తేజశ్విని బంధువుల రాస్తారోకో
♦ ప్రత్యేక వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్
♦ నలుగురు నిందితులను అరెస్ట్ చేయాలని పట్టు
రేపల్లె : ఇంటర్ విద్యార్థిని బొమ్మిడి తేజశ్విని (16) మృతిపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తేజశ్విని మృతదేహానికి ప్రత్యేక వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని, హత్య చేసిన నాగరాజుతో పాటు మరో ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్లో బైటాయించి జోరున వర్షంలోనూ రాస్తారోకో నిర్వహించారు. తేజశ్వినికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకుండా హంతకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.
హత్య చేసిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంట పాటు సాగిన రాస్తారోకోతో ట్రాఫిక్ స్థంభించింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎం.ఆనందరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక వైద్యులను మధ్యాహ్నానికల్లా రప్పించి తేజశ్విని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందిస్తామని, నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు.
అయితే పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యులు సాయంత్రం వరకు రాకపోవటంతో తేజశ్విని కుటుంబ సభ్యులు, బంధువులు మరోమారు ఆందోళణకు సిద్ధమవుతుండటంతో పోలీసులు వారితో చర్చించారు. ఆదివారం ఉదయం వైద్యులు వస్తున్నారని, 9 గంటలకు మృతదేహాన్ని బంధువులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దీంతో బంధువులు శాంతించి ఆందోళనను విరమించారు.