హామీలన్నీ నెరవేరుస్తం: కేసీఆర్
- సంక్షేమం, వ్యవసాయం, ఉద్యోగాలు, ఉపాధికి ప్రాధాన్యత
- పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు పరుగెత్తుకు వచ్చేట్లు చేస్తం
- అమరుల కుటుంబాలను కడుపుల పెట్టుకొని చూసుకుంటం
- విద్యార్థులపై ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తివేస్తం
- ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తం
- మోడీ, చంద్రబాబుకు కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే తమ ధ్యేయమని, ఎన్నికల ముందు తామిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఒక్కమాట పొల్లుబోకుండా తమ మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని, విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఎవరితో అవసరం లేకుండా, స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేస్థాయిలో తమకు మెజారిటీ కట్టబెట్టినందుకు యావత్ తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నమస్కరిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. ‘‘టీఆర్‌ఎస్‌పై ప్రజలు చాలా పెద్ద బాధ్యత ఉంచారు. ప్రజలు ఉంచిన పూర్తి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి బేషజాలకు పోకుండా సంస్కారవంతంగా ముందుకుపోవడమే శ్రీరామ రక్షగా భావిస్తం. టీఆర్‌ఎస్ ఎప్పుడూ కూడా విజయం వస్తే పొంగిపోలే. అపజయం వస్తే కుంగిపోలే. అన్ని రకాల పరిస్థితులనూ ఎదుర్కొంటూ ముందుకు సాగినం.
సాధించుకున్న రాష్ట్రాన్ని చక్కబెట్టుకునే అవకాశాన్ని ప్రజలు మా చేతిల పెట్టిండ్రు కాబట్టి వినయంగ ముందుకు పోతం. ఇప్పుడిక్కడ ఏర్పడిన ప్రతిపక్షాల సహకారాన్ని కూడా సంపూర్ణంగా కోరుతున్నా. వారి మీద మాకు ఎటువంటి బేషజాల్లేవు. ఎన్నికల సందర్భంగా మంచో, చెడో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు అభివృద్ధే అందరి ఆకాంక్ష కావాలి. తెలంగాణ అభివృద్ధే పరమావధిగా తెలంగాణలో పనిచేసే వ్యక్తులు, శక్తుల సహకారాన్ని సంపూర్ణంగా అభ్యర్థిస్తున్నా..’’ అని కేసీఆర్ కోరారు.
నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఎంపిక..
టీఆర్‌ఎస్ తరఫున కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల సమావేశం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. ఆ సమావేశంలోనే పార్టీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటామని చెప్పారు. అలాగే మిగతా కార్యక్రమాలేం చేపట్టాలనేది సాయంత్రం 5 గంటల తర్వాత నిర్ణయించుకొని ముందుకు సాగుతామన్నారు. టీఆర్‌ఎస్‌కు ముఖ్యంగా మూడు ప్రాధాన్యతలున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఒకటి పేదలు, వారి సంక్షేమం.. దీన్ని వందశాతం సంపూర్ణమైన బాధ్యతతో స్వీకరిస్తాం. రెండోది వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం.
దీని ద్వారా జీడీపీకి, జీఎస్డీకి వచ్చే ఆదాయం తక్కువైనా గ్రామీణ ప్రజలు తొంభైశాతం దానిమీదే బతుకుతున్నరు కాబట్టి దానికి ప్రాధ్యాన్యత. ఇక మూడోది యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలె, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగావాలె. అందుకు కొత్త పరిశ్రమలు రావాలె కాబట్టి దేశంలోనే అద్భుతమైన పాలసీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు పరుగులు పెట్టే విధానాన్ని ఏర్పాటు చేస్తం. అదంతా కూడా పారదర్శకంగా చేస్తం...’’ అని కేసీఆర్ తెలిపారు.
అమరవీరులకిచ్చిన హామీలు నెరవేరుస్తం..
టీఆర్‌ఎస్ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే అమరవీరులకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ‘‘అమరవీరులను ఎంత స్మరించుకున్నా... ఎంత పొగుడుకున్నా తక్కువే. వారి కుటుంబ సభ్యులను కడుపులో పెట్టుకొని ఆదుకుంటం. అదే విధంగా ఉద్యమంలో పనిచేసిన వేలాది మంది విద్యార్థులపై అనేక కేసులున్నయి. అధికారులతో చర్చించి వాటిని ఎత్తివేసే నిర్ణయం తీసుకుంటం. రాష్ట్రం ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల్లో ఏవైనా తెలంగాణకు పనికిరానివి ఉంటే వాటిని కచ్చితంగా సమీక్షిస్తం... వందశాతం వాటిని సమూలంగా మార్చడానికి నిర్ణయాలు తీసుకుంటం..
ఈ ప్రాంతం ఇప్పటిదాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే.. అప్పుడు జరిగిన నిర్ణయాలన్నీ ఆంధ్రప్రదేశ్ లెక్కల జరిగినయి. ఇది తెలంగాణ రాష్ట్రం. తీసుకొనే నిర్ణయాలన్ని తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉంటయి. రైతాంగం శ్రేయస్సు అనుకూలంగా ఉంటయి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ విధంగా తమ పాత్ర ఉండబోతుందనేదానిపై శనివారం తమ పార్లమెంటరీ పార్టీ భేటీలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.
మోడీకి అభినందనలు..
‘‘ఏకపక్షంగా దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని పొందినటువంటి, ప్రధాని కాబోతున్న నరేంద్రమోడీకి అభినందనలు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న నారా చంద్రబాబునాయుడుకు కూడా అభినందలు తెలుపుతున్న. ఇది నా కర్తవ్యం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.