TNGO Association
-
‘ఉద్యోగుల ఆత్మబంధువు కేసీఆర్’
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు 30% పీఆర్సీ ప్రకటించి సమస్యలను ఒక్కరోజులోనే సాధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో అధ్యక్షులు, టీజేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం టీఎన్జీవో భవన్లో కేంద్ర కార్యవర్గ సభ్యులు హాజరైన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. టీఎన్జీవో సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయడం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం అనామలీస్ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భద్రాచలం నుంచి బాసర వరకు గద్వాల నుంచి ఆదిలాబాద్ వరకు 33 జిల్లాల్లో కృతజ్ఞతా సభలు నిర్వహించనుండటంతో పాటుగా బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు స్కేలును మంజూరు చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
రాష్ట్రంలో రైతు భరోసా యాత్ర
రైతుల ఆత్మహత్యలను నివారిద్దాం: కోదండరాం హైదరాబాద్ : సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అందరం కలసికట్టుగా పనిచేసి రైతులను బతికించుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా యాత్రను చేపడుతున్నామని, రైతుల ఆత్మహత్యలను నివారించడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నామని ప్రకటించారు. శనివారం నాంపల్లిలోని 21 సెంచరీ బిల్డింగ్‌లో జరిగిన తెలంగాణ రాజకీయ జేఏసీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం కార్యాలయాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న జేఏసీ కార్యాలయాన్ని నాంపల్లికి మార్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి నారాయణ, జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎ.శ్రీధర్, హైదరాబాద్ జిల్లా నాయకుడు ఎంబీ కృష్ణయాదవ్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
కేంద్రానిది కుట్రపూరిత ఆలోచన
సిద్దిపేట జోన్ : తెలంగాణ ప్రభుత్వ సర్వీసులను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర పూరిత ఆలోచన చేస్తోందని టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆదివారం రాత్రి స్థానిక ఎన్జీఓ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమలనాథన్ కమిటీ 56 వేల మంది ఉద్యోగుల విభజన ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు చేసి రెండునెలలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇంకా మార్చి 31 లోపు ప్రభుత్వ శాఖల్లోని పరిపాలన అధికారులు, సచివాలయ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించడంపై టీఎన్జీఓ యూనియన్ నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. శంషాబాద్విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో పార్కులు, వీధులకు ఉన్న ఆంధ్రా నాయకుల పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కేటాయింపుతో పాటు ఇతరత్రా అంశాల్లో విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోందని దేవీప్రసాద్ ఆరోపించారు. ఉద్యోగులకు 2013 జూలై నుంచి పేరివిజన్ నివేదిక అమలు చేయాలని, 69 శాతం ఫిట్‌మెంట్‌ను అందించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ సొసైటీల అక్రమాలపై సమగ్రమైన విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌రావు, నాయకులు విక్రమ్, శ్రీహరి, శ్రీనివాస్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్మెంట్ వయసు పెంచాలి
* ఆంధ్రా తరహాలో 60 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవోల విజ్ఞప్తి * జాబ్లకు నోటిఫికేషన్లు జారీ చేయండి * కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్సిబ్బందిని క్రమబద్ధీకరించండి * ఇళ్ల స్థలాలు, స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయండి * సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని టీఎన్జీవోల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని, పీఆర్సీపై కసరత్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆదివారం టీఎన్జీవోల సంఘం నేతలు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యలన్నింటీని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. టీఎన్జీవోల కార్యవర్గం భేటీ.. ఆదివారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్లో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విభజన అంశాలతో పాటు, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం 10 ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీఎన్జీవో ప్రతినిధి బృందం కలసి ఒక వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, డీఎస్సీల ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అశాస్త్రీయంగా జరిగిన ఉద్యోగుల విభజనపై కమలనాథన్ దృష్టి పెట్టాలని... జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను విభజించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెన్యువల్ చేసి.. వారి క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. పీఆర్సీపై కసరత్తును వేగవంతం చేయాలని, హెల్త్‌కార్డులపై మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 42 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా మార్పు చేయాలని.. ఉద్యోగులు, విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని టీఎన్జీవో నేతలు కోరారు. ఉద్యోగ సంఘాలతో చర్చిస్తా: కేసీఆర్ తెలంగాణ ఉద్యోగుల సమస్యలన్నింటినీ వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తానని టీఎన్జీవో నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో త్వరలోనే మాట్లాడుతానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసిన టీఎన్జీవో నేతలు కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను ఆయనకు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేసీఆర్‌కు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంకా పూర్తిగా స్థిరపడలేదని.. కొంత సమయం తీసుకుంటుందని కేసీఆర్ వివరించారు. ఉద్యోగుల సమస్యలు, ఇంకా చిన్న విషయాలను పెండింగ్‌లో పెట్టుకోకుండా పునర్నిర్మాణంవైపు వేగంగా అడుగులు వేసుకుందామని టీఎన్జీవో నేతలకు సూచించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారెం రవీందర్‌రెడ్డి, మహిళా నేత రేచల్ తదితరులు ఉన్నారు.