అవరోధాలు దాటి అధికారం దాకా..
- టీఆర్ఎస్ ప్రస్థానంలో ఉత్థానపతనాలు ఎన్నో..
- అన్నీ తానై పార్టీని ముందుకు నడిపిన కేసీఆర్
- ఉద్యమమే ఊపిరిగా జనానికి చేరువైన గులాబీ సారథి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సాధన కోసం రాజకీయ ప్రక్రియను కూడా ఒక పోరాట రూపంగా ఎంచుకుంటున్న ఉద్యమపార్టీ’...ఈ ప్రకటనతో కల్వకుం ట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈ పదవుూడేళ్ల ప్రస్థానంలో అనేక ఒడిదొడుకులను, అవరోధాలను, ఉత్థానపతనాలను దాటి చివరకు తన గవ్యూన్ని వుుద్దాడింది! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఖ్యాతితోపాటు తొలి సారి తెలంగాణ రాష్ట్ర పాలన పగ్గాలనూ అందుకుంది. 2009 ఎన్నికల్లో కేవలం 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ తీవ్ర సంక్షోభానికి గురైంది. ఒక దశలో పార్టీ ఉం టుం దా, ఉండదా.. అనేంత సంక్షోభాన్ని ఎదుర్కొని అ నూహ్యంగా మళ్లీ ప్రాభవాన్ని సంపాదించుకుంది.
ఎన్నెన్నో అవరోధాలు....
2001లో పార్టీ ఆవిర్భవించిన మూడు నెలలకే వచ్చిన జిల్లా, మండల పరిషత్తు ఎన్నికల్లో ప్రభంజనమే సృష్టించింది. అప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉంటూ డిప్యూటీ స్పీకరుగా, సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్న కేసీఆర్ ఆ పదవులకు రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికల్లో కేసీఆర్ విజయదుందుభి మోగించారు. ఆ తర్వాత 2004లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 26 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలను గెల్చుకుంది. రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులను, కేంద్రలో రెండు కేబినెట్ పదవులను స్వీకరించింది. ఈ సందర్భంగా కేసీఆర్‌పై పలు విమర్శలు తలెత్తాయి.
కేసీఆర్ వ్యవహార శైలిని విభేదించి ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. తర్వాత కేసీఆర్ 2006లో కరీంనగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. ఆ వెంటనే పార్టీ ముఖ్య నేత నరేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ నినాదంతోనే 16 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలను తెచ్చిపెట్టారు. 2008లో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో పార్టీ రెండు లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెల్చుకుంది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి కేసీఆర్ రాజీనామా చేశారు. కానీ పార్టీ నాయకులంతా కేసీఆర్‌నే తిరిగి పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
2009 ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, సీపీఐలతో కూడిన మహాకూటమితో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు పోటీచేయగా 10 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను మాత్రమే గెల్చుకుంది. ఈ దారుణ పరాజయం తర్వాత కొంతకాలం పాటు పార్టీ మనుగడపైనే అనుమానాలు తలెత్తాయి. హైదరాబాద్‌ను ఫ్రీజోన్ చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో బహిరంగ సభ, ఆ వెంటనే ఆమరణ దీక్షకు దిగడంతో తెలంగాణ ఉద్యమం రగులుకుంది. టీఆర్ఎస్కు మళ్లీ ఆదరణ పెరిగింది. 2010 నుంచి పెరుగుతూ వచ్చిన ఆ ఆదరణ.. చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతో పాటు టీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడింది.
కాంగ్రెస్ తప్పిదాలే విజయ సోపానాలు
2009లో కేసీఆర్ ఆమరణ దీక్షకు జడిసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటన చేసింది. అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను 23న వెనక్కి తీసుకున్నారు. దీంతో ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఎమ్మెల్యేలంతా పార్టీలకు అతీతంగా రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడంతో తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ చాంపియన్‌గా నిలిచింది. 2009 నుంచి 2014 ఎన్నికలు వచ్చే వరకు టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు క్రమంగా టీఆర్ఎస్లో చేరారు. అలా దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ప్రకటన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం, జేఏసీ ఉద్యమ కార్యక్రమాలపై ప్రభుత్వం నిర్బంధం విధించడం వంటి పరిణామాలు టీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి.
పెట్టిన సభలెన్నెన్నో....
టీఆర్ఎస్ ఆవిర్భవించిన త ర్వాత ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలకు లెక్కలేదు. రాజకీయ పార్టీగా ఏ ఇతర పార్టీ నిర్వహించలేనన్ని సభలను టీఆర్ఎస్ నిర్వహించింది. ఏ స్థాయిలో అంటే... తెలంగాణ ఉద్యమం అంటే బహిరంగ సభలు, ఉప ఎన్నికలేనా అని ప్రత్యర్థులు విమర్శించేలా సాగాయి. నిర్మాణపరంగా బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ జాగరణ సేనను మధ్యలోనే నిలిపివేశారు. మరికొన్ని వినూత్న ఉద్యమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆచరణ సాధ్యం కాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. మరికొన్ని కార్యక్రమాలను చేపట్టాలనుకున్నా వాటిని ఆచరణలో చూపించలేకపోయారు.
ఇవీ దోహద పడ్డాయి...
తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది అన్నీతానై పోరాడిన కేసీఆర్.. టీఆర్ఎస్కు విజయాన్ని కట్టబెట్టారు. రోజుకు పది పన్నెండు సభల్లో ప్రచారం చేస్తూ పార్టీని విజయతీరాలకు చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కేసీఆర్ గెలుపు సూత్రాలివే..!
- తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఏర్పడిన పార్టీగా ముద్ర
- తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అయినా.. తన పోరు వల్లే ఇవ్వాల్సి వచ్చిందనే ప్రచారం
- రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణమనే కొత్త ఎజెండా ఏర్పాటు
- మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల పెంపు.. రుణమాఫీ వంటి ఎన్నికల హామీలు
- పేదలకు రెండు బెడ్రూముల ఇళ్లు, పెన్షన్ల పెంపు, కొత్త ఉద్యోగాల కల్పన వాగ్దానాలు
- ఇంకా కొట్లాడే సమస్యలున్నాయనీ.. వాటి కోసం తానే పోరాడగలననీ కేసీఆర్ ప్రకటించడం
- ఉద్యోగుల ఆప్షన్లు, నదీజలాలపై తెలంగాణ ఉద్వేగాన్ని సజీవంగా ఉంచడం
- అన్నీ తానై, వంద పైచిలుకు సభల్లో విస్తృతంగా ప్రచా రం చేసి తన వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం
- ఉద్యమంలో పాల్గొన్న వివిధ వర్గాల నుంచి కొందరు నేతలకు కొన్ని టికెట్లివ్వడం
- సొంత పార్టీలో కనిపించని అసమ్మతి.., కేంద్రీకృత నాయకత్వం, స్థిర నిర్ణయాలు
- ఏ పార్టీ నుంచి వచ్చినా సరే గెలుపు గుర్రాలకు చివరి క్షణాల్లోనూ టికెట్లు ఇవ్వడం
- కాంగ్రెస్‌లో విలీనాన్ని తోసిపుచ్చి, సొంతంగానే బరిలో దిగి కాంగ్రెస్ పాలనపై జనంలో ఉన్న అసంతృప్తి నుంచి తప్పించుకోవడం
- పల్లెల్లో పార్టీ నిర్మాణమున్న టీడీపీని తెలంగాణ ద్రోహిగా చూపగలగడం
- ఇతర పార్టీల పొత్తు ప్రతిపాదనలను పక్కనబెట్టి, సీట్ల ఒత్తిళ్లను తప్పించుకోవడం
- ప్రధాన ప్రత్యర్థి శిబిరంలో నాయకత్వ లేమి, అంతః కలహాలు, వ్యూహరాహిత్యం
- ‘బిడ్డ పుట్టింది, తల్లి చచ్చింది..’ వంటి వ్యాఖ్యలను మోడీకి వ్యతిరేకంగా మల్చడం
- పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణ, రాజధానులపైనా దృష్టి పెట్టడం