సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర అభయారణ్యాల నుంచి ఆది లాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన పులుల మరణం మిస్టరీగా మారింది. రెండేళ్లలో మూడు పెద్ద పులులు వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలకు తగిలి బలయ్యాయి. పులుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న అధికార యంత్రాంగం.. వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలను అమరుస్తుండటాన్ని అరికట్ట లేకపోవడం పలు అనుమానా లకు తావిస్తోంది. అడవి పంది, జింక, దుప్పి, మెకం, సాంబార్ వంటి వన్యప్రాణుల కోసం వేటగాళ్లు, వన్యప్రాణుల నుంచి పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు అమర్చే విద్యుత్ తీగలకు తగిలి పెద్దపులులు ప్రాణాలు కోల్పోతున్నాయని అటవీశాఖ అధికారులు ఘటనల తీవ్ర తను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వన్య ప్రాణుల పేరిట పెద్దపులుల ఉసురు తీసేం దుకు ఇతర శక్తులేవైనా ప్రయత్నిస్తున్నాయా అనే కోణంలో ఇప్పటి వరకు ఎలాంటి అడుగు పడకపోవడం గమనార్హం. ప్రమాదకరమైన కరెంటు తీగల ఉచ్చులో ఆరితేరిన వ్యక్తులు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల సూచనలకు అనుగుణంగానే ఈ వేట సాగుతుందని అర్థమవుతోంది. మంచి ర్యాల జిల్లా శివ్వారంలో అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ హతం వెనుక కూడా స్మగ్లర్ల హస్తం ఉందని పోలీసు అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రెండు పులులు ఒకే రీతిన
2016, డిసెంబర్‌లో కోటపల్లి మండలం పిన్నా రంలో విద్యుత్ తీగలకు చిక్కి పులి హతమైంది. స్థానిక వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తాకి ఈ పులి చనిపోయిందని అటవీశాఖ అధికారులు దర్యాప్తులో తేల్చారు. సరిగ్గా రెండేళ్లకు గత నెలలో నిర్మల్ జిల్లా పెంబి మండలం పుల్గంఫాండ్రి వద్ద మరో పులిని హత మార్చారు. ఈ పులి చర్మాన్ని, గోళ్లను ఒలిచి, కళేబరాన్ని పూడ్చేశారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిందని భావిస్తున్న ఈ పులి చర్మాన్ని విక్రయించే ప్రయత్నంలో ఇచ్చోడ వద్ద అటవీశాఖ అధికారులకు చిక్కారు. తాజాగా తిప్పేశ్వర్ నుంచే వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన మగపులి శివ్వారంలో మృతిచెందిన సంఘటన పుల్గం ఫాండ్రి పులిని హతమార్చిన రీతిలోనే ఉండటం గమనార్హం. ఉచ్చులో పడి మృత్యువాత పడ్డ పులి చర్మాన్ని, గోళ్లను వొలిచి విక్రయించే ప్రయత్నంలో దొరి కిపోయారు. ఈ 2 ఘటనలకు మధ్య సారూప్యం ఉండటం,, నెల రోజుల వ్యవధిలోనే చోటు చేసుకోవడం వెనుక పులి చర్మాల స్మగ్లింగ్ ముఠా హస్తం ఉండొచ్చని అటవీ, పోలీస్ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
స్థానిక వేటగాళ్లతోనే స్మగ్లర్ల బేరసారాలు
వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేసే వ్యక్తులతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాత్రి వేళల్లో వేటగాళ్లు సన్నని ఇనుప బైండింగ్ వైర్లను కిలోమీటర్ల పొడవునా అమర్చి త్రీఫేజ్, హై టెన్షన్ వైర్లకు అనుసంధానం చేసి వన్యప్రాణులను బలిగొం టున్నారు. ఇలా వారానికి ఒక టైనా అడవి జంతువు వేటగాళ్ల బారిన పడటం సహజం. ఇలాంటి వేటగాళ్లతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు బేరసారాలు కుదుర్చుకొని పులుల మృతికి కారణమవుతున్నారని ఆరో పణలున్నాయి. స్థానిక వేటగాళ్లకు డబ్బుల ఎరచూపి, పులులు బలైన తరువాత చర్మాలను కొనుగోలు చేయడంలో ధర గిట్టుబాటు గాక వారే సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నట్లు కూడా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
మరణ శాసనం రాస్తున్న బైండింగ్ తీగలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మండ లాల్లో ప్రతి రోజు రాత్రి జరిగే ఈ వేటలో అధికారులు పసిగట్టలేకపోతున్నారు. పులి చర్మంపై క్రేజీ ఉండటంతో అవి సంచారం చేసే చోట బైండింగ్ వైర్ ఏర్పాటు చేసి హైటెన్షన్ విద్యుత్ తీగలకు అనుసంధానిస్తున్నారు. దీనికి తగిలి ఇతర వణ్యప్రాణులతో పాటు పులులు కూడా చనిపోతున్నాయి.
మనుషులకూ ప్రాణాంతకమే
ఈ నెల 10న రాత్రి రెబ్బెన మండలం తక్కల్ల పెల్లికి చెందిన కోట శ్రీనివాస తన సహచరుల తో పులికుంట శివారులోని అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు అమర్చిన కరెంట్ వైరు తగలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. గతంలోనూ ఇదే గ్రామంలో ఒకరు మృతి చెందారు. చెన్నూర్ మండలం సోమన్‌పల్లి అటవీ ప్రాంతంలో పంట పొలాలను రక్షిం చేందుకు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి గతంలో ఓ రైతు కూడా మృతిచెందాడు.
పులి వేటపై సీఎం సీరియస్
అటవీ అధికారులతో శనివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. అడవుల సంరక్షణ, కలప అక్రమ రవాణా నిరోధంపై జరిగిన ఈ భేటీలో ఆదిలాబాద్ అడవుల్లో పులుల మృత్యువాత అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అటవీ సంరక్షణ దళం ఏర్పాటు చేసి పులుల సంరక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, వేటగాళ్లను, స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment