Tram
-
కంచికి చేరిన కథ ఇది!
150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కోల్‌కతా ట్రామ్‌ల కథ ముగిసిపోతోంది. ట్రామ్‌ల సేవలను నిలిపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రోడ్లపై ట్రామ్‌లు కనిపించవు. కేవలం ఒక మార్గంలో ట్రామ్‌లు నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది కూడా ఎక్కవ రోజులు కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోల్‌కతాకు పర్యాయపదమైన ఈ ప్రజా రవాణా వాహనాలు ప్రస్థానం ముగిసిపోతుండడం నగర ప్రజలను, పర్యాటకులను ఆవేదనకు గురిచేస్తోంది. ట్రామ్‌ల విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రామ్‌ల గురించి తెలుసుకోవడం ఆసక్తికరం. సుదీర్ఘ ప్రయాణం 👉 కోల్‌కతాలో(అప్పటి కలకత్తా) బ్రిటిష్ ప్రభుత్వం 1873 ఫిబ్రవరి 24న ట్రామ్‌లను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత ఉత్తర కలకత్తాలోని సీల్డా–అర్మేనియా ఘాట్ మధ్య 3.9 కిలోమీటర్ల మార్గంలో ట్రామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. గుర్రాలు ఈ ట్రామ్‌లను లాగేవి. 👉 ట్రామ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో 1873 నవంబర్‌లో సేవలు నిలిపివేశారు. 👉 1880 నవంబర్‌లో ట్రామ్‌లు మళ్లీ పట్టాలెక్కాయి. లండన్‌లో రిజిస్టరైన ‘కలకత్తా ట్రామ్వేస్ కంపెనీ’ఆధ్వర్యంలో మీటర్ గేజ్ ట్రామ్‌లను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ట్రామ్లకు ఎదురే లేకుండాపోయింది. 👉 1882లో స్టీమ్ ఇంజన్లు వచ్చాయి. 1900వ సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ ఇంజన్లు దశలవారీగా ప్రారంభించారు. 👉 1943 నాటికి కోల్‌కతాతోపాటు హౌరాలోనూ ట్రామ్‌లు విస్తరించాయి. ప్రయాణ మార్గం దాదాపు 70 కిలోమీటర్లకు చేరుకుంది. 1960 నాటికి ‘కలకత్తా ట్రామ్వేస్ కంపెనీ’ ఆధ్వర్యంలో ట్రామ్‌ల సంఖ్య 450కి చేరింది. 👉 1969 దాకా ట్రామ్‌లు వైభోగం అనుభవించాయి. విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. క్షీణదశ ఆరంభమైంది. 👉 1970 అక్టోబర్‌లో హౌరాలోని బంధాఘాట్లో, 1971 డిసెంబర్లో శివపూర్‌లో ట్రామ్‌లను నిలిపివేశారు. 1973 మే నెలలో కోల్‌కతాలోని నిమ్తాలా ఘాట్‌లో ట్రామ్ సేవలకు తెరపడింది. 👉 వేర్వేరు ప్రయాణ సాధనాలు, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ట్రామ్లకు ఆదరణ పడిపోయింది. 👉 కోల్‌కతాలో 1948లో బస్సులు, 1984ల మెట్రో రైళ్లను ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో ఎల్లో ట్యాక్సీలు, ఓలా, ఉబర్ వంటివి వచ్చాయి. ట్రామ్‌లతో పోలిస్తే ఇవన్నీ వేగవంతమైన ప్రయాణ సాధనాలే. అందుకే జనం అటువైపు మొగ్గుచూపారు. 👉 1969లో మొత్తం 70.74 కిలోమీటర్ల మార్గాల్లో పరుగులు పెట్టిన ట్రామ్‌లు ఇప్పుడు కేవలం 3 మార్గాల్లో 19.4 కిలోమీటర్లకు పరిమితం అయ్యాయి. నిత్యం కేవలం 3 వేల మంది ట్రామ్‌ల్లో ప్రయాణిస్తున్నారు. 👉 2011లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రామ్‌ల సంఖ్యను, ప్రయాణ మార్గాలను భారీగా తగ్గించారు. కోర్టు ఏం చెబుతుందో? ట్రామ్‌ల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించడాన్ని సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టులో 2021, 2022లో రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెంగాల్ రవాణా సంస్థ చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ట్రామ్‌లను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని కమిటీకి సూచించింది. అధిక జనాభాతో కిక్కిరిసిపోతున్న కోల్‌కతాలో ఈ ట్రామ్‌ల వ్యవస్థ ఇకపై అవసరం లేదని కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఒక నివేదికను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శికి అందజేశారు. ఈ నివేదికను హైకోర్టులో సమర్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు ట్రామ్లపై హైకోర్టులో తదుపరి విచారణ వచ్చే ఏడాది 8న జరుగనుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
కోల్‌కతాలో ట్రామ్లకు సెలవు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ట్రామ్‌లు. రహదారుల మధ్యలో పట్టాల మీదుగా పరుగులు తీసే ట్రామ్‌ల్లో ప్రయాణించడం ఒక మధురమైన జ్ఞాపకం. నగరంలో 150 సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రామ్‌ల సేవలను త్వరలో పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి స్నేహశిష్ చక్రబర్తి వెల్లడించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆధునిక కాలంలో నగరంలో వేగవంతమైన ప్రయాణ సాధనాల అవసరం నానాటికీ పెరుగుతోందని అన్నారు. తక్కువ వేగంతో ప్రయాణించే ట్రామ్‌ల వల్ల రోడ్లలో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, తరచుగా ట్రాఫిక్ జామ్‌ల వల్ల జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే ట్రామ్‌ల సేవలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ‘‘ట్రామ్‌లు 1873 నుంచి కోల్‌కతా సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. కానీ నగరంలో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. అందుకే ఇకపై ట్రామ్‌లను నడపలేం’’ అన్నారు.పలు మార్గాల్లో వాటినిప్పటికే పూర్తిగా నిలిపేసినట్లు గుర్తుచేశారు. మిగిలిన మార్గాల్లోనూ ముగింపు పలుకుతున్నట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు తప్పించాలన్న ఉద్దేశంతోనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని వివరణ ఇచ్చారు. కేవలం మైదాన్– ఎస్ప్లాండే హెరిటేజ్ మార్గంలో మాత్రమే ఇకపై ట్రామ్‌లు నడుస్తాయని చెప్పారు. -
వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?
CCTV Footage shows Man Tries Dog Planting Faece: కొంతమంది కొందర్ని కించపరిచే ఉద్దేశంతోనో లేక శాడిజంతోనే తెలియదు గానీ కొన్ని భయంకరమైన పనులు చేస్తారు. పైగా వాటిని చూస్తే చాలా జుగుప్సకరంగా కూడా అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత చెండాలమైన పనిచేశాడో చూడండి. (చదవండి: వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!) అసలు విషయంలోకెళ్లితే....టర్కీలోని ఒక వ్యక్తి ఇస్తాంబుల్ వెళ్లుతున్న ఒక బస్సు సీటులో కుక్క మలం ఉంచుతాడు. ఆ ఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుంది. ఆ తర్వాత చాలా మంది అక్కడ ఇస్తాంబుల్‌లో అందరికి సుపరిచితమైన వీధి కుక్క అయిన బోజీ పనిగా భావిస్తారు. అయితే ఇస్తాంబుల్ మునిసిపాలిటీ ప్రతినిధి మురత్ ఒంగున్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడుతుంది. దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారంతో మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లును చెడుగా చూపించేందుకే ఇలా చేస్తున్నారంటూ అక్కడ స్థానిక మీడియా చెబుతోంది. అంతేకాదు గతంలో మేయర్ పరువు తీయడానికి జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ (ఎకెపి) అనేక ప్రయత్నాలు చేసిందని వెల్లడించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటజన్లు సిగ్గుతెచ్చుకోండి మరీ ఇలాంటి పనుల చేస్తారా అంటూ ఆ వ్యక్తి పై మండిపడుతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా) Wow, Turkey can still surprise me with how evil people can be! Disgusting man tries to defame an opposition-darling dog, Boji, who famously travels on public transport, by planting dog shit on a seat. OK, I just read that back. Turkey is surreal.pic.twitter.com/7jmisr8heO — Can Okar (@canokar) November 20, 2021 -
ట్రామ్‌రైలులో కాల్పులు
ది హేగ్: న్యూజిలాండ్‌లో నరమేధం ఘటన మరవకముందే నెదర్లాండ్స్ నెత్తురోడింది. నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్ట్ పట్టణంలో సోమవారం ట్రామ్‌రైలులో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మేయర్ జాన్‌వాన్ జానెన్ ప్రకటించారు. ఈ చర్య ఉగ్రదాడేనని భావిస్తున్నట్లు చెప్పారు. కాల్పులు జరిపిన తరువాత దుండగుడు పారిపోయాడని, అతని కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలికి ప్రజల రాకపోకల్ని నియంత్రించి, దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బాధితులకు సత్వర సాయం అందించేందుకు అక్కడికి హెలికాప్టర్లను పంపించామని చెప్పారు. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ భవనం ముందు ఉగ్ర వ్యతిరేక బలగాలు తనిఖీలు విస్తృతం చేశాయి. కెమెరాలతో కూడిన జాకెట్లు వేసిన జాగిలాలతో ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని పెద్ద పట్టణాల్లో ఒకటైన ఉట్రెక్ట్‌లో ట్రామ్ పట్టాలపై వస్త్రాలతో కప్పిన మృతదేహాలు ఉన్న చిత్రాల్ని స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని మార్క్ రుటె తన అధికారిక కార్యక్రమాలను రద్దుచేసుకుని, అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. దేశంలో అసహనానికి చోటులేదని, ఈ దాడిలో ఉగ్ర కోణాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు. అనుమానితుడి అరెస్ట్.. సోమవారం ట్రామ్‌రైలులో దాడికి అనుమానితుడిగా భావిస్తున్న టర్కీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు, గోక్‌మన్ టానిస్‌గా గుర్తించిన అతని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. నలుపు రంగు దుస్తులు, గడ్డంతో అతను ట్రామ్‌లో ప్రయాణిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. దాడి తరువాత ఉట్రెక్ట్ పట్టణంలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు విమానాశ్రయాలు, ఇతర కీలక భవనాలు, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాల్లో అడపాదడపా ఉగ్ర దాడులు జరిగినా, నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఘటనలు అరుదే. గత ఆగస్టులో 19 ఏళ్ల అఫ్గాన్ పౌరుడు అమ్‌స్టర్‌డ్యామ్ ప్రాంతంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఇద్దరు అమెరికన్లను గాయపరిచాడు. -
డ్రైవర్ లేని ట్రామ్ బండి...
ముందుగా కార్లు వచ్చాయి.. ఆ తరువాత లారీలు.., మోటర్‌బైక్‌లు, డ్రోన్లు క్యూకట్టాయి. డ్రైవర్ల అవసరం లేని వాహనాల తీరిది. తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరుతోంది... ట్రామ్! రైలుబడే కానీ.. కొంచెం తేడాగా పనిచేస్తుంది ట్రామ్. జర్మనీలోని పోట్స్‌డ్యామ్ నగరంలో సిమెన్స్, కాంబినో సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన అటానమస్ ట్రామ్‌లు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. ఇతర డ్రైవర్ రహిత వాహనాల మాదిరిగానే ఇది కూడా కృత్రిమ మేధ ఆధారంగానే పనిచేస్తుంది. లిడార్, రాడార్ సెన్సర్లతోపాటు కెమెరాలను ఉపయోగించుకుని చుట్టూ ఉన్న పాదచారులు, వాహనాలను గమనిస్తూ ముందుకు వెళుతుంది ఈ ట్రామ్. ట్రాక్ పక్కన ఉండే సిగ్నళ్లను ఎప్పటికప్పుడు గమనించి అందుకు తగ్గట్టుగా పనిచేస్తాయి కూడా. మొత్తం ఆరు కిలోమీటర్ల ట్రాక్‌పై దీన్ని పరీక్షించి చూశారు. ట్రామ్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒకరు ఉద్దేశపూర్వకంగా ఓ వస్తువును ట్రాక్ అవతలకు చేరేలా పట్టుకున్నప్పుడు సెన్సర్లు ఆ విషయాన్ని గుర్తించి వెంటనే ట్రామ్‌ను ఆపివేయడం గమనార్హం. పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తయినప్పటికీ సాఫ్ట్‌వేర్‌ను మరింత ఆధునీకరించిన తరువాత ఈ డ్రైవర్ రహిత ట్రామ్‌లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సిమెన్స్ కాంబినో సంస్థలు భావిస్తున్నాయి. -
చైనాలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభం
బీజింగ్: ప్రజా రవాణా వ్యవస్థలో చైనా మరో ముందడుగు వేసింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి పర్యావరణహితమైన ట్రామ్‌ను శుక్రవారం ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలి పర్యావరణహితౖ హైడ్రోజన్ ట్రామ్‌గా ఇది రికార్డుల్లోకెక్కనుంది. ఈ ట్రామ్ద్వారా తొలిసారిగా నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని తంగ్షన్‌లో కమర్షియల్ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ఈ ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న ఈ ట్రామ్ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. -
ట్రామ్‌ను విక్రయించే ఆలోచన లేదు
సాక్షి, ముంబై : నగర చరిత్రకు చిహ్నంగా గుర్తింపు పొందిన ‘ట్రామ్’ను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించబోమని బెస్ట్ సమితి అధ్యక్షుడు అరుణ్ దుద్వడ్కర్ స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాల నుంచి ఆనిక్ బస్ డిపోలో నిలిచి ఉన్న ట్రామ్‌ను ఆయన శనివారం సందర్శించారు. ట్రామ్‌కు శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు చేసి భావితరాల కోసం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని బెస్ట్ పరిపాలన విభాగాన్ని ఈ సందర్భంగా ఆదేశించారు. ‘ట్రామ్‌ను తుక్కు సామాను కింద విక్రయించడం వల్ల వచ్చే ఆదాయంతో బెస్ట్ సంస్థకు ఒరిగేదేమి లేదు. 45 ఏళ్ల కిందట నగర రహదారులపై పరుగులు తీసిన ట్రామ్‌ల గురించి వృద్ధులు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. అందులో ప్రయాణించిన ముంబైకర్లు ఆ జ్ఞాపకాలను ఇప్పటి కి నెమరు వేసుకుంటున్నారు. అంతటి చరిత్ర ఉన్న ట్రామ్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. వందలాది ట్రాముల్లో ప్రస్తుతం ఒకటే మిగిలింది. కనీసం దాన్నైనా కాపాడుకోవాలి’ అని దుద్వడ్కర్ అన్నారు. ఆనిక్ బస్ డిపోలో నిలిచి ఉన్న ఏకైక డబుల్ డెక్కర్ ట్రామ్‌ను వేలం పాటలో లేదా తుక్కు సామాను కింద విక్రయించాలని బెస్ట్ పరిపాలన విభాగం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శివసేనతోపాటు ఇతర పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో స్పందించిన అరుణ్ దుద్వడ్కర్, ట్రామ్‌ను విక్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.