Tirmalapur
-
చలించిపోయిన సీఎం కేసీఆర్ సతీమణి
సాక్షి, హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో కుటుంబ యజమాని మృతి చెందడంతో రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ చేయుతనిచ్చారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి ఆ మొత్తాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు పంపించి బాధిత కుటుంబానికి అందజేసి ఆదుకోవాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ నాయకులు రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామాన్ని సందర్శించి అనారోగ్యంతో చనిపోయిన నిరుపేద కమటం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. కాగా తిరుపతి ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోవడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ప్రస్తుతం మున్నూరు కాపు భవన్లో తలదాచుకుంటున్నారు. ఈ వార్త మీడియాలో రావడంతో సీఎం సతీమణి స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే ఆమె సూచనతో ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి లక్ష రూపాయలు, మిగిలిన దాతలు అందించిన 2 లక్షల రూపాయలతో కలిపి మొత్తం మూడు లక్షలు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
కల్యాణం.. ‘రమ’ణీయం
తల్లిదండ్రులు లేని రమ వివాహాన్ని జరిపించిన పోలీసులు తిర్మలాపూర్: రామడుగు మండలం తిర్మలాపూర్‌లో తల్లిదండ్రులు లేని రమ వివాహాన్ని గురువారం పోలీసులు వైభవంగా జరిపిం చారు. కుమార్తె వివాహానికి అప్పు దొరక్క పాకాల హన్మాండ్లుగౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడి కుమార్తె రమ–గణేశ్ వివాహాన్ని ఎస్సై నరేశ్‌రెడ్డి, సిబ్బంది స్థానిక ఆలయంలో వైభవంగా జరిపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. దాతలిచ్చిన రూ.1.50 లక్షల డిపాజిట్ బాండ్‌ను వధూవరులకు కానుకగా అందజేశారు. -
తిర్మలాపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ సభ్యులు
బాలానగర్ : మండలంలోని తిర్మలాపూర్‌ను శనివారం యూనిసెఫ్ బందం సభ్యులు అంకిత, తనియా, ప్రియాంక సందర్శించారు. గత ఏడాది అతి తక్కువగా వర్షం నమోదు కావడంతో రైతుల స్థితిగతులు, వేసిన పంటలు ఎండిపోవడంతో ఎలాంటి జీవితాలు గడుపుతున్నారు? వారి పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అని గ్రామస్తులతో ఆరా తీశారు. చిన్నారులను వారి వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేరా.. అంటూ పరీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామకష్ణాగౌడ్, అంగన్వాడీ కార్యకర్త అనిత పాల్గొన్నారు.