కేసీఆర్ కు వినతిపత్రం సమర్పిస్తున్న టీఎన్జీవో నేతలు
* ఆంధ్రా తరహాలో 60 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవోల విజ్ఞప్తి
* జాబ్‌లకు నోటిఫికేషన్లు జారీ చేయండి
* కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్సిబ్బందిని క్రమబద్ధీకరించండి
* ఇళ్ల స్థలాలు, స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయండి
* సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని టీఎన్జీవోల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని, పీఆర్సీపై కసరత్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆదివారం టీఎన్జీవోల సంఘం నేతలు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యలన్నింటీని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.
టీఎన్జీవోల కార్యవర్గం భేటీ..
ఆదివారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విభజన అంశాలతో పాటు, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం 10 ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీఎన్జీవో ప్రతినిధి బృందం కలసి ఒక వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, డీఎస్సీల ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే అశాస్త్రీయంగా జరిగిన ఉద్యోగుల విభజనపై కమలనాథన్ దృష్టి పెట్టాలని... జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను విభజించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెన్యువల్ చేసి.. వారి క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. పీఆర్సీపై కసరత్తును వేగవంతం చేయాలని, హెల్త్‌కార్డులపై మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 42 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా మార్పు చేయాలని.. ఉద్యోగులు, విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని టీఎన్జీవో నేతలు కోరారు.
ఉద్యోగ సంఘాలతో చర్చిస్తా: కేసీఆర్
తెలంగాణ ఉద్యోగుల సమస్యలన్నింటినీ వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తానని టీఎన్జీవో నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో త్వరలోనే మాట్లాడుతానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసిన టీఎన్జీవో నేతలు కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను ఆయనకు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేసీఆర్‌కు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం ఇంకా పూర్తిగా స్థిరపడలేదని.. కొంత సమయం తీసుకుంటుందని కేసీఆర్ వివరించారు. ఉద్యోగుల సమస్యలు, ఇంకా చిన్న విషయాలను పెండింగ్‌లో పెట్టుకోకుండా పునర్నిర్మాణంవైపు వేగంగా అడుగులు వేసుకుందామని టీఎన్జీవో నేతలకు సూచించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారెం రవీందర్‌రెడ్డి, మహిళా నేత రేచల్ తదితరులు ఉన్నారు.