ఆనందం.. ఆందోళన
డీఎస్సీ-2104కు గ్రీన్సిగ్నల్పై నిరుద్యోగుల్లో భిన్నస్వరం
జీఓ విడుదల చేసిన ప్రభుత్వం
నేడు, రేపో జిల్లాకు ఖాళీల జాబితా
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-2014 నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఓ వైపు ఆనందం, మరోవైపు ఆందోళన నెలకొంది. కేటగిరీ వారీగాఎన్నెన్ని ఖాళీలు ఉంటాయనే అంశంపై సందిగ్ధత నెలకొంది. డీఎస్సీ నోటిఫికేషన్ అదిగో.. ఇదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం జీఓ 38 విడుదల చేసింది. జీవోలో విధివిధానాలకు సంబంధించిన అంశాలు తప్ప షెడ్యూలు వెల్లడించలేదు. ఏయే కేటగిరిలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే సమాచారం, డీఎస్సీ పరీక్ష నిర్వహణ షెడ్యూలు రాష్ట్ర అధికారులు ఈరోజో...రేపో జిల్లాలకు పంపనున్నారు.
అయితే ఇన్ని రోజులూ నిర్వహిస్తూ వచ్చిన డీఎస్సీని టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్ కమ్ టీఆర్టీ)గా మార్పు చేస్తూ జీఓలో పేర్కొన్నారు. దీనికితో 33 ఏళ్ల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచారు. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట కల్పించే అంశమైనా ఆశించిన పోస్టులు లేకపోవడం వారిని కలవరపెడుతోంది. కోర్సులు చేసి వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే పోస్టులు అంతంత మాత్రంగానే ఉంటుండటంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది.
బీఈడీ అభ్యర్థులకు నిరాశ
డీఎస్సీ-14 బీఈడీ అభ్యర్థులకు నిరాశ మిగల్చనుందనడంలో సందేహం లేదు. అన్ని సబ్జెక్టులకు కలిపి 57 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఎస్జీటీ 1083, పీఈటీలు 15, లాంగ్వేజ్ పండిట్లు 106 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలనే జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, పండింట్లు అన్ని కేటగిరీలకు 1251 ఖాళీలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ఈ ఖాళీలనే చూపిస్తూ నివేదించారు.
ఇక మునిసిపల్ పాఠశాలల ఖాళీలను ప్రస్తుత నోటిఫికేషన్లో చేర్చాలా...వద్దా అనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మునిసిపల్ పోస్టుల చేరిక ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఖాళీలుగా చూపించిన (1251)వాటిలో పెద్దగా మార్పులు జరగకపోవచ్చని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ఎస్జీటీ పోస్టులు కొంతమేరకు తగ్గవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.