ప్రధాని కార్యక్రమంపై టీచర్లు, తల్లిదండ్రుల తీవ్ర అసంతృప్తి
ముంబై: ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులతో టీవీద్వారా నేరుగా సంభాషించాలనే ప్రధాని ప్రతిపాదనపై తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతప్తి వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సున్నితంగా ఉండాలనే ఉద్దేశంతో తాము సహకరిస్తున్నామని స్పష్టం చేశారు.
నగరంలోని తిలక్భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్కులర్లోని అంశాలు సరిగా లేవని, దీనిని ఈ అంశాన్ని సరైన వేదికపై ప్రస్తావిస్తామన్నారు. ఒక్క వ్యక్తికి ప్రచారం కల్పించేందుకు మొత్తం యంత్రాంగాన్ని వాడుకుంటున్నారన్నారు. ప్రధాని ప్రసంగాన్ని విద్యార్థులు ఆలకించాలనడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. కాగా ప్రధాని కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని, ఎటువంటి ఒత్తిళ్లు ఉండబోవని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం ప్రకటించిన సంగతి విదితమే.
పాలన విఫలం
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 100 రోజుల పాలన విఫలమైందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. కనీసం హోం శాఖ మంత్రి సైతం తన అనయాయుడికి పదవిని ఇప్పించుకోలేని స్థితిలో పడిపోయారన్నారు.
నాయకత్వ లోపమే కారణం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కేంద్రంలో సరైన నాయకత్వం లేకపోవడమే కారణమని చవాన్ ఆరోపించారు. ప్రధాని షోలాపూర్ పర్యటనకు ముందే విద్యుత్ సంక్షోభంపై హెచ్చరించానన్నారు.
ఉద్దేశపూర్వకంగానే ఆనా టి సభలో తాను ప్రసంగించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేటాయించిన కోటాలో కేవలం 60 శాతం బొగ్గు మాత్రమే వస్తోందన్నారు. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలోని అనేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయన్నారు. ఇక ఎన్నికల విషయమై మాట్లాడుతూ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నా యన్నారు.