సాక్షి, అనంతపురం: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయటం ద్వారా రాయలసీమకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన అద్భుతమని, ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆయన ప్రతిపాదనలు హర్షణీయమని పేర్కొన్నారు. ఏపీలోని అన్ని జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపణలు అర్థరహితమని.. అమరావతి చుట్టూ చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను జేసీ దివాకర్ రెడ్డి కించపరిస్తే.. చంద్రబాబు నవ్వటం దుర్మార్గ చర్య అని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు హింసకు పాల్పడాలని చంద్రబాబు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతల హత్యలకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నారని, ఆయన పరిపాలన దేశానికే ఆదర్శమని అన్నారు. సీఎం జగన్ నిర్ణయాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోయి పోలీసులను బెదిరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పోలీసులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన కూడా ఆయన ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. 30 సంవత్సరాల నుంచి పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని తాడిపత్రి నియోజకవర్గంలో ఎంతో మందిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం జేసీ సోదరుల ఆటలు సాగకపోయేసరికి పోలీసులపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జేసీ సోదరులపై దాదాపు 15 కేసులకు పైగా నమోదయ్యాయని, కానీ ఒక్క కేసులో కూడా వారిని అరెస్టు చేయకపోవడం వల్లే పోలీసులంటే భయం పోయిందని ఆయన విమర్శించారు.
(చదవండి: బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా : జేసీ)
Comments
Please login to add a commentAdd a comment