టెట్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
ఆదిలాబాద్: ఈ నెల 22న నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం టెట్-2016 పరీక్ష నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జిల్లాలో 15,575 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాస్తున్నారని, ఇందులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే పేపర్-1కు 5589 మంది, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్-2కు 9986 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. టెట్‌ను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలన్నారు. పరీక్ష నిర్వహణకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్య శాఖతో పాటు ఇతర శాఖలకు చెందిన వారిని కూడా టెట్ పరీక్ష నిర్వహణకు నియమించడం జరిగిందన్నారు. పరీక్ష నిర్వహణకు 53 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎనిమిది మంది రూట్ అధికార్లను, 53 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 53 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించామన్నారు. 583 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు.
జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పరీక్ష సక్రమంగా జరిగేలా అధికారులు చూడాలన్నారు. ఈనెల 22న నిర్వహించనున్న టెట్ పరీక్షకు అభ్యర్థులు ఒక రోజు ముందే తమకు కేటాయించిన పరీక్ష సెంటర్లను చూసుకోవాలన్నారు. పరీక్ష రోజు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, తమ రూంను చూసుకోవాలని, పరీక్ష సమయానికి ఒక నిమిషం ఆలస్యమైన సెంటర్లోకి అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు తమ వెంట పాస్‌పోర్టు సైజ్ ఫోటో తీసుకొని వచ్చి హాల్‌టికెట్‌పై ఇన్విజిలేటర్ సమక్షంలో అతికించాలన్నారు. పరీక్ష సెంటర్‌కు ఎలక్ట్రానిక్ వస్తువులు, క్యాలిక్యులెటర్లు తీసుకురావద్దని సూచించారు.