తోటపల్లికి మహర్దశ..!
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరనున్నాయి. మొత్తం ఆయకట్టుకు సాగునీరందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్టు పరిస్థితిపై పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల మంత్రులు, ఎంపీలతో చర్చించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ సాగునీరందేలా పిల్ల కాలువలు, లైనింగ్, భూసేకరణ, ఆర్ఆర్ ప్యాకేజీలకు రూ.400 కోట్లు అవసరంగా గుర్తించారు. ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు. నిధుల సమీకరణ ఏఏ విభాగాల నుంచి సేకరించాలన్న అంశంపై మరోమారు సమావేశం కానున్నట్టు మంత్రి బొత్స ప్రకటించడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు పూర్తయితే బీడు భూముల్లో బంగారు పంటలు పండుతాయని ఆశపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
తోటపల్లి ప్రాజెక్టు జిల్లాలోనే ఏకైక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దాదాపు 1.29 లక్షల ఎకరాలకు సాగునీరందాలి. ప్రస్తుతం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 85 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుకు చివరి విడతలో పనులు చేసి తాము ప్రారంభించినట్టు చెప్పుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మితడి పనులతో మమ అనిపించింది. పార్వతీపురం నుంచి బొబ్బి లి, తెర్లాం, బాడంగి మీదుగా చీపురుపల్లి నియోజకవర్గానికి కాలువ వెళ్తున్నా రైతాం గానికి సాగునీరందడం లేదు. పిల్ల కాలువలు లేకపోవడమే దీనికి కారణం. కళ్లముందే సాగునీరు వెళ్తున్నా మోటార్లు పెట్టే అవకా శం కూడా లేదు. ఎందుకంటే ఆ హక్కు లేద నీ, ఎవరయినా మోటార్లు పెడితే స్వాధీనం చేసుకుంటామని గతేడాది రైతులను అధికారులు హెచ్చరించడంతో ఇప్పుడు రైతులు కాలువ వంకే చూడడం మానేశారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం
తోటపల్లి ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభించేందుకు చేసిన గత ప్రభుత్వ తీరు వల్ల భూ సేకరణ కూడా పూర్తిగా చేయలేదు. దీం తో బొబ్బిలి, బాడంగి, తెర్లాం ప్రాంతాల్లో చాలాచోట్ల పిల్ల కాలువలు లేవు. దాదాపు 24 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. మరోవైపు చీపురుపల్లి ప్రాంతంలో కాలువలున్నా చివరి ఆయకట్టు భూములైనందున సాగునీరు అందడం లేదు. కాలువ పరిధిలో లైనింగ్ లేకపోవడం, కాలువల్లో తుప్పలు పెరగడంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.
483 ఎకరాల భూ సేకరణకు చర్యలు
తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా 483 ఎకరాల భూమిని సేకరించాలి. ఇది కేవలం పిల్ల కాలువలకు మాత్రమే. పిల్ల కాలువ ల కోసం 13వ భూసేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని రెవెన్యూ అధికారుల తరఫున ఆదేశాలుండగా ఇరిగేషన్ అధికారుల నుంచి దీనికి సంబంధించిన నివేదిక మాత్రం నేటికీ ఇవ్వడం లేదని అంటున్నారు. దీనిపై ఇప్పుడు సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, ఇరిగేషన్ అధికారుల మ ధ్య ఇటీవల జరిగిన సమావేశాల్లో చర్చించా రు. భూ సేకరణతో పాటు కాలువల లైనింగ్, పిల్ల కాలువల నిర్మాణం, ఆర్ఆర్ ప్యాకేజీలకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి బొత్స ఇటీవల బహిరంగ సభలో తెలిపారు.
ఇందులో భాగంగా పర్యావరణ, కాలుష్య నియంత్రణమండలి అధికారుల నుంచి అను మతులు తీసుకునే పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సన్నాహాలు ఆరంభించారు.