ష్! ఇది లైబ్రరీ!
లైబ్రరీలో ఎవరైనా పుస్తకంలా ఉండాల్సిందే. అంటే... సైలెన్స్‌గా ఉండాల్సిందే. కానీ చైనాలోని ఈ అధునాతన గ్రంథాలయ భవంతిలోకి అడుగుపెడితే మాత్రం ఎవరూ సైలెంటుగా ఉండలేరు! వెళ్లీవెళ్లగానే ‘వావ్’ అని ఆశ్చర్యపోతారు. తర్వాత ‘అమేజింగ్’ అనేస్తారు.
పుస్తకం ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది అంటారు. ఈ మాట నెదర్లాండ్స్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ ఎంవీఆర్‌డీవీకి బాగా తెలుసు అనిపిస్తోంది ఫొటోలో ఉన్న బిల్డింగ్‌ను చూస్తే. చైనాలోని తియాన్‌జిన్‌లో ఉన్న ఈ భవనం ఓ లైబ్రరీ కావడం ఒక విశేషమైతే... దూరం నుంచి చూస్తే ఇది ఓ కంటిని తలపించడం మరో వినూత్నమైన విషయం. భవనం మధ్యభాగంలో కనుగుడ్డును పోలిన ఓ గోళాకారపు నిర్మాణం ఉంటుంది. పూర్తిగా అద్దాలతో కట్టిన ఈ గోళాకారం చుట్టూ పిల్లలు, వయసు మళ్లినవారు కూర్చొని చదువుకోడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అద్దాల గోళం లోపలిభాగంలో ఓ ఆడిటోరియం ఉంటుంది.
34,200 చదరపు మీటర్ల వైశాల్యమున్న ఈ గ్రంథాలయంలో మొత్తం ఐదంతస్తులు ఉన్నాయి. సెల్లార్ ప్రాంతంలో పుస్తకాలు భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక గ్రౌండ్ ఫ్లోర్‌లో చిన్నపిల్లలు, వయసుమళ్లిన వారి కోసం ఏర్పాట్లుంటే... ఒకటి, రెండవ అంతస్తుల్లో రీడింగ్ రూమ్స్, విశ్రాంతి గదులు ఉన్నాయి. పై అంతస్తులు రెండింట్లో కంప్యూటర్, ఆడియో గదులు, కార్యాలయాలు, మీటింగ్ రూమ్స్ ఉన్నాయి. 1,20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జర్మన్ సంస్థ జీఎంపీ నిర్మిస్తున్న కల్చరల్ సెంటర్‌లో ఒక భాగం ఈ లైబ్రరీ. బిన్‌హాయి ప్రాంతం ప్రజలకు ఒక మీటింగ్ పాయింట్‌గా రూపొందుతున్న ఈ కల్చరల్ సెంటర్‌లో మరో మూడు భవంతులుంటాయి. నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా.