నరసరావుపేటలో మరోసారి ఉద్రిక్తత
నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీవీ కార్యాలయంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ సోమవారం ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే పోలీసులు ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు నిన్నటి దాడి ఘటనను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ ఇవాళ పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే టీడీపీ వర్గీయులు మాత్రం బంద్‌ను భగ్నం చేసేందుకు యత్నిస్తూ దుకాణాలను బలవంతంగా తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా నరసరావుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు ఆదివారం దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రామిరెడ్డిపేటలోని కేబుల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
దీంతో వారిపై కూడా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ నూరుల్ అక్తాబ్ తలకు, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఎ.హనీఫ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు చెందిన క్వాలిస్ కారు ధ్వంసమవ్వగా.. పోలీసు జీపు అద్దం పగిలిపోయింది. అయితే పోలీసులు దాడికి పాల్పడిన వారిని వదిలేసి వైఎస్సార్సీపీ వర్గీయులైన ఎన్సీవీ అధినేత నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించడం గమనార్హం.