రాప్తాడు రాజు ఎవరో
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం.. అనంతపురంలోని 14 నియోజకవర్గాల్లో ఇది ప్రత్యేకం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికే రెండు ఎన్నికలు జరిగాయి. మూడో సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయపార్టీలు సిద్ధమయ్యాయి. అయితే వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే ఇక్కడ ప్రధాన పోటీ నెలకొంది. మంత్రి పరిటాల సునీత ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో సునీత స్థానంలో ఆమె తనయుడు పరిటాల శ్రీరాం బరిలో నిలిచారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పోటీలో ఉన్నారు. తన రాజకీయ ఆరంగేట్రం, నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికలో 1707 ఓట్ల స్వల్వ తేడాతో ఓడిపోయిన ప్రకాశ్‌రెడ్డి ఈ దఫా ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే సంకల్పంతో దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత, కుటుంబ పాలనపై ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లో వచ్చిన తిరుగుబాటు నేపథ్యంలో వారసుడిగా పరిటాల శ్రీరాంకు ఈ ఎన్నిక సవాల్‌గా మారింది. దీంతో ‘రాప్తాడు’ ఫలితంపై ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నియోజకవర్గ స్వరూపం
రాప్తాడు మండలం 2009కు ముందు అనం తపురం నియోజకవర్గ పరిధిలో ఉండేది. అప్పటి వరకూ పరిటాల కుటుంబ పెనుకొండ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించేంది. 2005లో పరిటాల రవీంద్ర హత్య తర్వాత జరిగిన ఉప ఎన్ని కల్లో సునీత రాజకీయ ఆరంగేట్రం చేశారు. సునీత సొంత మండలం రామగిరితో పాటు అప్పటి వర కూ పెనుకొండ పరిధిలో ఉన్న చెన్నేకొత్తపల్లి, కనగా నపల్లి మండలాలు రాప్తాడు నియోజకవర్గం లోకి చేరాయి. ఆత్మకూరుతో పాటు అనంతపురం రూరల్ మండలం కూడా ఈ నియోజవకర్గంలోకి చేర్చారు.
పోటాపోటీ
2009లో నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికలో సునీతపై కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బరిలోకి దిగారు. కేవలం 1707ఓట్ల తేడాతో ప్రకాశ్ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో ఓటమి చెందారు. మూడో సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పరిటాల కుమారుడు శ్రీరాం ఈ దఫా పోటీలో నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున మాత్రం తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
సామంతుల పాలన
రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడాలేని విధంగా గత 58 నెలలు ఈ నియోజకవర్గంలో ‘సామంతులపాలన’ నడిచింది. సునీత తమ్ముళ్లు మురళీ రాప్తాడు, బాలాజీ ఆత్మకూరుకు, సునీత చిన్నాన్న ఎల్ నారాయణచౌదరికి చెన్నేకొత్తపల్లి, కనగాపల్లికి నెట్టెం వెంకటేశ్, అనంతపురం రూరల్‌కు పరిటాల మహేంద్ర, రామగిరికి రామ్మూరి ్తనాయుడులను ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు ప్రజలచేత ఎన్నికైన ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఈ నియోజకవర్గంలో నిర్ణయాధికారాలు లేవు. ఏ మండలంలో ఏ అభివృ ద్ధి కార్యక్రమం, ప్రారంభోత్సవం, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయాలన్నా ‘సామంతుల’ నిర్ణయమే ఫైనల్!
ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి విస్మరణ
పాతికేళ్లుగా పరిటాల కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు. 2014లో మంత్రిగా సునీతకు అవకాశం దక్కింది. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని ఆశపడ్డారు. అయితే ఐదేళ్లలో ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. దాదులూరులో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పుతామని తొలిబడ్జెట్‌లో ప్రకటించారు. ఇప్పటి వరకూ అతీగతీ లేదు. సునీత సొంతమండలం రామగిరిలో బంగారు గనులు గతంలో పరిటాల రవీంద్ర వైఖరితోనే మూతపడ్డాయి. వీటికి పూర్వవైభవం తెస్తామన్నారు. పట్టించుకోలేదు.
రాప్తాడు సమీపంలో జాకీ ఫ్యాక్టరీ మంజూరైంది. లంచాల దెబ్బతో దీనికి బ్రేక్ పడింది. చివరకు నియోజకవర్గ రైతులకు సాగునీళ్లు ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు. పేరూరు ప్రాజెక్టుకు తక్కువ ఖర్చుతో , తక్కువ సమయంలో నీళ్లిచ్చేమార్గం ఉన్నా ఆదిశగా ఆలోచించలేదు. ఆర్థికప్రయోజనాలే ధ్యేయంగా కొత్తగా కాలవను తవ్వుతున్నారు. ఐదేళ్లలో ఎకరా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే పారిశ్రామిక, వ్యవసాయఅభివృద్ధితో పాటు ఐదేళ్లలో ఫలాని పని చేశాం అని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. ఇదే వారిపై ప్రజల్లో వ్యతిరేకత స్థాయిని పెంచింది.
సాగునీరే ప్రకాశ్ ప్రధాన అస్త్రం
మరోవైపు ప్రకాశ్ విభిన్నశైలిలో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ‘ఇన్నేళ్లు పరిటాల కుటుంబాన్ని చూశారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడాలి’ అని అభ్యర్థిస్తున్నారు. జగన్ సీఎం అయితే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పాదయాత్రలో జగన్ కూడా ఈ విషయంపై హామీ ఇచ్చారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్న ప్రాంతం కావడంతో అంతా వైఎస్సార్సీపీకి జైకొడుతున్నారు. ఈ పరిణామాలతో పరిటాల కుటుంబం ఈ దఫా ఎన్నికల్లో సునీతను కాకుండా శ్రీరామ్‌ను బరిలోకి దించుతోంది. సునీత అయితే ఓటమి తప్పదని, శ్రీరాం అయితే కొత్తముఖం కావడంతో వ్యతిరేకత స్థాయి తగ్గుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ప్రకాశ్‌మాత్రం ఐదేళ్లపాలన శ్రీరాం కనుసన్నల్లోనే సాగిందని, ఈ దఫా పరిటాల కోటపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామనే ధీమాతో ఉన్నారు.
టీడీపీని వీడిన నేతలు
తెలుగు దేశం అరాచకాలు తట్టుకోలేక నియోజకవర్గంలో చాలా మంది పార్టీని వీడారు. పరిటాల రవీంద్రకు ముఖ్య అనుచరుడిగా ఉన్న వేపకుంట రాజన్న టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ టీడీపీకి పూర్తి దూరంగా ఉన్నారు. ఐడీసీ చైర్మన్ నల్లపురెడ్డి ఇటీవలే తన పదవికి, టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ఇక సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు గ్రామ, మండల స్థాయి నాయకులు భారీగా పరిటాల కుటుంబాన్ని వదిలి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ పరిణామాలన్నీ వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి.
ఐదేళ్లుగా హత్యలు... దౌర్జన్యాలు
ఐదేళ్లలో వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలను హతమార్చారు. 2015 ఏప్రిల్ 29న రాప్తాడు మండలం వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని తహశీల్దార్ ఆఫీసులో కిరాతకంగా నరికిచంపారు. 2018 మార్చి 30న కందుకూరులో శివారెడ్డిని నరికిచంపారు. ఇవి కాకుండా వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన భౌతికదాడులకు లెక్కేలేదు. ఇవి కూడా సునీతపై మైనస్‌గా మారింది.