సిద్దిపేట జోన్ : తెలంగాణ ప్రభుత్వ సర్వీసులను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర పూరిత ఆలోచన చేస్తోందని టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆదివారం రాత్రి స్థానిక ఎన్జీఓ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమలనాథన్ కమిటీ 56 వేల మంది ఉద్యోగుల విభజన ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు చేసి రెండునెలలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇంకా మార్చి 31 లోపు ప్రభుత్వ శాఖల్లోని పరిపాలన అధికారులు, సచివాలయ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించడంపై టీఎన్‌జీఓ యూనియన్ నిరసన వ్యక్తం చేస్తోందన్నారు.
శంషాబాద్‌విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో పార్కులు, వీధులకు ఉన్న ఆంధ్రా నాయకుల పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కేటాయింపుతో పాటు ఇతరత్రా అంశాల్లో విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోందని దేవీప్రసాద్ ఆరోపించారు. ఉద్యోగులకు 2013 జూలై నుంచి పేరివిజన్ నివేదిక అమలు చేయాలని, 69 శాతం ఫిట్‌మెంట్‌ను అందించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ సొసైటీల అక్రమాలపై సమగ్రమైన విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌రావు, నాయకులు విక్రమ్, శ్రీహరి, శ్రీనివాస్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రానిది కుట్రపూరిత ఆలోచన
Published Sun, Nov 30 2014 10:48 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement