాధించింది. కాగా.. కోవిడ్-19 సంక్షోభంలోనూ 2020లో సెన్సెక్స్ దాదాపు 16 శాతం పురోగమించిన విషయం విదితమే. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 32.49 లక్షల కోట్లమేర వృద్ధి చెందింది! -
55 వేల కంటే ఎక్కువ మందికే ఉద్యోగాలు: టీసీఎస్
బెంగళూరు: టీసీఎస్ కంపెనీ అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలోనే కొత్త అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వనున్నది. ఉద్యోగుల పనితీరు ఆధారిత పునర్వ్యస్థీకరణ అంటే ఉద్యోగాల నుంచి ఉద్వాసన చెప్పడం కాదని టీసీఎస్ స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 55 వేల మందికి కొత్త కొలువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ అజోయేంద్ర ముఖర్జీ చెప్పారు. ఈ పనితీరు ఆధారిత పునర్వ్యస్థీకరణ ప్రత్యేక కార్యక్రమమేదీ కాదని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి పనితీరు ఎలా ఉన్నదనే విషయాన్ని మదింపు చేస్తామని వివరించారు. వచ్చే ఏడాది ఎంతమందికి కొలువులిచ్చే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. -
అదృశ్యం ఫిర్యాదులంటే అంత అలుసా?
‘అనూహ్య కేసు’లో తీవ్రంగా స్పందించిన ముంబై హైకోర్టు హైదరాబాద్: సంచలనం సృష్టించిన ముంబైలోని టీసీఎస్ సంస్థ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కృష్ణా జిల్లా మచిలీపట్నం వాసి ఎస్తేర్ అనూహ్య హత్యకేసులో మహారాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఓ యువతి అదృశ్యమైనట్లు ఫిర్యాదు వస్తే అలుసా? దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడింది. దీనికి బాధ్యులపై తీసుకున్న చర్యలేమిటో నివేదించాలంటూ ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. ఎస్తర్ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ముంబై సామాజిక వేత్త, న్యాయవాది అభాసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ అనూజ ప్రభుదేశాయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసుల విషయంలో ఇప్పటివరకు కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, వాటిపై తీసుకున్న చర్యల్ని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. -
టీసీఎస్ ఉద్యోగిని హత్య?
వారం రోజుల క్రితం అదృశ్యమైన టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) ఉద్యోగిని ఒకరు హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహాన్ని తాము గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఉమా మహేశ్వరి అనే ఈ మహిళ హత్యకు గురైందనే వారు భావిస్తున్నారు. ఆమె శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో కూడా వెల్లడైందని ఓ అధికారి తెలిపారు. ఉమా మహేశ్వరి (24) ఈనెల 13వ తేదీ (వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందు) ఆఫీసు నుంచి సాయంత్రం వెళ్లిన తర్వాతి నుంచి కనపడకుండా పోయింది. శనివారం నాడు ఓ పొద సమీపంలో ఆమె మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె గత ఏడాది నుంచి టీసీఎస్‌లోని అకౌంట్స్ విభాగంలో పనిచేస్తోందని, సహోద్యోగులంతా ఆమెను మెచ్చుకుంటారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.