చివరి భేటీలో ఉద్విగ్న వీడ్కోలు!
డేవిడ్ కామెరాన్ బ్రిటన్ ప్రధానమంత్రిగా చివరి కేబినెట్ సమావేశం ఉద్విగ్నభరితంగా సాగింది. చివరి మంత్రిమండలి సమావేశానికి నేతృత్వం వహించిన కామెరాన్‌ను సహచర మంత్రులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనో అద్భుతమైన ప్రధాని అంటూ ముక్తకంఠంతో కితాబిచ్చారు. ఈ సమావేశంలో కామెరాన్ కొంత ఉద్విగ్నతకు లోనయ్యారు. సహచర మంత్రులు నాలుగుసార్లు బల్లలను గట్టిగా చరుస్తూ.. ఆయన సేవల పట్ల తమ హర్షామోదాలను తెలియజేస్తూ.. ప్రధానిగా కామెరాన్‌కు ఘనమైన వీడ్కోలు పలికారు.
ఈ సమావేశంలో కామెరాన్ మాట్లాడుతూ ఇన్నాళ్లు దేశానికి సేవ చేయడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కేబినెట్‌కు నేతృత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన బుధవారం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లి స్వయంగా కామెరాన్ రాజీనామా పత్రాన్ని రాణికి సమర్పించనున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న 'బ్రెగ్జిట్' ఫలితాల నేపథ్యంలో కామెరాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆయన వారసురాలిగా థెరిసా మే ప్రధాని పగ్గాలను చేపట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె ప్రధాని పదవీ స్వీకారం చేసే అవకాశముంది. బ్రెగ్జిట్ ప్రక్రియను నిర్వర్తించే బృహత్ బాధ్యతను భుజస్కంధాలపై మోయనున్న థెరిసా తన కేబినెట్ లో కీలకమైన వ్యక్తులను తీసుకొనే అవకాశముంది.