‘మరో పోరాటానికి వైఎస్ జగన్ సిద్ధం’
సాక్షి, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా సంజీవనిగా భావిస్తున్న ‘ప్రత్యేక హోదా’ కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. హోదా సాధించేంతవరకూ వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శుక్రవారం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 80 శాతం తొలి ఏడాదే నెరవేర్చబోతున్నామని తెలిపారు.
కాపులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కాపులను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వారిని ఎన్నో అవమానాలకు గురిచేశారని గుర్తుచేశారు. కాపు రిజర్వేషన్ల సాధన ఉద్యమ సందర్భంగా తుని రైలు దహనం ఘటనలో టీడీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని దాడిశెట్టి రాజా ప్రకటించారు.
తుని రైలు దహనంలో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో అవసరానికి మించి అప్పులు చేసినట్లు యనమల అంగీకరించారని, ఓటమి అనంతరం తమపై నిందలు వేయడం సరికాదని హితవుపలికారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని వైఎస్ జగన్ ముందే చెప్పినట్లు గుర్తుచేశారు. అయినప్పటికీ వారంతా తమ పార్టీకే ఓటు వేశారని అభిప్రాయపడ్డారు.