జీహెచ్ఎంసీలోని స్థానికేతరులు స్వస్థలాలకు వెళ్లాలి
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులందరినీ వారి వారి ప్రాంతాలకు పంపించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు జి. దేవిప్రసాద్, సి. విఠల్, కారం రవీందర్‌రెడ్డి, తిప్పర్తి యాదయ్య తదితరులు మాట్లాడారు. జీహెచ్ఎంసీతోపాటు తెలంగాణలోని ఇతర మునిసిపాలిటీల్లో పనిచేస్తున్నవారిని కూడా ఎలాంటి ఆప్షన్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమించాలన్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఉద్యోగాల్లో చేరినవారు కూడా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. అపాయింటెడ్ డే (జూన్2)కు ముందుగానే ఇక్కడి ఉద్యోగులంతా వారి మాతృసంస్థలకు వెళ్లిపోవాలని సూచించారు. వారంతా వెళ్లిపోయాక మిగిలే ఖాళీలను స్థానికులైన నిరుద్యోగ యువతతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు చెత్త నిర్వహణ పనులకు రాంకీకి అప్పగించరాదని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక తగిన నిర్ణయం తీసుకోగలదన్నారు. సమావేశానంతరం ఇవే డిమాండ్లతో రూపొందించిన వినతిపత్రాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు అందజేశారు.