Trainee IASes
-
ట్రైనీ ఐఏఎస్‌లపై ఆకతాయిల దాడి
వెల్గటూరు: గ్రామాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లపై ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో బీరు సీసాలు విసురుతూ నానా హంగామా సృష్టించారు. వారు బస చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయం తలుపులు, కిటికీలు పగులగొట్టారు. ఆకతాయిల చేష్టలకు నిశ్చేష్టులయిన ఐఏఎస్‌లు భయంతో వణికిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పడ్కల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామాల్లోని స్థితిగతులను తెలుసుకునేందుకు శిక్షణలో భాగంగా మండలంలోని పడ్కల్ గ్రామానికి ట్రైనీ ఐఏఎస్‌లు అభినవ్ రతీ, అమిత్షిరాన్, గోపాల్షా, హర్షసింగ్ వచ్చారు. వారికి పంచాయతీ కార్యాలయంలో బస ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో భోజనం తెచ్చేందుకు ఇన్చార్జి అధికారి రత్నాకర్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో వెల్గటూరు, రాజారాంపల్లి, కొత్తపేట, కప్పారావుపేట, పడ్కల్ గ్రామాలకు చెందిన పలువురు యువకులు ట్రైనీ ఐఏఎస్‌ల వద్దకు చేరారు. అప్పటికే వారు మద్యం సేవించారు. అధికారులతో మాట్లాడాలని పేర్కొంటూ నానా రభస సృష్టించారు. వారి పరిస్థితిని చూసిన అధికారులు తలుపులు వేసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన మాదాసు అభిషేక్, మేకల ప్రభాకర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఐఏఎస్‌లను పరుష పదజాలంతో దూషించారు. రాళ్లు, కర్రలు, బీరుబాటిళ్లను విసురుతూ భయభ్రాంతులకు గురిచేశారు. కర్రలతో కిటికీల నుంచి దాడికి యత్నించారు. బీరు సీసాలను కిటికీల్లోంచి విసిరేశారు. దీంతో భయాందోళనకు గురైన అధికారులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్ఐ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అయినా ఆకతాయిలు వినిపించుకోకపోవడంతో వారిని స్టేషన్‌కు తరలించారు. మండల పరిషత్ అటెండర్, వీఏవో రత్నాకర్ ఫిర్యాదు మేరకు అభిషేక్ సహా పది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. -
సింగరేణి భవన్లో ట్రైనీ ఐఏఎస్‌లు
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శిక్షణ పొందితున్న ట్రైనీ ఐఏఎస్‌లు గురువారం సింగరేణి భవన్లో సంస్థ సీఎండీతో సమావేశమయ్యారు. సింగరేణి భవన్‌లోని కాన్ఫరెన్స్హాల్లో జరిగిన సమావేశంలో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ట్రైనీ ఐఏఎస్ అధికారులకు సింగరేణి సంస్థ గత 13 దశాబ్దాలుగా బొగ్గు ఉత్పత్తి ద్వారా దేశానికి అందిస్తున్న సేవలను వివరించారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి వివిధ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలు తీరుస్తున్న విషయాన్ని వివరించారు. రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా కూడా సమావేశంలో పాల్గొన్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ సంస్థకు సంబంధించిన విషయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు ఐఏఎస్ అధికారులు సంస్థ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఐఏఎస్ అధికారుల బృందం సింగరేణి ప్రాంతాల్లోని భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనులను సందర్శించాలని చైర్మన్ సూచించారు. కార్యక్రమంలో ఈఅండ్ఎం డైరెక్టర్ ఎస్.శంకర్, పీఅండ్‌పీ డైరెక్టర్ బి.భాస్కర్‌రావు, అడ్వైజరీ మైనింగ్ డీఎన్ ప్రసాద్, సీడీఎస్, ఎస్పీ జీఎం ఆంథోనిరాజా తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ ట్రైనీ అధికారుల బృందంలో యుతులు ముజామిల్‌ఖాన్, మిక్కిలినేని మనుచౌదరి, కుమారి ఇలా త్రిపాఠీ, మిలిండ్ బాప్నా, రాహుల్ శర్మ, రాజర్షి షా, ప్రతీక్ జైన్, అవిష్యాంత్ పాండా ఉన్నారు. -
పుష్కరాలకు ఇద్దరు ట్రైనీ ఐఏఎస్‌లు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : కష్ణా పుష్కరాల్లో భక్తులకు క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకుగాను ఇద్దరు ట్రైనీ ఐఏఎస్‌లను జిల్లాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2015 బ్యాచ్‌కు చెందిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ట్రైనీ కలెక్టర్లు గౌతం పొట్రు, పామెల సత్పతిలను నియమించింది. శుక్రవారం విధుల్లో చేరిన వారు పుష్కరాలు ముగిసే వరకు ఆయా ఘాట్ల వద్ద సేవలు అందిస్తారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటారు.