అడ్వాణీకి భారతరత్న
న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్‌కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారం¿ోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు.
‘‘సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అడ్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అడ్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అడ్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అడ్వాణీ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అద్వానీతో కలిపి ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు.
కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అడ్వాణీ: మోదీ
సంభాల్పూర్ (ఒడిశా):
అడ్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని, దేశ ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ కోసం పోరాడారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘‘దివంగత ప్రధాని వాజ్పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అడ్వాణీ జాతీయ విలువలద్దారు.
దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు. ఆయనకు భారతరత్న లభించడం బీజేపీకి, దాని అసంఖ్యా కార్యకర్తలకు కూడా గొప్ప గౌరవం’’ అని ఒడిశాలోని సంభాల్పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పారీ్టల నాయకులు కూడా అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వరి్ణంచేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వానీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపానన్నారు.
జేడీ(ఎస్) నేత కుమారస్వామి, ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు అడ్వాణీకి అభినందనలు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయం కొలువుదీరిందంటే అందుకు అడ్వాణీయే కారణమని బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. త్వరలో దిగిపోనున్న మోదీ సర్కారు బీజేపీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే అడ్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు.
నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు
‘‘భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్‌లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా.
ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’
– భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అడ్వాణీ.