విదేశీ నాణేలకు తుప్పు
=మార్చడంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం
=పరకామణి నుంచి ట్రెజరీకి చేరుతున్న కాయిన్లు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించిన నాణేలు నాలుగేళ్లుగా ట్రెజరీలో మగ్గుతున్నాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి పూర్తిగా తుప్పుపట్టే పరిస్థితి నెలకొంది. తిరుమలకు వేలాదిమంది విదేశీ భక్తులు, ప్రవాసభారతీయులు వస్తుం టారు. వారు ఆయా దేశాలకు చెందిన నాణేలను శ్రీవారికి కానుకలుగా సమర్పిస్తుంటారు. వీటిని పరకామణి సిబ్బంది లెక్కించే సమయంలో వేరు చేస్తారు. స్వదేశీ నాణేలను బ్యాంకుల్లో జమ చేస్తారు. విదేశీ నాణేలను తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ట్రెజరీకి పంపుతారు.
ట్రెజరీ నుంచి వాటిని విదేశీ బ్యాంకుల్లో మార్చుకుని, తిరిగి టీటీడీ బ్యాంకుల్లో జమచేయాల్సి ఉంది. ఈ పద్ధతి 2009 వరకు బాగానే జరిగింది. ఆ తర్వాత విదేశీ బ్యాంకులను సంప్రదించడం మానేశారు. ఈ నాణేలను ట్రెజరీలోనే భద్రపరుస్తున్నారు. తిరుమలలో జరిగే హుండీ లెక్కింపుల ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని, తిరుపతిలోని ట్రెజరీకి అప్పగిస్తారు. ఇలా అప్పగించిన నాణేలు నాలుగు సంవత్సరాలుగా పరిపాలనా భవనంలోని ట్రెజరీలోనే మగ్గుతున్నాయి.
వీటిని మార్చడానికి టీటీడీ అధికారులకు సమయం లేదో, లేక ఆ డబ్బు అక్కరలేదని అనుకుంటున్నారో తెలియడం లేదని టీటీడీ ఉద్యోగులు అంటున్నారు. 2009 నుంచి 2011 వరకు వచ్చిన విదేశీ కరెన్సీ దాదాపు 600 బ్యాగుల్లో నిక్షి ప్తమై ఉ న్నాయి. ఒక్కో బ్యాగు 30 నుంచి 40 కిలోల వరకు బ రువు ఉంటుందని సంబంధిత అధికారులు తెలి పారు. వీటిలో పది లక్షలకు పైగా నాణేలు ఉండవచ్చని అంచనా. స్వదేశీ కరెన్సీతో ఈ నాణేలను మారిస్తే దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు టీ టీడీ పేరిట జమ అవుతుంది. ఇది కాకుండా 2011 నుంచి 2013 వరకు వచ్చిన నాణేలు మరో పది టన్నుల వరకు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ వీటిని మార్చక పోవడం వల్ల ఎంతో వడ్డీని పోగొట్టుకోవాల్సి వస్తోంది.
వారానికొక సారి కట్నోట్ల మార్పిడి
విదేశీ నాణేలను మార్చకుండా అలాగే దాచి పెడు తుండగా, కట్ నోట్లను మాత్రం వారానికి ఒకసారి మారుస్తున్నారు. దీనికి బాం్యకు అధికారులు ముం దుకు వచ్చి, ఎన్ని కట్ నోట్లు ఉన్నాయో తీసుకుని, వాటిని టీటీడీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంటారు. అయితే విదేశీ నాణేల మార్పిడిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. టీటీడీ ట్రెజరీలోని గదులు ఈ బ్యాగులతో నిండిపోతున్నాయి. కొన్ని నాణేల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని తుప్పు పట్టే స్థితికి చేరుకుంటున్నాయి. దీనిపై టీటీడీ అధికారి ఒకరు మాట్లాడుతూ పురాతన నాణేలను మ్యూజియంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మిగిలిన నాణేలను త్వరలోనే మారుస్తామని తెలిపారు. నాణేలు ఎక్కువగా ఉండడంతో వాటిని ఏ బ్యాంకుకు ఇవ్వాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.