రాహుల్‌ను ప్రధానిని చేద్దాం
పార్లమెంటు స్థానాలన్నీ గెలుచుకోవాలి
తమిళ కాంగ్రెస్ నేతలకు రఘువీరారెడ్డి పిలుపు
టీఎన్‌సీసీ అధ్యక్షులు తిరునావుక్కరసర్‌కు శుభాకాంక్షలు
చెన్నై: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడం ద్వారా అఖిల భారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీని ప్రధాని చేద్దామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) కేంద్ర కార్యాలయమైన చెన్నైలోని సత్యమూర్తి భవన్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మంగళవారం ప్రసంగించారు.
2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయమే లక్ష్యంగా కార్యకర్తలు నేటి నుంచే కార్యోన్ముఖులు కావాలని ఆయన కోరారు. దేశంలోని యువత అంతా రాహుల్‌గాంధీ నాయకత్వం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నదని అన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
లౌకికవాదంతో ఏకంగా ఉన్న భారతదేశాన్ని కుల, మతాలు, మతతత్వవాదాలతో బీజేపీ ప్రభుత్వం విడగొడుతున్నదని ఆయన ఆరోపించారు. దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ గెలుపు అనివార్యమని ఆయన చెప్పారు.
సమర్థ నేత తిరునావుక్కరసర్:
టీఎన్‌సీసీ అధ్యక్షులుగా నియమితులైన తిరునావుక్కరసర్ సమర్థుడైన నేత అని రఘువీరారెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవమున్న నేతను టీఎన్‌సీసీ అధ్యక్షులుగా నియమించడం సోనియా, రాహుల్‌గాంధీ తీసుకున్న సముచితమైన నిర్ణయమని అన్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా గతంలో పలు బాధ్యతలు నిర్వర్తించిన తిరునావుక్కరసర్ హయాంలో తమిళనాడు కాంగ్రెస్ ఘన విజయాలను అందుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ఏపీ ఇన్చార్జ్గా, ఏఐసీసీ కార్యదర్శిగా తనకు సుపరిచితుడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సరైన సలహాలు ఇచ్చి చేదోడువాదోడుగా నిలిచిన సంగతిని తాను మరువలేదని అన్నారు. అందుకే ఆయన్ను స్వయంగా కలసి అభినందించాలని చెన్నైకి వచ్చానని వివరించారు.
నిర్బంధ తమిళం కూడదు:
తమిళనాడులోని నిర్బంధ తమిళ చట్టంపై రఘువీరా రెడ్డి స్పందిస్తూ, భారతదేశ పౌరులను పలానా భాష నేర్చుకోవాలని నిర్బంధించడం ఎంతమాత్రం కూడదని అన్నారు. తమకు ఇష్టమైన భాషను నేర్చుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని చెప్పారు. తమిళ కాంగ్రెస్ పార్టీలో 20 శాతం తెలుగువారేనని, రాష్ట్రేతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి హక్కులను కాపాడేందుకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యులు చిరంజీవి పాల్గొన్నారు.