పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల వైఖరిని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అణ్వాయుధ వ్యాప్తి ఎంత ప్రమాదకరమో.. ఉగ్రవాదమూ అంతే ప్రమాదకరమన్నారు. అణ్వాయుధ వ్యాప్తిపై మాదిరే ఉగ్రవాదంపైనా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితిలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం(కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టైజం-సీసీఐటీ)’పై ఒక నిర్ణయానికి రావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాల పరస్పర సహకారాన్ని మరింత దృఢతరం చేయడమే చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీసీఐటీ ప్రధాన లక్ష్యం. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో ఉగ్రవాదం తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చల అనంతరం.. ఇరువురు నేతలు మంగళవారం బెర్లిన్‌లో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.