ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
భారత్, జర్మనీ ప్రతిన
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలపై ఒత్తిడి తేవాలి
అలాంటి దేశాలను ఒంటరి చేయాలి
బెర్లిన్‌లో మోదీ వ్యాఖ్యలు
మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు
బెర్లిన్: పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల వైఖరిని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అణ్వాయుధ వ్యాప్తి ఎంత ప్రమాదకరమో.. ఉగ్రవాదమూ అంతే ప్రమాదకరమన్నారు. అణ్వాయుధ వ్యాప్తిపై మాదిరే ఉగ్రవాదంపైనా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితిలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం(కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టైజం-సీసీఐటీ)’పై ఒక నిర్ణయానికి రావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాల పరస్పర సహకారాన్ని మరింత దృఢతరం చేయడమే చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీసీఐటీ ప్రధాన లక్ష్యం. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో ఉగ్రవాదం తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చల అనంతరం.. ఇరువురు నేతలు మంగళవారం బెర్లిన్‌లో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
శాశ్వత సభ్యత్వంతోనే భారత్‌కు న్యాయం
ప్రపంచ శాంతికి ఎంతో కృషి చేసిన భారత్‌కు ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించడంలో జరిగిన జాప్యాన్ని మోదీ ప్రశ్నించారు. ఐరాస ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘బుద్ధుడు, మహాత్మాగాంధీ జన్మించిన నేల.. శాంతి తమ డీఎన్ఏలోనే ఉన్న దేశం.. శాశ్వత సభ్యత్వంకోసం 70 ఏళ్లుగా ఎందుకు ఎదురుచూడాల్సి వస్తోంది? మండలిలో శాశ్వత సభ్యత్వమిచ్చి భారత్‌కు న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. ‘మొదటి ప్రపంచ యుద్ధంపై ఎలాంటి ఆసక్తి లేకుండానే.. ఆ యుద్ధంలో 14 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు.. 75 వేల మంది అమరులయ్యారు’ అని గుర్తుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత శాంతి పరిరక్షక దళం అందించిన సేవలు అనేక దేశాల ప్రశంసలందుకున్నాయన్నారు. భారత్, జర్మనీలు భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలు కావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.
‘ఉగ్ర’ దేశాలను కట్టడిచేయాలి
‘ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం. మానవత్వంపై నమ్మకమున్న ప్రతీ ఒక్కరు ముక్తకంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి. ఆ మహమ్మారిపై పోరులో సహకరించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదులకు ఆయుధాలు అందిస్తున్నవారిని కట్టడి చేయడమెలాగో.. ఉగ్రవాదులకు ప్రభుత్వాలే ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై ఒత్తిడి తేవడమెలాగో అందరం కలిసి ఆలోచించాల్సి ఉంది. అలాంటి దేశాలను ఒంటరి చేయాల్సిన అవసరముంది’ అని అన్నారు. ఇటీవల ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని పాకిస్తాన్ కోర్టు విడుదల చేసిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అనంతరం ఎంజెలా మెర్కెల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, జర్మనీలు అంగీకరించాయన్నారు.
మెర్కెల్‌కు మోదీ గిఫ్ట్
భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత సర్ సీవీ రామన్‌కు చెందిన రాతప్రతులు, ఇతర పత్రాలను మళ్లీ రూపొందించి జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు మోదీ బహుమతిగా ఇచ్చారు. అనంతరం ‘రామన్ ఎఫెక్ట్, రామన్ స్పెక్ట్రమ్ పదాలను సృష్టించింది జర్మన్ శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ ప్రింగ్శీమ్. నోబెల్ పురస్కారానికి రామన్‌ను నామినేట్ చేసింది జర్మన్ శాస్త్రవేత్తలే. జర్మనీతో సర్ రామన్‌కు అంత అనుబంధం ఉంది. జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ కూడా క్వాంటమ్ కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు’ అని మోదీ ట్వీట్ చేశారు.
మోదీ విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటనకు మోదీని తీసుకువెళ్లిన ‘ఎయిర్ ఇండియా వన్’ బోయింగ్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి బయల్దేరి పారిస్, తౌలౌజ్, హనోవర్లలో ఆగి.. అనంతరం బెర్లిన్‌కు మోదీ ఈ విమానంలోనే వెళ్లారు. అనంతరం అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబై నుంచి మరో ఎయిర్ ఇండియా వన్’ మంగళవారం తెల్లవారు జామున బెర్లిన్ బయల్దేరి వెళ్లింది. కాగా, బుధవారం నుంచి మూడ్రోజులపాటు మోదీ కెనడాలో పర్యటించనున్నారు.
ప్రధానితో నేతాజీ మనవడి భేటీ
నేతాజీ కుటుంబంపై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టిందన్న వివాదం నేపథ్యంలో ఆయన సోదరి మనవడు సూర్యకుమార్ బోస్ సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సూర్యకుమార్ మోదీతో భేటీ అయ్యారు. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టాలని, నిజాలు వెలుగుచూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. దీనికి ప్రధాని కూడా సానుకూలంగా స్పందించినట్లు సూర్య తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని, ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరముందని మోదీ వ్యాఖ్యానించినట్లు చెప్పారు. మోదీ గౌరవార్థం జర్మనీలోని భారత రాయబారి విజయ్ గోఖలే ఇచ్చిన విందులో ఇండో-జర్మన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సూర్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. కాగా, దీనిపై ప్రధాని కార్యాలయం స్పందిస్తూ.. విదేశాలతో సంబంధాలను దృష్టిలో ఉంచుకొని నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టడానికి వీల్లేదని పేర్కొంది.
ప్రకృతి రక్షణలో మాకే పాఠాలా!?: మోదీ
గ్లోబల్ వార్మింగ్‌పై భారత్‌ను తప్పుబడుతున్న అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధానమంత్రి మోదీ విరుచుకుపడ్డారు. తలసరి కాలుష్య ఉద్గారాల స్థాయి ప్రపంచంలోనే అత్యంత కనిష్టంగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ వార్మింగ్ విషయంలో భారత్‌ను వేలెత్తి చూపడాన్ని తప్పుపట్టారు. సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న అంతర్జాతీయ వాతావరణ మార్పు సదస్సు ఎజెండాను భారతే రూపొందిస్తుందని స్పష్టం చేశారు.
జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ భారత సంప్రదాయంలోనే ఉందని పునరుద్ఘాటించారు. ‘పర్యావరణాన్ని నాశనం చేసినవారే.. మనల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ప్రకృతిని నాశనం చేసింది మీరేనని వారికి స్పష్టం చేద్దాం. ప్రకృతికి సేవ చేసినవారెవరైనా ఉన్నారంటే వారు భారతీయులే అని చెబుదాం’ అని తేల్చి చెప్పారు. భారతీయులు నదులను నదీమ తల్లులుగా భావిస్తారని, వృక్షాలను పూజిస్తారన్నారు.