ఇటీవల పులిచర్మంగా భావించి అదుపులోకి తీసుకున్న నిందితుడితో పోలీసులు(ఫైల్)
లక్సెట్టిపేట(మంచిర్యాల): పులిచర్మంగా రాష్ట్రంలో హల్‌చల్ రేపిన పులిచర్మం కథ ఇప్పటికీ సుఖాంతం కాలేదు. కుక్క చర్మానికి రంగులు దిద్ది పులిచర్మంగా అమ్ముతున్నారని భావించిన కథ ఇంకా ముగియలేదు. ఒక వేళ అది కుక్క చర్మం అయినట్లైతే పోలీసులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుందని పలువురు అనుకుంటున్నారు. కుక్క చర్మంతో వ్యాపారం చేస్తు పోలీసులకే పంగనామాలు పెట్టినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఫొరెనిక్స్ రిపోర్టు రాలేదని వచ్చేదాకా ఎటూ తేల్చేది లేదని పోలీసులు తెలుపుతున్నారు.
పులిచర్మంగా మొదట వెల్లడి
మండలంలో ఈనెల 4న స్థానిక పోలీసులు కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన శ్యాంరావు అనే వ్యక్తి పులి చర్మం తరిలిస్తున్నాడని తెలిసి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఐ శ్రీనివాస్, ఎస్సై మధుసూదన్‌రావు నిందితులను అదుపులోకి తీసుకుని మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అది పులి చర్మం కాదు కుక్క చర్మం అని సోషల్ మీడియాలో పోస్టులు, సంబంధిత ఫారెస్టు అధికారులు పులిచర్మం కాదని చెప్పడంతో అనుమానంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో పులిచర్మంగా భావిస్తున చర్మాన్ని హైద్రాబాద్‌లోని ల్యాకోన్స్ ల్యాబోరేటరీకి తరలించారు. పది రోజులు గడిచినా రిపోర్టు రాకపోవడంతో పులిచర్మం కథ ఇంకా సుఖాంతం కాలేదు. కుక్కను చంపి పులి చర్మంగా తయారు చేయడానికి హెయిర్ డై వంటి రంగులు వాడి పులి చర్మంగా పెద్ద ఎత్తున్న చీకటి వ్యాపారం సాగుతున్నట్లు బహిర్గతమవుతోంది. దీనిపై పోలీసులు నిఘా పెడితే అసలు వ్యాపారం బట్టబయలవుతుందని ఎందుకు దీనిపై పోలీసులు దృష్టిపెట్టలేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుక్క అయితే మాత్రం చంపి దానికి రంగులు పూసి వ్యాపారం చేసే అధికార ం లేదని అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని పెట్ యానిమల్స్ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.
నివేదిక కోసం ఎదురుచూపులు
పులిచర్మంగా భావిస్తున్న చర్మాన్ని హైద్రాబాద్‌లోని ల్యాబోరేటరీకి పంపినట్లు పోలీసులు తెలుపుతున్నారు. చర్మం పులిదా కుక్కదా అని తేల్చేందుకు ఇంత సమయం పడుతుందా పది రోజులైన ఇంకా రిపోర్టు రాకపోవడం ఏంటి అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది పక్కాగా కుక్క చర్మమే అని ఫారెస్టు అధికారులు ముందే కొట్టిపారేస్తున్నారు. పోలీసులు తొందరపడి పులిచర్మంగా మీడియాకు తెలియపర్చారని దీంతో ఫారెస్ట్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్లుగా ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. కుక్కదా పులిదా పోలీసులే తేల్చి చెప్పాలని రిపోర్టు ఎలా వస్తుందని పోలీసులు ఏం చెప్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment