third railway line
-
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
సాక్షి, ఢిల్లీ: ఒడిశాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు భద్రక్-విజయనగరం సెక్షన్లో నెర్గుడి - బరంగ్ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను 4962 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం కిందపైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకంగా నిలిచే అడవుల తొలగింపుకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమయ్యే అనుమతులు లభించాలి. రైల్వే లైన్ నిర్మాణం తలపెట్టే భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం జరగాలి. ప్రాజెక్ట్ సైట్లో శాంత్రి భద్రతలను పటిష్టం చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏడాది కాలంలో ఎన్ని నెలలపాటు ప్రాజెక్ట్ పనులు నిర్విరామంగా కొనసాగుతాయే వంటి పలు అంశాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రాగలమని రైల్వే మంత్రి తన జవాబులో వివరించారు. హస్త కళల అభివృద్ధి కోసం ఏపీకి 3911 కోట్లు జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3911.25 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2018-19 నుంచి 2023-24 వరకు నేషనల్ హాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డిపి), సీహెచ్డీసీ పథకాల కింద విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2439.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ కింద ఐదేళ్లలో రూ.3378.99 కోట్లు విడుదల చేయగా రూ.1907.54 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద ఐదేళ్లలో రూ.532.26 కోట్లు నిధులు మంజూరు చేసి విడుదల చేయగా మొత్తం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. హస్త కళల అభివృద్ధి కోసం ఎన్హెచ్డిపి, సీహెచ్డీసీ పథకాలను వేర్వేరు ఉద్దేశాలతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. హస్త కళాకారులు పదివేల మందికి మించి ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి గొలుసు అభివృద్ధి చేయడం సీహెచ్సీడీ పథకం ఉద్దేశమైతే, హస్త కళాకారులకు వ్యక్తిగతంగా అలాగే 1000 మందికి మించని చిన్న క్లస్టర్లకు మార్కెటింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం ఎన్‌హెచ్‌డీపీ ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ స్కీం కింద మార్కెటింగ్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు, హస్తకళాకారులకు డైరెక్ట్ బెనిఫిట్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, హస్తకళాకారులకు, క్లస్టర్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారం అందించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీహెచ్డీఎస్ కింద రాష్ట్ర స్థాయిలో ప్రాజక్టులు ఏర్పాటు చేయడం, అవి ఆయా రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేంద్ర/ రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా క్లస్టర్ ప్రాజక్టు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. -
ఏపీ, తెలంగాణలకు కేంద్రం కానుక
న్యూఢిల్లీ: వరంగల్ జిల్లా కాజీపేట నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షా స్టేషన్ వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని అంచనా వ్యయం 2,063 కోట్ల రూపాయలు కాగా, నిర్మాణం పూర్తయ్యేసరికి 2,403 కోట్ల రూపాయలు కావచ్చని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది. 201.4 కిలో మీటర్లు పొడవైన ఈ రైల్వే లైన్ ఐదేళ్లలో పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్ తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాను కవర్ చేస్తుంది. ఈ మార్గంలో పవర్ ప్లాంట్స్, బొగ్గు, సిమెంట్ రవాణా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో లైన్‌ను మంజూరు చేశారు. న్యూఢిల్లీ-చెన్నై గ్రాంట్ ట్రంక్ రూట్లో భాగంగా కాజీపేట-బల్లార్షా మూడో లైన్ ఉంటుంది. ఈ రైల్వే లైన్ ద్వారా జమ్మికుంట ఎఫ్‌సీఐ, రాఘవపురం కేసోరామ్ సిమెంట్, మంచిర్యాల థర్మల్ పవర్ స్టేషన్, ఎస్సీసీఎల్ నుంచి గూడ్సును రవాణా చేస్తారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, రెచ్నిరోడ్ నుంచి బొగ్గు రవాణా.. మానిక్గఢ్, ఘట్చందూర్ నుంచి సిమెంట్‌ను ఇదే మార్గంలో రవాణా చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-గూడురు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ అనుమతి మంజూరు చేసింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 3246 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని అంచనా. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదుల దాడి, మతకలహాలు, వామపక్ష తీవ్రవాదుల దాడి, మందుపాతర పేలుడు, సరిహద్దు వద్ద కాల్పుల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. ఈ ఘటనల్లో మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తారు. అలాగే తీవ్రంగా గాయపడినవారికి కూడా పరిహారం ఇవ్వనున్నారు.