గురుదాస్ పూర్ లో ఉగ్ర కలకలం
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్ర కలకలం రేగింది. బుధవారం సాయంత్రం ఇద్దరు అనుమానిత వ్యక్తులు మిలటరీ దుస్తుల్లో కనిపించారన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆర్మీ పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. టిబ్రీ మిలటరీ స్టేషన్ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు నుంచి గురుదాస్ పూర్ లోకి ఉగ్రవాదులు ఎవరైనా చొరబడ్డారా అనేది తెలుసుకునేందుకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలు, సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపారు.
పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో గత నాలుగు రోజులుగా సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ బలగాలు అణువణువు శోధిస్తున్నాయి. సొరంగ మార్గం గుండా ఉగ్రవాదులు చొరబడేందుకు ఏమైనా అవకాశముందా అనే కోణంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈనెల 2న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి చొరబడిన ఆరుగురు ఉగ్రవాదులను మూడు రోజుల తర్వాత భద్రతా బలగాలు హతమార్చాయి. మరోవైపు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, విడిచి పెట్టిన గురుదాస్ పూర్ ఎస్పీ సాల్విందర్ సింగ్ ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు.