ఆకతాయిలు విసిరిన బీరుసీసాలు..
వెల్గటూరు: గ్రామాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లపై ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో బీరు సీసాలు విసురుతూ నానా హంగామా సృష్టించారు. వారు బస చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయం తలుపులు, కిటికీలు పగులగొట్టారు. ఆకతాయిల చేష్టలకు నిశ్చేష్టులయిన ఐఏఎస్‌లు భయంతో వణికిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పడ్కల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామాల్లోని స్థితిగతులను తెలుసుకునేందుకు శిక్షణలో భాగంగా మండలంలోని పడ్కల్ గ్రామానికి ట్రైనీ ఐఏఎస్‌లు అభినవ్ రతీ, అమిత్‌షిరాన్, గోపాల్‌షా, హర్షసింగ్ వచ్చారు. వారికి పంచాయతీ కార్యాలయంలో బస ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో భోజనం తెచ్చేందుకు ఇన్‌చార్జి అధికారి రత్నాకర్ బయటకు వెళ్లాడు.
ఆ సమయంలో వెల్గటూరు, రాజారాంపల్లి, కొత్తపేట, కప్పారావుపేట, పడ్కల్ గ్రామాలకు చెందిన పలువురు యువకులు ట్రైనీ ఐఏఎస్‌ల వద్దకు చేరారు. అప్పటికే వారు మద్యం సేవించారు. అధికారులతో మాట్లాడాలని పేర్కొంటూ నానా రభస సృష్టించారు. వారి పరిస్థితిని చూసిన అధికారులు తలుపులు వేసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన మాదాసు అభిషేక్, మేకల ప్రభాకర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఐఏఎస్‌లను పరుష పదజాలంతో దూషించారు. రాళ్లు, కర్రలు, బీరుబాటిళ్లను విసురుతూ భయభ్రాంతులకు గురిచేశారు. కర్రలతో కిటికీల నుంచి దాడికి యత్నించారు.
బీరు సీసాలను కిటికీల్లోంచి విసిరేశారు. దీంతో భయాందోళనకు గురైన అధికారులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్‌ఐ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అయినా ఆకతాయిలు వినిపించుకోకపోవడంతో వారిని స్టేషన్‌కు తరలించారు. మండల పరిషత్ అటెండర్, వీఏవో రత్నాకర్ ఫిర్యాదు మేరకు అభిషేక్ సహా పది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment