‘టెన్త్’ ద్వితీయ భాషలో 20 మార్కులకే పాస్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ద్వితీయ భాషలో ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 20కు తెలంగాణ ప్రభుత్వం కుదించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది వరకు అమల్లో ఉన్న పాత పరీక్షల విధానంలో ద్వితీయ భాష ఉతీర్ణత మార్కులు 20 మాత్రమే ఉండగా.. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన పరీక్షల సంస్కరణల భాగంగా మార్కులను 35కు పెం చారు. హిందీ, తెలుగు తదితర భాషలను ద్వితీయ భాషగా స్వీకరించిన విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా పాత విధానం ప్రకారం ఉత్తీర్ణత మార్కులను 20కు తగ్గించాలని తాజా అసెంబ్లీ సమావేశాల్లో పలు రాజకీయ పక్షాలు చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ప్రకటన సైతం చేశారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల వ్యవధిలోనే సీఎం నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు రావడం గమనార్హం.