Tiger skin
-
పులి చర్మం అమ్మేందుకు వచ్చి..
ములుగు: ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలో అమ్మేందుకు తీసుకొస్తున్న పులి చర్మాన్ని ములుగు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్ నుంచి కొందరు వ్యక్తులు పులి చర్మంతో రాష్ట్రానికి వస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అటవీ సిబ్బందితో కలసి జగన్నాథపురం వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న సంచిని విప్పి చూడగా అందులో పులి చర్మం కనిపించింది. దీంతో వారు దూలాపురం ఎఫ్ఆర్వోకు సమాచారం అందించగా..పరిశీలించిన ఆయన దాన్ని పులి చర్మంగా నిర్ధారించారు. వెంకటాపురం(కె) మండలం కొండాపురం గ్రామానికి చెందిన పూనెం విగ్నేష్, సోది చంటి, సోయం రమేశ్, ఏటూర్‌నాగారం మండలం గోగుపల్లికి చెందిన చీరా శ్రీను, టేకులపల్లికి చెందిన చింతల బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. పులి చర్మం, 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఆసిఫాబాద్‌లో పులి చర్మం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా పులి చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కొట్నాక దేవరావు, గొడుగు అవినాశ్ అనే వ్యక్తులు ఈ చర్మాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడగామ్ గ్రామం నుంచి తీసుకొచ్చినట్టు ఆదివారం రాత్రి అటవీశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిద్దరిని విచారించిన అనంతరం ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ నేతృత్వంలో ఉట్నూరు, ఆసిఫాబాద్ ఎఫ్‌డీవోలు, కాగజ్‌నగర్ అటవీ సిబ్బంది వడగామ్ గ్రామానికి చెందిన మేస్రం మంకు, మేస్రం దీపక్, మేస్రం చంద్రకాంత్, మేస్రం ఈశ్వర్, మేస్రం లక్ష్మణ్‌లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు అటవీ శాఖ తెలిపింది. గత ఏడాది ఇంద్రవెల్లి మండలం వాలుగొండ గ్రామంలో పెందూరు దేవరావు అనే వ్యక్తి పొలంలో అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చులకు చిక్కి పులి మరణించినట్టు తెలుస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. అదే గ్రామంలోని పెందూరు ముకంద్‌రావు ఇంట్లో సోదా చేయగా పులి కింది దవడ, ఇతర ఎముకలు దొరికినట్లు తెలిపింది. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ అనంతరం, సిర్పూర్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపింది. కాగా, పవిత్ర దండారీ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అటవీ శాఖ అధికారులు సోదాల పేరుతో తమ ఇళ్లలోకి బూటుకాళ్లతో ప్రవేశించి సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించారంటూ ఇంద్రవెల్లిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీలు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. -
ములుగు జిల్లాలో పులి చర్మం స్వాధీనం
ఏటూరునాగారం/ములుగు: పోలీసులు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి పెద్దపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పులి చర్మం అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పులి చర్మంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. వాజేడు మండల కేంద్రానికి చెందిన తిరుమలేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చండూరు గ్రామానికి చెందిన సత్యం అని తేలింది. ఇన్చార్జి ఎఫ్డీఓ శ్రీగోపాల్‌రావు, ఇతర అధికారులు పులి చర్మాన్ని పరీక్షించి.. నిజమైనదేనని నిర్ధారించారు. కాగా, పులి చర్మాన్ని వరంగల్‌లోని ఓ మహిళా కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి వారు ముల్లకట్ట బ్రిడ్జి వద్దకు వచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
టార్గెట్ చిరుత
సాక్షి, సిటీబ్యూరో: వివిధ రాష్ట్రాల అడవుల్లోని చిరుతలు, పులులే లక్ష్యంగా వేట సాగించి వాటి చర్మం, గోళ్లను బ్లాక్ మార్కెట్లో రూ.లక్షలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి చిరుత చర్మం, నాలుగు గోళ్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, డీఎఫ్ఓ శివయ్యలతో కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చిరుతలు, పులులు ఎక్కువగా సంచరించే సిర్పూర్ కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం, మహారాష్ట్ర తడోబా అటవీ ప్రాంతం, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, వైజాగ్ అటవీ ప్రాంతాల్లో 8–10 మంది సభ్యుల ముఠా వేట కొనసాగించేది. చిరుత, పులి చర్మం, గోళ్లు బ్లాక్ మార్కెట్లో రూ.లక్షల్లో ధర పలుకుతుండడంతో ప్రొఫెషనల్ వేటగాళ్లు అయిన ఒడిశాకు చెందిన వీరు గత కొన్ని నెలలుగా వాటిపై దృష్టి కేంద్రీకరించారు. ఆయా జంతువుల కదలికలపై వీరికి ఎక్కువగా అవగాహన ఉండడంతో... ఆయా ప్రాంతాల్లో తీగల ఉచ్చులు ఏర్పాటు చేసి వలపన్ని పట్టుకునేవారు. ఈ విధంగానే మూడు నెలల క్రితం ఓ మగ చిరుతను చంపి చర్మాన్ని జాగ్రత్తగా తొలగించి ఎండబెట్టారు. రెండేళ్ల వయసున్న ఈ చిరుత చర్మాన్ని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తామని తమ పరిచయస్తులకు ఒడిశాకు చెందిన బసుదేవ్ మస్తీ, జగన్నాథ్ సిసా, బలి పంగి చెప్పారు. అయితే వీరికి సహకరిస్తున్న విశాఖపట్టణానికి చెందిన నాగోతి భాను హైదరాబాద్‌లో విక్రయిద్దామని సూచించాడు. ఎల్బీనగర్లోని మయూరి హోటల్లో సోమవారం కస్టమర్ కోసం వేచి చూస్తుండగా... సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, సివిల్ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. చిరుత చర్మం, గోళ్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. అవసరాన్ని బట్టి... కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా వీరు చిరుత, పులులను చాకచాక్యంగా వేటాడేవారు. తీగల ఉచ్చులో పడేలా చూసి చంపేవారు. ఆ తర్వాత జాగ్రత్తగా చర్మాన్ని తొలగించడంతో పాటు గోళ్లను తీసేసి కస్టమర్లకు విక్రయించేవారు. చిరుత చర్మాన్ని కొన్నిసార్లు రూ.5లక్షలకు, మరీ డిమాండ్ ఉంటే రూ.10 లక్షలకు అమ్మేవారు. పులి చర్మాన్ని మాత్రం రూ.25లక్షలకు విక్రయించే వారని సీపీ మహేశ్ భగవత్ వివరించారు. -
కాసుల వర్షం కురుస్తుందని..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పులి చర్మం మీద డబ్బులు పెట్టి పూజలు చేస్తే మనీ బారిష్ (డబ్బుల వర్షం) తో లక్షాధికారులు అవుతామని భావించారు. సహాయపడతారని భావించిన వ్యక్తులే మోసం చేస్తారని ఊహించలేదు. ఉన్నదంతా పోగొట్టుకొని ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నా రు. ఇక అటవీశాఖ అధికారుల ఓవర్ యాక్షన్‌తో రూ.6 లక్షలతో అసలు నిందితులు పరారయ్యారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒకరిద్దరు నిందితులు పోలీ సుల అదుపులో ఉన్నప్పటికీ, అటవీశాఖను, నింది తులను ‘బకరా’లను చేసిన చంద్రపూర్ గ్యాంగ్ నందు, థామస్, ఆసిఫాబాద్ పాండు పత్తా లేకుండా పోయారు. ‘సాక్షి’ వరుస కథనాలతో పోలీస్ శాఖ కూడా పులిచర్మం కేసును ఛేదించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రామగుండం సీపీ సత్యనారాయణ తాజాగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) అశోక్‌కుమార్ పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ శ్రీనివాస్‌ను విచారణాధికారిగా నియమించారు. పులి చనిపోయాక చర్మంపై ఆశ జనవరి మొదటి వారంలో కరెంటు తీగల ఉచ్చులో పెద్దపులి పడటంతో బుచ్చిరాజం, మల్లయ్య ముం దుగా భయపడినా, పులి చర్మం అమ్మితే లక్షలు వస్తాయని భావించి చర్మాన్ని, గోర్లను వేరు చేశారు. దాన్ని ఎలా విక్రయించాలనే విషయంలో సాయిలు సహకారం తీసుకున్నారు. సాయిలు నాగారానికి చెందిన బెజపల్లి కొమురయ్యకు చెప్పగా, అతను గోదావరి ఖనిలోని పూర్ణ చెవిన వేశాడు. పులి చర్మాన్ని అమ్మాలంటే ఆసిఫాబాద్‌కు చెందిన పాండుతోనే సాధ్యమవుతుందని చెప్పిన పూర్ణ అతన్ని లైన్లోకి తెచ్చాడు. పాండుకు చంద్రాపూర్ గ్యాంగ్ లీడర్ నందుకు చేరవేశాడు. నందు తన సహచరుడు థామస్‌తో చర్చించి పాండును తమవైపు తిప్పుకున్నారు. ‘పైసా బారిష్’ ప్లాన్‌కు మెరుగులు దిద్దారు. ఇంటి ఓనర్ అంజయ్య ను లక్ష్యంగా చేసుకొని పావులు కదిపారు. పైసా బారిష్ కోసం రూ.6 లక్షలు సమర్పణ తొలుత పులి చర్మాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన నందు గ్యాంగ్ చర్మాన్ని మందమర్రిలోని అంజయ్య ఇంటికి తెప్పించారు. బంగారు బాతు కథ తరహాలో పులి చర్మం దగ్గరుంటే కోట్లు సంపాదించవచ్చని నందు, థామస్, పాండులు అంజయ్యకు చెప్పారు. పులి చర్మంపై ఎంత డబ్బులు పెట్టి పూజలు చేస్తే అంతకు రెట్టింపు అవుతాయని చెప్పారు. దీంతో కొమురయ్య, నర్సయ్య, సాయిలు తదితరులను నమ్మించారు. దీంతో వారు రూ.6 లక్షలను తీసుకుని పరారయ్యారు. వెళ్తూనే నందు మంచిర్యాల ఓఎఫ్డీవో వెంకటేశ్వర్రావుకు ఫోన్‌చేసి, టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ సభ్యుడు థామస్ పులి చర్మం కొనుగోలుదారుడిగా నిందితులతో బేరమాడుతున్నారని, వెంటనే వెళ్లాలని సమాచారం ఇచ్చాడు. అధికారులు మందమర్రికి వచ్చి పులిచర్మం, ఇంటి యజమాని అంజయ్యతోపాటు డబ్బులు సమకూర్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడేస్పందించిఉంటే... మందమర్రిలో పులి చర్మం విక్రయించే ముఠా ఉన్నట్లు సమాచారం అందగానే లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అంది చ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. చర్మం దొరికిందనే కోణంలోనే అటవీ శాఖ అధికారులు వ్యవహరించారే తప్ప అది ఎక్కడి పులికి సంబంధించినదనే విషయంపై దృష్టి పెట్టలేదు. దీంతో చంద్రాపూర్ గ్యాంగ్‌కు చెందిన థామస్ అటవీశాఖ కార్యాలయం వరకు వచ్చి, మీడియా ముందు కథలు చెప్పి తప్పించుకుపోయాడు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ రంగంలోకి దిగిన తరువాతే అసలు రంగు బయట పడుతోంది. అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్ పులి చర్మం, పులి వేటపై ప్రత్యేక దృష్టి సారించారు. -
చంద్రాపూర్ గ్యాంగ్ ‘డబ్బుల్’గేమ్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చంద్రాపూర్ ముఠా డబుల్ గేమ్ బయటపడింది. మంచిర్యాల జిల్లాలోని శివ్వారంలో వేటగాళ్ల ఉచ్చుకు జనవరి 8న బలైన పెద్దపులి ఘటనను ఆసరా చేసుకొని ఈ ముఠా మోసానికి ఒడిగట్టింది. టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ పేరుతో వచ్చిన చంద్రాపూర్ గ్యాంగ్ పులిచర్మాన్ని కొనుగోలు చేయడం అటుంచి, ఆ చర్మంపై డబ్బులు పెట్టి పూజ చేస్తే రెండింతలవుతాయని నమ్మించి రూ. 6 లక్షలు కాజేసి పరారైంది. గోదావరి ఖనికి చెందిన పూర్ణ, ఆసిఫాబాద్‌కు చెందిన పాండు, టీహెచ్ఈఏ అధ్యక్షుడిగా చెప్పుకునే నందు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. పులి చర్మం విక్రయించే నిందితులను, అటవీ అధికారుల ను మోసం చేసి డబ్బులతో పారిపోవాలని నిర్ణయించుకున్నారు. శివ్వారానికి చెందిన సాయి లు, తోకల మల్లయ్య, తోకల బుచ్చిరాజంలను పులిచర్మంతో మందమర్రికి రప్పించారు. మం దమర్రికి చెందిన అంజయ్య, కొమురయ్య, నర్సయ్య, అంజయ్య కుమారుడు సాగర్లతో మాట్లాడి పూజలకు ఏర్పాటు చేయించారు. ‘పులి చర్మం అమ్ముకునే బదులు దాన్ని దగ్గరుంచుకుని స్వామీజీతో పూజలు చేస్తే డబ్బులు రెట్టింపవుతాయి’ అని వారికి ఆశ చూపారు. రూ.10 లక్షలు తెచ్చుకోమని చెప్పారు. వీరం తా అప్పులు చేసి రూ.6 లక్షలు సమకూర్చుకున్నారు. నందు అండ్ గ్యాంగ్ డబుల్ గేమ్ ఆడుతూ ‘పులి చర్మాన్ని పట్టిస్తాం’ అంటూ అటవీ అధికారులతో టచ్‌లో ఉన్నారు. 24న పూజలు.. అదేరోజు పరారీ జనవరి 24న అంజయ్య ఇంట్లో స్వామి అవతారమెత్తిన నందు, పాండు, పూర్ణ పులిచర్మంపై రూ. 6 లక్షలు ఉంచారు. కొద్దిసేపటికి డబ్బుతో ఉడాయించారు. పారిపోతూ అంజయ్య ఇంట్లో పులిచర్మం విక్రయిస్తున్నారని అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి బాధితులను అదుపులోకి తీసుకున్నారు. తాము పులిచర్మాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చినవారిగా నమ్మించి, పులిచర్మాన్ని ప్రభుత్వానికి పట్టించామని థామస్ మీడియా ముందు చెప్పడం గమనార్హం. నిందితులు విచారణలో చెప్పి న నిజాలతో అధికారులు అవాక్కయ్యారు. కాగా ‘టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్’ పేరుతో ఓ వెబ్సైట్ నడుస్తోంది. దీనిలో ఉం చిన నంబర్‌కు ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. పోలీసులు వీరి కాల్‌డేటా ఆధారంగా పట్టుకునే యత్నంలో ఉన్నారు. -
పులి చర్మాల దందాలో చంద్రాపూర్ గ్యాంగ్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రిలో పులి చర్మాన్ని విక్రయిస్తూ ముగ్గురు వ్యక్తులు అటవీశాఖకు చిక్కడంతో మొదలైన వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. వన్యప్రాణులు గుంపులుగా సంచరించే జైపూర్ మండలం శివ్వారం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ తీగలతో వాటి ఉసురు తీయడం సాధారణం. ఇదే తరహాలో శివ్వారం గ్రామానికి చెందిన దంతవేని సాయిలు (45) విద్యుత్ తీగలను అమర్చగా, ఈ నెల 7వ తేదీ రాత్రి వేళలో పెద్దపులి ఆ తీగలకు తాకి మృత్యువాత పడింది. పులిని చూసి షాక్ అయిన సాయిలు సహచరులు తోకల మల్లయ్య, తోకల బుచ్చిరాజంలతో కలసి దాని చర్మాన్ని, గోళ్లను విక్రయించి, లక్షలు సంపాదించాలని భావించారు. ఈ క్రమంలో మొదలైన ‘ఆపరేషన్ టైగర్ స్కిన్’వ్యవహారంలో మహా రాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా వచ్చి చేరింది. పులి చర్మం కొనుగోలు చేసేందుకు ముందు గా ఫోన్లో లక్షల్లో బేరం మాట్లాడిన ఈ ముఠా సభ్యులు, చివరికి బ్లాక్ మెయిల్‌కు దిగి... అది కూడా వర్కవుట్ కాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాము పులుల వేటను నిరోధించేందుకు ఏర్పాటైన ఎన్జీవో సొసైటీ సభ్యులుగా అటవీశాఖ అధికారులనే నమ్మించి పరారయ్యారు. ఈ కేసును రామగుండం కమిషనరేట్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించడంతో గూడుపుఠాణి బహిర్గతమవుతోంది. చంద్రాపూర్ ముఠాతో బేరసారాలు ఈ నెల7న రాత్రి పులి కరెంటు తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోగా, 8న అది చూసిన ముగ్గురు నిందితులు పులి చర్మం, గోళ్లు అమ్మితే లక్షలు సంపాదించవచ్చని భావించారు. మంథని మండలం నాగా రాని చెందిన బెజపల్లి కొమురయ్య (40), పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మేకల నర్సయ్య (40)కు సమాచారం అందించారు. వీరంతా శివ్వారం వచ్చి చనిపోయిన పులిని 200 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చర్మం, గోళ్లు ఒల్చి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు మంచిర్యాలలో మెడికల్ షాపులో పనిచేసే నర్సింబోజు రవీందర్ (42) ఒప్పుకున్నాడు. చర్మం విక్రయించే విషయంలో గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన పూర్ణచందర్‌ను సంప్రదించారు. పూర్ణచందర్ ద్వారా ఆసిఫాబాద్‌కు చెందిన పాండురంగ ప్రవేశం చేశాడు. ఈ క్రమంలో మందమర్రికి చెందిన ఐలవేని అంజయ్యను కూడా తమ ముఠాలో చేర్చుకున్నారు. అసలు కథ పాండు ద్వారానే... ఆపరేషన్ టైగర్ స్కిన్ వ్యవహారం తాను నడిపిస్తానని, రూ.లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన పాండు.. చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్, థామస్‌కు సమాచారం ఇచ్చాడు. నందకిషోర్ గతంలో పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరించాడు. ఈ పేరుతో దందా లు సాగిస్తున్నట్లు చంద్రాపూర్ పోలీసులు గమనించి దూరం పెట్టడంతో అటవీశాఖతో సంబంధాలు ఏర్పా టు చేసుకుని ఇన్ఫార్మర్ అవతారం ఎత్తాడు. . దీంతో ఏకంగా పులుల వేటను అంతం చేయడమే లక్ష్యమని ‘పులుల వేట అంతం’పేరుతో సొసైటీగా ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌కు రావాలని నందకిషోర్, థామస్‌లు సాయిలు గ్యాంగ్‌ను కోరగా, పోలీస్ చెకింగ్ భయంతో రాలేమని మందమర్రికి వస్తామని చెప్పారు. అయితే పులిచర్మం కొనుగోలు కోసం వస్తున్నట్లు చెప్పిన చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్, థామస్లకు బేరసారాల్లో తేడా వచ్చినట్లు సమాచారం. ఒక పథకం ప్రకారం ముందే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన చంద్రాపూర్ గ్యాంగ్ పులి చర్మం విషయంలో బేరం కుదరకపోవడంతో పట్టించారని తెలుస్తోంది. నలుగురు అరెస్టు.. పులికి విద్యుత్ తీగను అమర్చి మరణానికి కారణమైన సాయిలును 5వ నిందితుడిగా చూపించి రిమాండ్ చేశారు. అతనితో పాటు మేకల నర్సయ్య (ఏ–3), బెజపల్లి కొమురయ్య (ఏ–4), నరింబోజు రవీందర్ (ఏ–6)లను రిమాండ్ చేశారు. ఆసిఫాబాద్‌కు చెందిన పాండు, గోదావరిఖనికి చెందిన పూర్ణచందర్, శివ్వారం తోకల మల్లయ్య , తోకల బుచ్చిరాజం, మందమర్రికి చెందిన ఐలవేని అంజ య్య, కారు డ్రైవర్ పరారీలో ఉన్నారు. -
పులి హంతకులెవరు?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర అభయారణ్యాల నుంచి ఆది లాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన పులుల మరణం మిస్టరీగా మారింది. రెండేళ్లలో మూడు పెద్ద పులులు వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలకు తగిలి బలయ్యాయి. పులుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న అధికార యంత్రాంగం.. వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలను అమరుస్తుండటాన్ని అరికట్ట లేకపోవడం పలు అనుమానా లకు తావిస్తోంది. అడవి పంది, జింక, దుప్పి, మెకం, సాంబార్ వంటి వన్యప్రాణుల కోసం వేటగాళ్లు, వన్యప్రాణుల నుంచి పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు అమర్చే విద్యుత్ తీగలకు తగిలి పెద్దపులులు ప్రాణాలు కోల్పోతున్నాయని అటవీశాఖ అధికారులు ఘటనల తీవ్ర తను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వన్య ప్రాణుల పేరిట పెద్దపులుల ఉసురు తీసేం దుకు ఇతర శక్తులేవైనా ప్రయత్నిస్తున్నాయా అనే కోణంలో ఇప్పటి వరకు ఎలాంటి అడుగు పడకపోవడం గమనార్హం. ప్రమాదకరమైన కరెంటు తీగల ఉచ్చులో ఆరితేరిన వ్యక్తులు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల సూచనలకు అనుగుణంగానే ఈ వేట సాగుతుందని అర్థమవుతోంది. మంచి ర్యాల జిల్లా శివ్వారంలో అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ హతం వెనుక కూడా స్మగ్లర్ల హస్తం ఉందని పోలీసు అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు పులులు ఒకే రీతిన 2016, డిసెంబర్లో కోటపల్లి మండలం పిన్నా రంలో విద్యుత్ తీగలకు చిక్కి పులి హతమైంది. స్థానిక వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తాకి ఈ పులి చనిపోయిందని అటవీశాఖ అధికారులు దర్యాప్తులో తేల్చారు. సరిగ్గా రెండేళ్లకు గత నెలలో నిర్మల్ జిల్లా పెంబి మండలం పుల్గంఫాండ్రి వద్ద మరో పులిని హత మార్చారు. ఈ పులి చర్మాన్ని, గోళ్లను ఒలిచి, కళేబరాన్ని పూడ్చేశారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిందని భావిస్తున్న ఈ పులి చర్మాన్ని విక్రయించే ప్రయత్నంలో ఇచ్చోడ వద్ద అటవీశాఖ అధికారులకు చిక్కారు. తాజాగా తిప్పేశ్వర్ నుంచే వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన మగపులి శివ్వారంలో మృతిచెందిన సంఘటన పుల్గం ఫాండ్రి పులిని హతమార్చిన రీతిలోనే ఉండటం గమనార్హం. ఉచ్చులో పడి మృత్యువాత పడ్డ పులి చర్మాన్ని, గోళ్లను వొలిచి విక్రయించే ప్రయత్నంలో దొరి కిపోయారు. ఈ 2 ఘటనలకు మధ్య సారూప్యం ఉండటం,, నెల రోజుల వ్యవధిలోనే చోటు చేసుకోవడం వెనుక పులి చర్మాల స్మగ్లింగ్ ముఠా హస్తం ఉండొచ్చని అటవీ, పోలీస్ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానిక వేటగాళ్లతోనే స్మగ్లర్ల బేరసారాలు వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేసే వ్యక్తులతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాత్రి వేళల్లో వేటగాళ్లు సన్నని ఇనుప బైండింగ్ వైర్లను కిలోమీటర్ల పొడవునా అమర్చి త్రీఫేజ్, హై టెన్షన్ వైర్లకు అనుసంధానం చేసి వన్యప్రాణులను బలిగొం టున్నారు. ఇలా వారానికి ఒక టైనా అడవి జంతువు వేటగాళ్ల బారిన పడటం సహజం. ఇలాంటి వేటగాళ్లతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు బేరసారాలు కుదుర్చుకొని పులుల మృతికి కారణమవుతున్నారని ఆరో పణలున్నాయి. స్థానిక వేటగాళ్లకు డబ్బుల ఎరచూపి, పులులు బలైన తరువాత చర్మాలను కొనుగోలు చేయడంలో ధర గిట్టుబాటు గాక వారే సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నట్లు కూడా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. మరణ శాసనం రాస్తున్న బైండింగ్ తీగలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మండ లాల్లో ప్రతి రోజు రాత్రి జరిగే ఈ వేటలో అధికారులు పసిగట్టలేకపోతున్నారు. పులి చర్మంపై క్రేజీ ఉండటంతో అవి సంచారం చేసే చోట బైండింగ్ వైర్ ఏర్పాటు చేసి హైటెన్షన్ విద్యుత్ తీగలకు అనుసంధానిస్తున్నారు. దీనికి తగిలి ఇతర వణ్యప్రాణులతో పాటు పులులు కూడా చనిపోతున్నాయి. మనుషులకూ ప్రాణాంతకమే ఈ నెల 10న రాత్రి రెబ్బెన మండలం తక్కల్ల పెల్లికి చెందిన కోట శ్రీనివాస తన సహచరుల తో పులికుంట శివారులోని అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు అమర్చిన కరెంట్ వైరు తగలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. గతంలోనూ ఇదే గ్రామంలో ఒకరు మృతి చెందారు. చెన్నూర్ మండలం సోమన్‌పల్లి అటవీ ప్రాంతంలో పంట పొలాలను రక్షిం చేందుకు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి గతంలో ఓ రైతు కూడా మృతిచెందాడు. పులి వేటపై సీఎం సీరియస్ అటవీ అధికారులతో శనివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. అడవుల సంరక్షణ, కలప అక్రమ రవాణా నిరోధంపై జరిగిన ఈ భేటీలో ఆదిలాబాద్ అడవుల్లో పులుల మృత్యువాత అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అటవీ సంరక్షణ దళం ఏర్పాటు చేసి పులుల సంరక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, వేటగాళ్లను, స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
పులి హంతకులెవరు?
-
తిప్పేశ్వర్ పులి.. శివ్వారంలో బలి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎక్కడో తిప్పేశ్వర్ అభయారణ్యంలో పుట్టిన పులి.. ఆహారం కోసం ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన నెల రోజులకే వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైంది. ఆదిలాబాద్ అడవుల్లోకి మరో పులి వచ్చి చేరిందన్న సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైంది. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో లభించిన పులి చర్మం కవ్వాల్‌లో కనిపించిన పులిదేనని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించడం లేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు చెబుతున్నా.. పులి చర్మం తాజాగా ఉండటం, కవ్వాల్‌లో కనిపించిన పులి మాయమవడం, పులి ఫొటోలు, పులి చర్మం ఒకేరకంగా ఉండటాన్ని బట్టి కవ్వాల్‌లో కనిపించిన పులిగానే నిర్ధారించారు. నీల్వాయి ప్రాంతంలో తిరుగుతున్న కె–4 ఆడపులి సాంగత్యం కోసం గానీ, గుంపులుగా సంచరించే జింకల కోసమో ఈ పులి శివ్వారం అడవుల్లోకి వచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. అడవి పందులు, జింకల కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకొని 15 రోజుల క్రితమే ఈ పులి హతమైంది. శివ్వారానికి చెందిన తొమ్మిది మంది పులిని హతమార్చిన ఘటనలో నిందితులు కాగా సాయిలుని ఏ–1గా పోలీసులు కేసు నమోదు చేశారు. కొమురయ్య, సాయిలు కొడుకు శ్యామ్, మధునయ్య, లింగ య్యలను అరెస్టు చేసి పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. పోలీసుల చర్యతోనే.. మందమర్రిలో పులి చర్మం వెలుగుచూసిన వ్యవహారంపై రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు తక్షణమే స్పందించి ఒక్కరోజులోనే కేసు మిస్టరీని ఛేదించింది. నిందితులను విచారించగా, శివ్వారంలో పులిని హతమార్చిన ప్రాంతం వివరాలు వెల్లడించారు. ఈ మేరకు కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల రావు, డీఎఫ్ఓ రామలింగం, ఇతర అటవీ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
మందమర్రిలో పులి చర్మం పట్టివేత
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని రామన్‌కాలనీలో గురువారం అటవీశాఖ అధికారులు పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు పులి చర్మాన్ని అమ్మకానికి పెట్టారు. విషయం తెలియడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన టైగర్ హంటింగ్ అండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అటవీ అధికారులకు పట్టి చ్చేందుకు ఆపరేషన్ చేపట్టారు. వారితో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు బేరం కుదిరింది. వారి సహకారంతో మందమర్రిలో అధికారులు మాటు వేశా రు. పెద్దపల్లి జిల్లా రామారావుపేటకు చెందిన మేకల నర్సయ్య పట్టణంలో ఎవ రూ లేని ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. దీంతో పులి చర్మంతోపాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఛత్తీస్‌గఢ్ టు చంద్రాపూర్
జ్యోతినగర్(రామగుండం): మంచిర్యాల జిల్లాలో ఓ పులి వేటగాళ్ల ఉచ్చుతో విలవిలాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం పులుల చర్మాలు విక్రయిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. గోదావరిఖని ప్రాంతంలో అనుమానాస్పందంగా సంచరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం తాట్లంక గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్లపల్లి గ్రామానికి చెందిన మడకం చంద్రయ్య, కూనవరం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కోసవరం గ్రామానికి చెందిన సోడీ భీమయ్య, చింతూరు మండలం చిరుమూరుకు చెందిన సోయం రామారావు, సల్వం రాము, కొత్తగూడెం జిల్లా పాల్వంచ మం డలం పాలకాయ తండాకు చెందిన చిందం జంపయ్య, కొత్తగూడెం మేదరి బస్తీకి చెందిన కొంటు రఘుకుమార్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా వారి వద్ద ఉన్న రెండు సంచుల్లో చిరుత పులుల చర్మాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.50 లక్షలకు పులుల చర్మాలు విక్రయించేందుకు వెళ్తున్నట్లు తేలింది. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామగుండం సీపీ విక్రమ్‌జీత్ దుగ్గల్ తెలిపారు. వరుస ఘటనలపై అనుమానాలు.. రామగుండంప్రాంతంలోని ప్రజలు పులుల సంచారంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనికి తోడు చిరుత పులుల చర్మాలను విక్రయించే ముఠాను పోలీసులు పట్టుకోవడంతో పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఒకవైపు అటవీశాఖ అధికారులు ఆయుధాలతో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పులుల జాడ కోసమే ప్రత్యేక బృందాలు తిరుగుతున్న క్రమంలో పులి చర్మాలను విక్రయిం చే ముఠా గోదావరిఖని బస్‌స్టేషన్‌లో పట్టుబడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. రూ.5 లక్షల నుంచి 50 లక్షలు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు పులుల చర్మాలు అక్రమ రవాణా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన నలుగురుతో పాటు కొత్తగూడెం, చం ద్రాపూర్కు చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొం తకాలంగా పులి చర్మాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు అటవీ ప్రాంతాలకు వెళ్లి అక్కడ కొందరు వేటాడిన క్రూరమృగాల చర్మాలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో పులి చర్మానికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా ధర పలుకుతోంది. ఇదే క్రమంలో ఇటీవల గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన ఓ కార్మికుడి నుంచి కూడా ఓ పులి చర్మాన్ని పోలీసులు సేకరించారు. అక్రమ చర్మాల పయనం ఎటువైపు.. అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన చిరుత చర్మాలను వివిధ ప్రాంతాలకు తరలించే ముఠా ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారో అనే విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదని తెలుస్తోంది. ముఠా సభ్యులు విచారణ సమయం లో పోలీసులకు సహకరించకపోవడం మరింత ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. -
ఇంతకీ చర్మం పులిదా.. కుక్కదా?
లక్సెట్టిపేట(మంచిర్యాల): పులిచర్మంగా రాష్ట్రంలో హల్చల్ రేపిన పులిచర్మం కథ ఇప్పటికీ సుఖాంతం కాలేదు. కుక్క చర్మానికి రంగులు దిద్ది పులిచర్మంగా అమ్ముతున్నారని భావించిన కథ ఇంకా ముగియలేదు. ఒక వేళ అది కుక్క చర్మం అయినట్లైతే పోలీసులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుందని పలువురు అనుకుంటున్నారు. కుక్క చర్మంతో వ్యాపారం చేస్తు పోలీసులకే పంగనామాలు పెట్టినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఫొరెనిక్స్ రిపోర్టు రాలేదని వచ్చేదాకా ఎటూ తేల్చేది లేదని పోలీసులు తెలుపుతున్నారు. పులిచర్మంగా మొదట వెల్లడి మండలంలో ఈనెల 4న స్థానిక పోలీసులు కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన శ్యాంరావు అనే వ్యక్తి పులి చర్మం తరిలిస్తున్నాడని తెలిసి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఐ శ్రీనివాస్, ఎస్సై మధుసూదన్‌రావు నిందితులను అదుపులోకి తీసుకుని మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అది పులి చర్మం కాదు కుక్క చర్మం అని సోషల్ మీడియాలో పోస్టులు, సంబంధిత ఫారెస్టు అధికారులు పులిచర్మం కాదని చెప్పడంతో అనుమానంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో పులిచర్మంగా భావిస్తున చర్మాన్ని హైద్రాబాద్‌లోని ల్యాకోన్స్ ల్యాబోరేటరీకి తరలించారు. పది రోజులు గడిచినా రిపోర్టు రాకపోవడంతో పులిచర్మం కథ ఇంకా సుఖాంతం కాలేదు. కుక్కను చంపి పులి చర్మంగా తయారు చేయడానికి హెయిర్ డై వంటి రంగులు వాడి పులి చర్మంగా పెద్ద ఎత్తున్న చీకటి వ్యాపారం సాగుతున్నట్లు బహిర్గతమవుతోంది. దీనిపై పోలీసులు నిఘా పెడితే అసలు వ్యాపారం బట్టబయలవుతుందని ఎందుకు దీనిపై పోలీసులు దృష్టిపెట్టలేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుక్క అయితే మాత్రం చంపి దానికి రంగులు పూసి వ్యాపారం చేసే అధికార ం లేదని అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని పెట్ యానిమల్స్ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. నివేదిక కోసం ఎదురుచూపులు పులిచర్మంగా భావిస్తున్న చర్మాన్ని హైద్రాబాద్‌లోని ల్యాబోరేటరీకి పంపినట్లు పోలీసులు తెలుపుతున్నారు. చర్మం పులిదా కుక్కదా అని తేల్చేందుకు ఇంత సమయం పడుతుందా పది రోజులైన ఇంకా రిపోర్టు రాకపోవడం ఏంటి అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది పక్కాగా కుక్క చర్మమే అని ఫారెస్టు అధికారులు ముందే కొట్టిపారేస్తున్నారు. పోలీసులు తొందరపడి పులిచర్మంగా మీడియాకు తెలియపర్చారని దీంతో ఫారెస్ట్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్లుగా ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. కుక్కదా పులిదా పోలీసులే తేల్చి చెప్పాలని రిపోర్టు ఎలా వస్తుందని పోలీసులు ఏం చెప్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
పులి చర్మం ఎక్కడిదీ..?
లక్సెట్టిపేట(మంచిర్యాల) : జాతీయ జంతువు పులి చర్మాన్ని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దానిని తరలిస్తున్న కుమురం భీం జిల్లా తాటినగర్ గ్రామానికి చెందిన రౌతు శ్యాంరావును అరెస్టు చేశారు. పులి చర్మం ఎక్కడినుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాంరావు గతంలో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న పట్టణానికి చెందిన రఘు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు పులి చర్మం కావాలని, తెచ్చిస్తే రూ.5లక్షలు ఇస్తానని శ్యాంరావును రఘు కోరాడు. దీంతో శ్యాంరావు బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన విలాస్ అనే వ్యక్తిని సంప్రదించాడు. తనకు పులి చర్మం తెచ్చిస్తే రఘుకు అందజేస్తానని, అతడు ఇచ్చే డబ్బులను ఇద్దరం కలిసి పంచుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. విలాస్ కొద్ది రోజుల తర్వాత పులి చర్మాన్ని తీసుకువచ్చి శ్యాంరావుకు ఇచ్చాడు. శ్యాంరావుæ పులి చర్మాన్ని వాహనంలో తీసుకుని బుధవారం కొత్తగూడెం బయల్దేరాడు. ఈ క్రమంలో లక్సెట్టిపేట ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిçండగా శ్యాంరావు అనుమానాస్పదంగా కనిపిచండంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సంచిని తెరిచి చూడగా అందులో పులి చర్మం లభించిందని సీఐ తెలిపారు. శ్యాంరావును అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. రఘు, విలాస్‌లను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై మధుసూదన్‌రావు, కానిస్టేబుల్ శేఖర్ పాల్గొన్నారు. పది మంది ప్రమేయం.. ? పులి చర్మం తరలింపు సంఘటన వెనుక దాదాపు పది మంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం. మర్తిడికి చెందిన విలాస్ వన్యప్రాణులను వేటాడుతాడని తెలిసింది. అయితే ఈ పులి చర్మం అతడికి ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు కూపీ లాగుతున్నారు. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి కొంత మంది వ్యక్తులు పులి చర్మాన్ని తరలిస్తుండగా బెజ్జూర్ మండలంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పులి చర్మం బెజ్జూర్‌లోని అటవీ శాఖ క్వార్టర్లో భద్రపర్చగా.. కొద్ది నెలల క్రితం మాయమై.. మమచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో దొరికిన సంగతి విదితమే. తాజాగా పట్టుబడిన పులి చర్మం కూడా గతంలో వలె మహారాష్ట్ర నుంచి వచ్చిందా? లేక కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో సంచరిస్తున్న పులిని హతమార్చి ఉంటారా? అని∙అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన విలాస్ పట్టుబడితే గాని పులి చర్మం ఎక్కyì నుంచి వచ్చిందనేది అంతుచిక్కదు. విలాస్ కోసం పోలీసులు బుధవారం సాయంత్రం మర్తిడి గ్రామానికి వచ్చి ఆరా తీసినట్లు తెలిసింది. బెజ్జూర్ ఎస్సై లేకపోవడంతో చింతలమానెపల్లి ఎస్సై వచ్చినట్లు సమాచారం. కాగా.. మంగళవారం రాత్రి కొంత మంది వ్యక్తులు మండలంలోని సల్గుపల్లి అంగడి ప్రాంతంలో పులి చర్మం కోసం బేరసారాలు సాగించినట్లు తెలిసింది. ఇందులో మర్తిడికి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులతో పాటు మొత్తం పది మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పులి చర్మం దొరికింది!
కాసిపేట(బెల్లంపల్లి): కుమురం భీం జిల్లా బెజ్జూరులో మాయమైన పులి చర్మం మంచిర్యాల జిల్లా కాసిపేటలో ఆదివారం పోలీసులకు లభ్యమైంది. పులి చర్మం అదృశ్యం వెనుక బీట్ ఆఫీసర్ భార్య, బావమరిది సూత్రధారులుగా ఉన్నారని ప్రాథమిక విచారణలో తేలింది. బీట్ ఆఫీసర్ పాత్రపైనా విచారణ సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపిన పులి చర్మం మాయం కేసును బెజ్జూరు, కాసిపేట పోలీసులు ఛేదించారు. పులి చర్మం మాయం కేసులో సస్పెండైన బీట్ ఆఫీసర్ బిజ్జూరి రవీందర్ భార్య, బావమరిది ప్రధాన సూత్రధారులు కావడం చర్చనీయాంశంగా మారింది. కాసిపేట ఎస్సై పోచంపల్లి సతీశ్, బెజ్జూరు ఎస్సై శివప్రసాద్ కథనం ప్రకారం.. 2016లో మహారాష్ట్రలో పులిని చంపి చర్మాన్ని తరలిస్తుండగా బెజ్జూరు ఫారెస్టు రేంజ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పులి చర్మాన్ని భద్రపర్చాల్సిందిగా అటవీశాఖ అధికారులను కోర్టు ఆదేశించింది. అప్పటి ఎఫ్ఎస్వో వేణుగోపాల్, బీట్ అధికారి రవీందర్ గదిలో భద్రపరిచారు. గతేడాది డిసెంబర్లో అధికారుల బదిలీలో భాగంగా పాత కేసులకు సంబంధించి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా పులి చర్మం కనిపించకపోవడంతో విషయం బయటకు వచ్చింది. డిసెంబర్ 18 నుంచి పులి చర్మం ఆచూకీ లేకపోవడంతో ఈ నెల 6న అటవీ అధికారులు బెజ్జూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సస్పెన్షన్‌లో ఉన్న రవీందర్‌పై నిఘా పెట్టి కేసు విచారణ చేపట్టారు. అందులో బీట్ ఆఫీసర్ భార్య సౌందర్య, బావమరిది దుర్గం వెంకటస్వామి పాత్ర ఉన్నట్లు సమాచారం అందడంతో వెంకటస్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. -
పులి చర్మం కోసం రూ.10 లక్షల చెక్కు
- సంచిలో పులి చర్మం? - విదేశాలకు తరలిస్తున్నట్లు అనుమానం - ఛత్తీస్‌గఢ్ వ్యాపారి నుంచి కొనుగోలు - దుప్పుల వేట కేసులో కొత్త కోణం సాక్షి, భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దుప్పులవేట కేసులో మరో దారుణం చోటు చేసుకున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుప్పులను వేటాడిన నిందితులు విదేశాలకు తరలించేందుకు పులిచర్మాన్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యాపారి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు దాడి చేసిన తర్వాత చాకచ క్యంగా ఈ పులిచర్మాన్ని తప్పించినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో పక్కదారి పట్టిన పలు అంశాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గన్నీ బ్యాగులో పులి చర్మం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి వద్ద ఈ నెల 19న రాత్రి అటవీశాఖ అధికారులు దాడి చేయగా దుప్పులను వేటాడిన నిందితులు పారిపోయారు. సంఘటనా స్థలంలో టాటా ఇండికా విస్టా కారు, రెండు దుప్పు ల కళేబరాలు, ఖాళీ బ్యాంకు చెక్కు, ఫజల్ మహ్మద్ ఖాన్‌కు చెందిన ఆధార్‌కార్డు, కారు రిపేరు చేయిం చిన రసీదు, కత్తి, ఖురాన్ వంటి వస్తువులతోపాటు రూ.10 లక్షల విలువైన సంతకం చేసిన చెక్కు, ఫ్లైట్æ టికెట్, మొబైల్ ఫోన్లు లభించినట్లు తెలుస్తోంది. గ్రామస్తులందరూ చూస్తుండగానే టాటా ఇండికా విస్టా కారు నుంచి ఓ గన్నీ సంచిని ఏ–4 నిందితుడు అక్బర్‌ఖాన్ తీసినట్లు తెలు స్తోంది. ఈ సంచిలో ఏముందనే ప్రశ్న వారం రోజు లుగా అంతు చిక్కకుండా ఉంది. తాజాగా విశ్వసనీ య వర్గాల సమాచారం ప్రకారం ఈ గన్నీ సంచిలో పులిచర్మం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ జంతువైన పెద్దపులిని చంపడం, చర్మాన్ని, శరీరభాగాలతో వ్యాపారం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. అందువల్లే కేసును పక్కకు పెట్టినట్లు సందేహాలున్నాయి. మంథని కోర్టుకు ముగ్గురు వేటగాళ్లు మహదేవపూర్(మంథని): దుప్పులవేట కేసులో కరీంనగర్ జైలులో ఉన్న ముగ్గురు వేటగాళ్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకొని గురువారం మంథని కోర్టులో హాజరుపరిచారు. అక్బర్ ఖాన్ పరారీలో ఉండగా పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ వాసి షికారు సత్యం, మహదేవపూర్వాసి అస్రార్ ఖురేషీ, ఖరీముల్లాఖాన్లను పోలీసులు మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజ రుపర్చగా 13 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే. -
చత్తీస్‌గడ్‌లో పులి చర్మం స్మగ్లింగ్
-
షాపింగ్ సైట్ల ద్వారా స్మగ్లింగ్!
ఆన్ లైన్ షాపింగ్.. దేశంలో రోజురోజుకూ మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న ఈ రంగంపై స్మగ్లర్ల దృష్టి పడింది. ఎవరైనా తమ షాపింగ్ వెబ్ సైట్లో సెల్లర్లుగా మారొచ్చనే ఆప్షన్ ను తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. స్వయంగా కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే రాజ్యసభలో ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 106 ఆన్ లైన్ షాపింగ్ సంస్థల్లో సెల్లర్లుగా మారిన స్మగ్లర్లు జంతువుల చర్మాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) గుర్తించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన కొఆలా, పులి తదితర జంతువుల చర్మాలను అక్రమంగా దేశంలోకి తెచ్చేందుకు ఆన్ లైన్ షాపింగ్ లో అమ్మకానికి పెడుతున్నారని చెప్పారు. సెల్లర్ల సంఖ్య వేలల్లో ఉండటం వల్ల వారిని పట్టుకోవడం కష్టమౌతోందని తెలిపారు. అమెజాన్, ఈ-బే, ఓఎల్ఎక్స్, స్నాప్ డీల్ తదితర ప్రముఖ వెబ్ సైట్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయని వివరించారు. అమెజాన్, స్నాప్ డీల్ లాంటి సంస్థలకు సెల్లర్లపై పట్టుకలిగి ఉండటం వల్ల జంతువులకు సంబంధించిన బొమ్మలు, వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కొద్దిరోజుల క్రితం ఓ ప్రముఖ వెబ్ సైట్ నుంచి ఆస్ట్రేలియన్ టెడ్డీ బేర్ ను రూ.2 లక్షలకు కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన జంతువుల చర్మాన్ని టెడ్డీ బేర్ కు ఉంచి దీనిని అమ్మకానికి పెట్టినట్లు వివరించారు. ఇందుకోసం వారు ప్రత్యేకమైన కోడ్స్ ను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు చెప్పారు. ఈ వివరాలను అన్ని ఆన్ లైన్ షాపింగ్ సంస్థలకు అందిచామని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో గుర్తుతెలియని సెల్లర్లు పోస్టు చేసిన దాదాపు 296 జంతు సంబంధిత వస్తువుల అమ్మకాలను అమెజాన్ నిలిపివేసిందని చెప్పారు. ఈ-బే, క్విక్కర్ తదితర సైట్లకు సెల్లర్ల మీద అవగాహన సరిగా ఉండటం లేదని, మరికొన్ని సంస్థలకు అసలు దేశంలో కార్యలయాలు లేవని తెలిపారు. ఆన్ లైన్ అక్రమంగా రవాణా చేస్తున్న వస్తువులపై నిఘాను పటిష్టం చేసినట్లు వివరించారు. సంరక్షణలో ఉన్న జంతువులు, పక్షులకు చెందిన వస్తువులను అమ్మకానికి ఉంచబోమని ఓఎల్ఎక్స్ అధికార ప్రతినిధి తెలిపారు. -
పులి చర్మంతో దొరికిన థాయ్‌లాండ్ పూజారి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని వివాదాస్పద పులుల గుడి నుంచి పులి చర్మంతో పారిపోతున్న పూజారిని అధికారులు పట్టుకున్నారు. పూజారుల నివాస స్థలాల్లో జరిపిన తనిఖీల్లోనూ బతికున్న సింహం, ఇతర వన్యప్రాణులనుతో పాటు 20 పాత్రల్లో భద్రపరిచిన పులుల అవయవాలు, కళేబరాలను గుర్తించారు. గుడి నుంచి చైనాకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడి రిఫ్రిజిరేటర్లో బుధవారం అధికారులు 40 పులిపిల్లల కళేబరాలను కనుగొన్న సంగతి తెలిసిందే. -
డంపింగ్ యార్డ్‌లో పులి చర్మం..
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు డంపింగ్‌యార్డ్ ప్రాంతంలో గురువారం ప్లాస్టిక్ కవర్లో పులి చర్మం లభించింది. స్థానికులు గుర్తించి కవర్లో నుంచి చర్మాన్ని బయటకు తీసి పరిశీలించారు. దీని పొడవు ఐదడుగులు ఉంది. మరోచోట పులిచర్మం చీకిపోయిన ముక్కలు కనిపించాయి. దీంతో వారు ఈ విషయాన్ని గూడూరు రూరల్ పోలీసులకు తెలియజేశారు. వారు పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ. లక్షల విలువజేసే పులి చర్మాన్ని తమ వద్ద ఉంచుకుంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద జైలుపాలవుతామని ఎవరైనా అక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -గూడూరు -
పులిలా కనిపిస్తోంది..
చూస్తే.. పులిలా కనిపిస్తోంది.. వీరు దాన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు అనేగా మీ డౌట్. ఇది పులి చర్మం.. దీన్ని వీరు దహనం చేస్తున్నారు! ఆదివారం ఢిల్లీలోని జూలో వివిధ జంతువుల చర్మాలు, ఏనుగులు, ఖడ్గమృగాల దంతాలు.. ఇలా వన్యప్రాణి స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అనేక వస్తువులను తగులబెట్టేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. దక్షిణాసియాలో వన్యప్రాణుల స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా వీరీ చర్యకు పూనుకున్నారు. -
పులి చర్మం స్వాధీనం
బెంగళూరు : పులి చర్మం విక్రయించడానికి యత్నిస్తున్న వ్యక్తిని ఇక్కడి చెన్నమ్మనే అచ్చుకట్ట (సీకే అచ్చుకట్ట) పోలీసులు అరెస్టు చేశారు. రామనగరలో నివాసం ఉంటున్న ఇదాయతుల్లా అనే యువ కుడిని అరెస్టు చేసి పులి చర్మం స్వాధీనం చేసుకున్నామని మంగళవారం న గర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. విలేకరుల సమావేశంలోఆయన వివరాలు వెల్లడించారు. పులిని తుపాకితో కాల్చి చంపిన గుర్తు కూడా చర్మంపై ఉందని చెప్పారు. ఉత్తర భారత్‌లో ఈ సంఘటన జరిగిందని, ఆ తరువాత నలుగురు వ్యక్తులు పులి చర్మం కొనుగోలు చేశారన్నారు. అనంతరం ఇదాయతుల్లా దీనిని కొనుగోలు చేసిన ట్లు ఔరాద్కర్ చెప్పారు. కత్రిగుప్ప రింగ్ రోడ్డులోని బస్టాప్ దగ్గర ఇదాయతుల్లా పులి చర్మం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిందితుడిని అరెస్ట్ చేసి పులి చర్మం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులను అభినందించారు.