ముగిసిపోనున్న 150 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం
బ్రిటిష్ పాలకుల హయాంలో 1873 నుంచి సేవలు
1969 నుంచి ఆరంభమైన క్షీణదశ
ట్రామ్‌లపై వచ్చే ఏడాది జనవరిలో హైకోర్టు విచారణ
150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కోల్‌కతా ట్రామ్‌ల కథ ముగిసిపోతోంది. ట్రామ్‌ల సేవలను నిలిపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రోడ్లపై ట్రామ్‌లు కనిపించవు. కేవలం ఒక మార్గంలో ట్రామ్‌లు నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది కూడా ఎక్కవ రోజులు కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోల్‌కతాకు పర్యాయపదమైన ఈ ప్రజా రవాణా వాహనాలు ప్రస్థానం ముగిసిపోతుండడం నగర ప్రజలను, పర్యాటకులను ఆవేదనకు గురిచేస్తోంది. ట్రామ్‌ల విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రామ్‌ల గురించి తెలుసుకోవడం ఆసక్తికరం.
సుదీర్ఘ ప్రయాణం
👉 కోల్‌కతాలో(అప్పటి కలకత్తా) బ్రిటిష్ ప్రభుత్వం 1873 ఫిబ్రవరి 24న ట్రామ్‌లను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత ఉత్తర కలకత్తాలోని సీల్డా–అర్మేనియా ఘాట్ మధ్య 3.9 కిలోమీటర్ల మార్గంలో ట్రామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. గుర్రాలు ఈ ట్రామ్‌లను లాగేవి.
👉 ట్రామ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో 1873 నవంబర్‌లో సేవలు నిలిపివేశారు.
👉 1880 నవంబర్‌లో ట్రామ్‌లు మళ్లీ పట్టాలెక్కాయి. లండన్‌లో రిజిస్టరైన ‘కలకత్తా ట్రామ్‌వేస్ కంపెనీ’ఆధ్వర్యంలో మీటర్ గేజ్ ట్రామ్‌లను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ట్రామ్‌లకు ఎదురే లేకుండాపోయింది.
👉 1882లో స్టీమ్ ఇంజన్లు వచ్చాయి. 1900వ సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ ఇంజన్లు దశలవారీగా ప్రారంభించారు.
👉 1943 నాటికి కోల్‌కతాతోపాటు హౌరాలోనూ ట్రామ్‌లు విస్తరించాయి. ప్రయాణ మార్గం దాదాపు 70 కిలోమీటర్లకు చేరుకుంది. 1960 నాటికి ‘కలకత్తా ట్రామ్‌వేస్ కంపెనీ’ ఆధ్వర్యంలో ట్రామ్‌ల సంఖ్య 450కి చేరింది.
👉 1969 దాకా ట్రామ్‌లు వైభోగం అనుభవించాయి. విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. క్షీణదశ ఆరంభమైంది.
👉 1970 అక్టోబర్‌లో హౌరాలోని బంధాఘాట్‌లో, 1971 డిసెంబర్‌లో శివపూర్‌లో ట్రామ్‌లను నిలిపివేశారు. 1973 మే నెలలో కోల్‌కతాలోని నిమ్‌తాలా ఘాట్‌లో ట్రామ్ సేవలకు తెరపడింది.
👉 వేర్వేరు ప్రయాణ సాధనాలు, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ట్రామ్‌లకు ఆదరణ పడిపోయింది.
👉 కోల్‌కతాలో 1948లో బస్సులు, 1984ల మెట్రో రైళ్లను ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో ఎల్లో ట్యాక్సీలు, ఓలా, ఉబర్ వంటివి వచ్చాయి. ట్రామ్‌లతో పోలిస్తే ఇవన్నీ వేగవంతమైన ప్రయాణ సాధనాలే. అందుకే జనం అటువైపు మొగ్గుచూపారు.
👉 1969లో మొత్తం 70.74 కిలోమీటర్ల మార్గాల్లో పరుగులు పెట్టిన ట్రామ్‌లు ఇప్పుడు కేవలం 3 మార్గాల్లో 19.4 కిలోమీటర్లకు పరిమితం అయ్యాయి. నిత్యం కేవలం 3 వేల మంది ట్రామ్‌ల్లో ప్రయాణిస్తున్నారు.
👉 2011లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రామ్‌ల సంఖ్యను, ప్రయాణ మార్గాలను భారీగా తగ్గించారు.
కోర్టు ఏం చెబుతుందో?
ట్రామ్‌ల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించడాన్ని సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టులో 2021, 2022లో రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెంగాల్ రవాణా సంస్థ చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ట్రామ్‌లను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని కమిటీకి సూచించింది. అధిక జనాభాతో కిక్కిరిసిపోతున్న కోల్‌కతాలో ఈ ట్రామ్‌ల వ్యవస్థ ఇకపై అవసరం లేదని కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఒక నివేదికను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శికి అందజేశారు. ఈ నివేదికను హైకోర్టులో సమర్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు ట్రామ్‌లపై హైకోర్టులో తదుపరి విచారణ వచ్చే ఏడాది 8న జరుగనుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment