సాక్షి, హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో కుటుంబ యజమాని మృతి చెందడంతో రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ చేయుతనిచ్చారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి ఆ మొత్తాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు పంపించి బాధిత కుటుంబానికి అందజేసి ఆదుకోవాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ నాయకులు రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామాన్ని సందర్శించి అనారోగ్యంతో చనిపోయిన నిరుపేద కమటం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు.
కాగా తిరుపతి ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోవడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ప్రస్తుతం మున్నూరు కాపు భవన్‌లో తలదాచుకుంటున్నారు. ఈ వార్త మీడియాలో రావడంతో సీఎం సతీమణి స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే ఆమె సూచనతో ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి లక్ష రూపాయలు, మిగిలిన దాతలు అందించిన 2 లక్షల రూపాయలతో కలిపి మొత్తం మూడు లక్షలు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment