Tianjin
-
ఐస్‌క్రీమ్ బాక్సుల్లో కరోనా
బీజింగ్: కరోనా వైరస్ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరికి వ్యాపించింది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ ఘటన చైనా ఈశాన్య ప్రాంతంలోని టియాన్జియాన్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానిక టియాన్జిన్ డకియావోడావో ఫుడ్ కంపెనీలో తయారైన ఐస్‌క్రీం శాంపిళ్లను పరీక్షించగా కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో బట్వాడా కాని 2,089 ఐస్‌క్రీం బాక్సులను కంపెనీ స్టోర్ రూంలోనే సీల్ వేసి ఉంచారు. మిగతా, 1,812 ఐస్‌క్రీం బాక్సులు వివిధ ప్రావిన్సులకు, 935 బాక్సులు స్థానిక మార్కెట్‌కు పంపిణీ కాగా అందులో 65 మాత్రం అమ్ముడు పోయినట్లు తేలింది. సరఫరా అయిన ప్రాంతాల్లో విచారణ చేపట్టి, వాటి ద్వారా ఎవరికైనా వైరస్ సోకిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ఆ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలోని 1,662 మంది ఉద్యోగులను సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఆ కంపెనీ ఐస్‌క్రీం తయారీలో వాడిన పాలపదార్థాలు ఉక్రెయిన్, న్యూజిల్యాండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు..అవి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాక్సుల్లో వైరస్ ఘటనపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని యూకేలోని లీడ్స్ యూనివర్సిటీ వైరాలజిస్టు గ్రిఫ్ఫిన్ అన్నారు. -
అచ్చు మనిషి లాగే.. వైరల్ వీడియో
బీజింగ్: ఓ విచిత్ర వానరం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనుషులను పోలినట్లుగా వానరం తల ఉండటంతో జూలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కామెంట్లు చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐదు రోజుల్లోనే కోటి మందికి పైగా వ్యూస్ రావడం గమనార్హం. చైనాలోని టియాంజిన్ నగరంలోని జూలో ఈ కోతి ఉంది. 18 ఏళ్ల ఈ వానరం స్పెషాలిటీ ఏంటంటే.. మనుషుల తల మాదిరిగా దీని తల ఉండటమే. ముక్కు, కళ్లు, నోరు అలాగే ఉండటంతో నెటిజన్లు ఈ వీడియోపై భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. కొందరమైతే మనిషికి కోతి వేషం వేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం జూ పర్యవేక్షకుడు కోతిలా వేషం వేయలేదు కదా అంటూ కామెంట్ చేశారు. మనిషి కోతి నుంచే వచ్చాడంటూ ఎక్కువ మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. -
విచిత్ర వానరం...అచ్చు మనిషి లాగే!
-
ష్! ఇది లైబ్రరీ!
లైబ్రరీలో ఎవరైనా పుస్తకంలా ఉండాల్సిందే. అంటే... సైలెన్స్‌గా ఉండాల్సిందే. కానీ చైనాలోని ఈ అధునాతన గ్రంథాలయ భవంతిలోకి అడుగుపెడితే మాత్రం ఎవరూ సైలెంటుగా ఉండలేరు! వెళ్లీవెళ్లగానే ‘వావ్’ అని ఆశ్చర్యపోతారు. తర్వాత ‘అమేజింగ్’ అనేస్తారు. పుస్తకం ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది అంటారు. ఈ మాట నెదర్లాండ్స్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ ఎంవీఆర్డీవీకి బాగా తెలుసు అనిపిస్తోంది ఫొటోలో ఉన్న బిల్డింగ్‌ను చూస్తే. చైనాలోని తియాన్జిన్లో ఉన్న ఈ భవనం ఓ లైబ్రరీ కావడం ఒక విశేషమైతే... దూరం నుంచి చూస్తే ఇది ఓ కంటిని తలపించడం మరో వినూత్నమైన విషయం. భవనం మధ్యభాగంలో కనుగుడ్డును పోలిన ఓ గోళాకారపు నిర్మాణం ఉంటుంది. పూర్తిగా అద్దాలతో కట్టిన ఈ గోళాకారం చుట్టూ పిల్లలు, వయసు మళ్లినవారు కూర్చొని చదువుకోడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అద్దాల గోళం లోపలిభాగంలో ఓ ఆడిటోరియం ఉంటుంది. 34,200 చదరపు మీటర్ల వైశాల్యమున్న ఈ గ్రంథాలయంలో మొత్తం ఐదంతస్తులు ఉన్నాయి. సెల్లార్ ప్రాంతంలో పుస్తకాలు భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో చిన్నపిల్లలు, వయసుమళ్లిన వారి కోసం ఏర్పాట్లుంటే... ఒకటి, రెండవ అంతస్తుల్లో రీడింగ్ రూమ్స్, విశ్రాంతి గదులు ఉన్నాయి. పై అంతస్తులు రెండింట్లో కంప్యూటర్, ఆడియో గదులు, కార్యాలయాలు, మీటింగ్ రూమ్స్ ఉన్నాయి. 1,20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జర్మన్ సంస్థ జీఎంపీ నిర్మిస్తున్న కల్చరల్ సెంటర్లో ఒక భాగం ఈ లైబ్రరీ. బిన్హాయి ప్రాంతం ప్రజలకు ఒక మీటింగ్ పాయింట్‌గా రూపొందుతున్న ఈ కల్చరల్ సెంటర్లో మరో మూడు భవంతులుంటాయి. నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా. -
ఘోర రోడ్డు ప్రమాదం..26 మంది దుర్మరణం
బీజింగ్: ఉత్తర చైనాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. టియాంజిన్ పట్టణానికి దగ్గరలోని హైవే మీద వేగంగా వెళుతున్న వాహనం అదుపుతప్పి ఎక్స్ ప్రెస్ వే రైలింగ్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్ ప్రెస్ వేకు కిందవున్న కాలువలో నుంచి శవాలను వెలికితీస్తున్నారు. ఉత్తర హోబెయ్ ప్రావిన్సు నుంచి ఈశాన్యాన ఉన్న షెన్యాంగ్ నగరానికి 30మందితో బస్సు బయలుదేరింది. రోడ్డుకు ఓ వైపు అంచున్న నడుస్తున్న వాహనం టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో బస్సు అదుపు తప్పి ఎక్స్ ప్రెస్ వే రైలింగ్ ను ఢీకొని కాలువలో పడినట్లు గాయాలపాలైన నలుగురు ప్రయాణీకులు తెలిపారు. కాగా, యాక్సిడెంట్లలో ప్రతి ఏటా 2,50,000 మంది చైనీయులు మరణిస్తున్నారు. సుదూర ప్రయాణాలను తక్కువ ధరలకే అందిస్తూ అక్కడి రవాణా సంస్థలు పోటీపడుతుంటాయి. -
'నేను తిరిగి రాకుంటే మా డాడీ మీడాడీ అనుకో'
తియాంజిన్: భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న మంటలు ఆ అగ్నిమాపక సిబ్బందిని భస్మం చేశాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ముప్పై మందికి పైగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇది చైనాలో చోటుచేసుకున్న ఘటన. తియాంజిన్ పట్టణంలో రసాయన పదార్థాల పేలుళ్లు సంభవించి భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. ఒక పెద్ద హైడ్రోజన్ బాంబు వేశారా ఆ ప్రాంతంలో అన్నంత పెద్దగా మంటలు వ్యాపించాయి. దీంతో వాటిని నిలువరించేందుకు చైనా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. కానీ వారిలో కొందరు దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వారు చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారం 21 మంది సిబ్బంది అగ్నికీలలకు ఆహుతి అయ్యారని చెప్తున్నా 36 మంది కనిపించడం లేదని వారంతా అందులోనే చిక్కుకుపోయారని మరికొందరు చెప్తున్నారు. ఇంతపెద్దమొత్తంలో అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం చైనాలో 1949 తర్వాత ఇదే తొలిసారి. మంటల్లో చిక్కుకున్న కొందరు అగ్నిమాపక సిబ్బందిలో కొందరు 'నేను ప్రాణాలతో తిరిగి రాకుంటే మా డాడీ ఇక మీ డాడీ అనుకో.. నాకుటుంబం నీ కుటుంబం అనుకో.. నా స్నేహం మరో జన్మకు కూడా నీతోనే ఉండాలని కోరుకుంటున్నా' అంటూ వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మెస్సేజ్‌లు పంపిచారు. -
చేపలతో విందు.. పసందు..
చూస్తేనే తెలియడం లేదా.. విశేషమేంటో.. చేపలతో కలిసి డిన్నర్.. చైనాలోని టియాన్జిన్లో ఉన్న పోలార్ ఓషియన్ వరల్డ్‌కు వెళ్తే.. మనమూ ఈ వినూత్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఓషియన్ వరల్డ్‌లో నీటి అడుగున ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఓషియన్ వరల్డ్‌లో అన్ని రకాల చేపలతోపాటు తాబేళ్లు, మంచు ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. చేపలను చూస్తూ.. ప్లేట్లోని చేపలను లాగించేయొచ్చన్నమాట.