తగ్గనున్న మొబైల్ రోమింగ్ చార్జీలు
కాల్స్‌పై 35%, ఎస్ఎంఎస్లపై 80 శాతం దాకా తగ్గుదల: ట్రాయ్ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: రోమింగ్‌లో మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ల చార్జీలను సుమారు 35 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గించే దిశగా టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలు రూపొందించింది. టెలికం కంపెనీలు వసూలు చేసే రోమింగ్ చార్జీలపై గరిష్ట పరిమితుల్లో మార్పులు చేస్తూ టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డరుకు సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం రోమింగ్‌లో ఉన్నప్పుడు చేసే ఔట్‌గోయింగ్ లోకల్ కాల్స్‌కి ప్రస్తుతం నిమిషానికి రూ.1గా ఉన్న గరిష్ట టారిఫ్ పరిమితిని 65 పైసలకు తగ్గించాల్సి ఉంటుంది.
ఇక నిమిషానికి రూ. 1.5గా ఉన్న ఎస్టీడీ కాల్స్ చార్జీలు కూడా రూ.1కి తగ్గుతాయి. మరోవైపు ఇన్కమింగ్ కాల్స్‌కి సంబంధించి ప్రస్తుతం టెల్కోలు గరిష్టంగా 75 పైసలు వసూలు చేస్తుండగా దీన్ని 45 పైసలకు తగ్గించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. అలాగే, లోకల్ ఎస్ఎంఎస్లకు ప్రస్తుతం రూ. 1గా ఉన్న టారిఫ్‌ను 20 పైసలకు తగ్గించాలని పేర్కొంది. ఈ సిఫార్సులపై టెల్కోలు మార్చి 13లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.